2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 11.72 శాతం వృద్ధి రేటును నమోదుచేసింది. ఇది జాతీయ వృద్ధి రేటు కంటే రెట్టింపుగా ఉండటం విశేషం. జాతీయస్థాయిలో తొలి త్రైమాసిక వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది. గడచిన 3 మాసాలకు గాను దేశంలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, బీహార్, తెలంగాణా, మహారాష్ట్ర తొలి 5 రాష్ట్రాలలో చోటు సాధించాయి.
తొలి త్రైమాసికంలో ప్రాథమిక రంగంలో 27.60 శాతం, పరిశ్రమ రంగంలో 8.05 శాతం, సేవారంగంలో 8.67 శాతం వృద్ధి నమోదయ్యింది. 2011-12 ధరల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మూడు రంగాలలో కలిపి జీవీఏ రూ.1,19,652 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలలో రూ.23,374 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.34,599 కోట్లు, సేవారంగంలో రూ.61,679 కోట్లుగా ఉంది.
ప్రాథమిక రంగంలో ఆకట్టుకునే వృద్ధి నమోదు అవడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ప్రాథమిక రంగంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో అద్భుతమైన వృద్ధి రేటు కనిపించింది. వ్యవసాయ రంగంలో నమోదైన 27.60 శాతం వృద్ధి రేటులో మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ ప్రధాన భూమిక వహించాయి. మత్స్యశాఖ 42.09 శాతం, పశు సంవర్ధక శాఖ 14.69 శాతం వృద్ధిని కనబర్చాయి. పరిశ్రమ రంగంలో తొలి త్రైమాసికంలో 14.65 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 8.05 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యింది. వీటిలో ప్రధానంగా మైనింగ్, క్వారీయింగ్ పరిశ్రమల్లో 8.2 శాతం, తయారీ రంగంలో 8.83 శాతం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాలలో 11.94 శాతం, నిర్మాణ రంగంలో 5.67 శాతం, పరిశ్రమ రంగంలో 8.05 శాతం వృద్ధి నమోదయ్యింది.
సేవారంగంలో తొలి త్రైమాసికంలో 13.90 శాతం లక్ష్యంగా నిర్ధేశించుకోగా, 8.67 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇందులో ట్రేడ్, హెచ్ అండ్ ఆర్ రంగంలో 11.08 శాతం, రవాణా, నిల్వ రంగంలో 9.04 శాతం, ఆర్థిక సేవల్లో 9.54 శాతం, రియలెస్టేట్, నివాస రంగాలలో 5.3 శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 8.16 శాతం, ఇతర సేవలలో 9.24 శాతం వృద్ధి నమోదయ్యింది.
ఇవీ లక్ష్యాలు..
జీవీఏలో 74 శాతం వాటాగా వున్న 9 రంగాలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించి తగు లక్ష్యాలను నిర్దేశించారు. పశు సంవర్థక శాఖలో రూ.72వేల కోట్లు, తయారీరంగంలో రూ.67 వేల కోట్లు, ఉద్యాన శాఖలో రూ.62 వేల కోట్లు, నిర్మాణ రంగంలో రూ.62 వేల కోట్లు, వర్తకం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్ల రంగంలో రూ.61 వేల కోట్లు, మత్స్య, సముద్ర ఉత్పత్తుల రంగంలో రూ.60 వేల కోట్లు, రవాణ, నిల్వ రంగంలో రూ.60 వేల కోట్లు, వ్యవసాయ రంగంలో రూ.56 వేల కోట్లు, రియల్ ఎస్టేట్, నివాస రంగాలలో రూ.71 వేల కోట్లు చొప్పున జీవీఏ సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
జక్కంపూడిలో జెట్ సిటీ
కృష్ణాజిల్లా జక్కంపూడిలో జెట్ సిటీ పేరుతో ఆర్థిక నగరం ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీకారం చుట్టారు. 265 ఎకరాలలో నెలకొల్పుతున్న ఈ భారీ ప్రాజెక్టులో ఆర్థిక కార్యకలాపాల కోసం 2.5 మిలియన్ చదరపు అడుగులు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం 2 మిలియన్ చదరపు అడుగుల మేర నిర్మాణాలు జరుపుతారు. ఇందులో 15 వేల నివాస గృహాలు రానున్నాయి. 22 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది.
మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా పబ్లిక్ సెక్టారు నుంచి రూ.3 వేల కోట్లు, ప్రైవేట్ సెక్టారు నుంచి రూ.10 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. దీంతోపాటు 250 ఎకరాలలో ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ సిటీ, 215 ఎకరాలలో అపెరల్ సిటీలతో పాటు 980 ఎకరాలలో మరో 6 పొటెన్షియల్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు.
తలసరి ఆదాయంలో 6 వ స్థానం
2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో తలసరి ఆదాయం రూ.1,22,376. 2016-17లో దేశంలో తలసరి ఆదాయం రూ.1,03,219. గత ఏడాదితో పోల్చితే తలసరి ఆదాయం 13,1 శాతం వృద్ధితో రూ.14,214 పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా హర్యానా (రూ.1,80,174) నిలిచింది.