ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త తరహాలో అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టేందుకు సమాయత్తమయ్యారు. ఇందుకు సంబంధించి రంగం సిద్ధమైంది. గతంలో స్వయంగా క్షేత్రస్థాయిలో ఆకస్మి కంగా పర్యటించిన చంద్రబాబు తాజాగా మారిన సాంకేతిక హంగులకు పదును పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టెలి కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ కు భిన్నంగా సెల్ ఫోన్ లతోనే పాలనా యంత్రాంగాన్ని హడలగొట్టనున్నారు. ఈ మేరకు బుధవారం నుంచి నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో కొత్తగా రూపొందించిన రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో రొజూ రెండున్నర గంటలపాటు గడపాలని నిర్ణయించారు.
ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ వాల్ ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా క్షేత్ర స్థాయి సంఘటనలను అంచనా వేయనున్నారు. ఆర్టీజీ కేంద్రంలో ముఖ్యమంత్రి కూర్చుని రాష్ట్రంలోని ఏ అధికారి లేదా సిబ్బంది సెల్ ఫోన్ తో మాట్లాడేందుకు వెసులుబాటు ఏర్పడింది. ఫలితంగా సెల్ ద్వారా వీడియో సౌకర్యం కొత్త టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటాతో కొత్త కార్యకరమానికి శ్రీకారం చుట్టాలని రంగం సిద్దం చేసిన ఆర్టిజి కేంద్రం నుంచి సెల్ ఫోన్ కాల్ వెళ్ళిందంటే సదరు సిబ్బంది ఫొటో దృశ్యాలు కనిపిస్తాయి. పైగా ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నదీ స్పష్టంగా కనిపిస్తుంది. వారితో ముఖ్యమంత్రి నేరుగా సచివాలయంలోని ఆర్టిజి కేంద్రంలో కూర్చుని మాట్లాడే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యూయి.
ఈ కేంద్రం నుంచి ముఖ్యమంత్రి ప్రయోగాత్మకంగా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తో పాటు ఎంపిటిసి, వైద్య అధికారితో మాట్లాడి ఆశ్చర్యంలో ముంచెత్తారు. నేరుగా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. దిశానిర్దేశం చేశారు. ఇదే ఒరవడిని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఫలితంగా ముఖ్యమంత్రి తీరుతో ఎవరికి ఎప్పడు సచివాలయం నుంచి ఫోన్ వెళుతుందోననే గుబులు అధికార వర్గాలలో ప్రారంభమైంది. ఒక చోట తిరుగుతూ మరో చోట ఉన్నామంటూ సదరు సిబ్బంది అబద్దాలు చెప్పేందుకు తాజా టెక్నాలజీలో ఆస్కారం లేకుండా పోయింది.
గతంలో ఆకస్మిక పర్యటనల తరహాలోనే తాజా ప్రణాళిక ఉండటం విశేషం. ఒకవైపు అధికారులతో పాటుప్రజా ప్రతినిధులు, సాధారణ ప్రజలతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఒక వైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు, సామాన్యులతో నిరంతరం మాట్లాడుతూనే, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో సంభవించిన సమస్యకైనా అందుబాటులో ఉన్న డేటా ద్వారా విశ్లేషించి సత్వర పరిష్కారాన్ని సూచించడం జరగనుంది. ఏ ప్రదేశంలో అయితే సంఘటన జరుగుతుందో అక్కడ డ్రోన్లను, కెమెరాలను వినియోగించి పూర్తి స్థాయిలో విశ్లేషించేందుకు ఆర్టిజి కేంద్రంలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది...