క్షేత్రస్థాయిలో ఉన్న అధికారి అక్కడి నుంచే ముఖ్యమంత్రితో నేరుగా సంభాషించే అత్యాధునిక వ్యవస్థ అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. రియల్ టైమ్ గవర్నెన్స్ ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ మందిరం(బార్కో)ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేసిన దీని ద్వారా అధికారులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే ఇబ్బంది నుంచి ఉపశమనం కలగనుంది. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి పనితీరును.. 1100కు వస్తున్న ఫిర్యాదులను.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను.. ఇలా ప్రతి సమాచారాన్ని విశ్లేషించే వెసులుబాటు ఇక్కడ ఉంది.
కేవలం విశ్లేషణలతో సరిపెట్టకుండా దానికి అనుగుణంగా అవసరమైన నిర్ణయాలూ తీసుకుంటారు. స్వయం గా సీఎం చంద్రబాబు నిత్యం ఒక గంటసేపు ఈ కేంద్రంలో గడపనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం అత్యవసర సమయాల్లో 24 గంట లూ పనిచేస్తుంది. ఇక్కడ నిరంతరం పనిచేసేందుకు, వచ్చిన సమాచారాన్ని, అభిప్రాయాలను, సమస్యలను విశ్లేషించేందుకు 40 మంది సాంకేతిక నిపుణులు ఉంటారు. అధికారి సెల్‌ఫోన్ ద్వారా ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడి నుంచే నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి సర్వే లెన్స్ కెమెరాల ద్వారా రాష్ట్రం మొత్తాన్ని ముఖ్యమంత్రి నేరుగా వీక్షించొచ్చు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5వేల కెమెరాలు ఏర్పాటుచేశారు. త్వరలో మరో 15వేల కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీచేయొచ్చు. అవసరమైతే ఆయా ప్రాంతంలో డ్రోన్ల సాయంతో తాజా పరిస్థితిని తిలకిస్తూ ఆదేశాలిచ్చే వ్యవస్థ ఏర్పాటుచేశారు.
రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ) రాష్ట్ర కేంద్రం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ కార్యాలయంలో కూర్చొనే రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించే వెసులుబాటు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 15 వేల సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా పెద్ద ఉత్సవాలు, భారీ ఊరేగింపులు, ఆందోళనలు ఏది జరిగినా అక్కడి ట్రాఫిక్‌ను, పరిస్థితిని ఇక్కడి నుంచి చూసి అంచనా వేసి నియంత్రించేలా ఏర్పాట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత ఎలా ఉందన్న విషయాన్ని అక్కడ ఉన్న సీసీ కెమెరాల సాయంతో ఈ కేంద్రం నుంచి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వొచ్చు.