విజయవాడ రాజకీయాలే కాక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఒక కుదుపు కుదిపిన అంశం, వంగవీటి రాధా కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. రంగా వర్ధంతి సందర్భంగా గుడ్లవల్లేరు మండలంలో రంగా విగ్రహావిష్కరణ చేసిన సమయంలో, తన హ-త్యకు రెక్కీ నిర్వహించారని, తనని భయపెట్టి లొంగ దీసుకోవాలని అనుకుంటే, అది జరగని పని అని అన్నారు. బెదిరింపులకు లొంగను అని, దేనికైనా రెడీ అని రాధా వ్యాఖ్యలు చేసారు. అయితే రాధా చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. రాధా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారు అనే చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా రాధా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పటికీ అధిష్టానంతో మంచిగానే ఉన్నారు. చంద్రబాబు తూర్పు నియోజకవర్గంలో రాధాను సెట్ చేయటానికి కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో రాధా చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే రాధా వ్యాఖ్యల పై చర్చ జరుగుతూ ఉండగానే, కొడాలి నాని, జగన్ తో మాట్లాడి, రాధా కు 2+2 గన్‌మెన్ల సెక్యూరిటీ కేటాయిస్తున్నాం అని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడానని, వెంటనే ఆయన సెక్యూరిటీ ఇచ్చారని కొడాలి నాని చెప్పారు. అయితే రాధా నిన్నటి నుంచి అందుబాటులో లేరు.
ఈ రోజు బయటకు వచ్చిన రాధా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్లను తిరస్కరించారు. 2+2 గన్‌మెన్లను సెక్యూరిటీ అవసరం లేదని, వారిని వెనక్కి తిప్పి పంపించారు. గన్‌మెన్లు తనకు అవసరం లేదని అన్నారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇది జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం అని చెప్పినా, రాధా తిరస్కరించటంతో, ఈ స్కెచ్ వెనుక వైసీపీ నేతలే ఉన్నారా అనే చర్చ జరుగుతుంది. అయితే మరో పక్క, వైసీపీ నేత దెవినేని అవినాష్ అనుచరుడు అలాగే వైసీపీ నేత అయిన అరవ సత్యం పోలీసులు అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నిన్న అరవ సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే పోలీసుల విచారణలో అరవ సత్యం స్పృహ తప్పి పడిపోయారు. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ గా అరవ సత్యం ఉన్నారు. దేవినేని అవినాష్ అనుచరుడు కావటంతో, ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. పోలీసులు మాత్రం, ఈ అరెస్ట్ ధృవీకరించలేదు.