రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటే, మంత్రులు వచ్చి అవి ప్రజలకు చెప్తారు. మరీ పెద్ద నిర్ణయం అయితే, ఏకంగా ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి ప్రజలకు చెప్తారు. అది మంచి అయినా, చెడు అయినా, ప్రజలకు నేరుగా చెప్పటం ముఖ్యమంత్రి, మంత్రుల ధర్మం. నిన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పని చేసారు. ఈ ప్రెస్ మీట్ పై అనేక విమర్శలు ఉన్నా, అవి అన్నీ పక్కన పెడితే, మంచో, చెడో, మీడియా ముందుకు వచ్చి నేరుగా చెప్పారు. ముఖ్యంగా ఈ సారి తెలంగాణాలో వారి వేయొద్దు అంటూ రెండు రోజుల క్రిందట తెలంగాణా వ్యవసాయ మంత్రి చెప్పటం, అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటంతో, కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. వరి వేయొద్దు అని ఎందుకు చెప్తున్నమో చెప్తూ, కేసీఆర్ మొత్తం వివరించారు. ఇక ఇదే సందర్బంలో ప్రస్తుతం దేశంలో నడుస్తున్న పెట్రో, డీజిల్ ధరల తగ్గింపు పై స్పందించారు. కేంద్రం కొండంత పెంచి, పిసరంత తగ్గించిందని, రాష్ట్రాలను కూడా తగ్గించమని అంటుందని, తమ రాష్ట్రంలో 2014లో ఎంత వ్యాట్ ఉందో, ఇప్పుడు అంతే ఉందని, అందుకే తాము రూపాయి కూడా తగ్గించం అని, ఏమైనా తగ్గించాలి అంటే కేంద్రమే తగ్గించాలని, పెట్రోల్ పై కేంద్రం వేస్తున్న సుంకం మొత్తం తగ్గించాలి అంటూ కేసీఆర్ డిమాండ్ చేసారు.
మరి రాష్ట్రం ఎందుకు తగ్గించదో ఆయనకే తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నులు వేస్తుంది కదా, అది ఎందుకు తగ్గించరు ? సరే ఇది పక్కన పెడితే, మంచో , చెడో కేసీఆర్ ముందుకు వచ్చి, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించం అని తేల్చి చెప్పేసారు. ఇక ప్రజలు తేల్చుకుంటారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వైఖరి పై విమర్శలు వస్తున్నాయి. నిన్నటి రోజున జగన్ మోహన్ రెడ్డి, కోట్లు ఖర్చు పెట్టి మరీ, పెట్రోల్, డీజిల్ ధరల పై వాస్తవాలు అంటూ, ఒక ఫుల్ పేజి ప్రకటన ఇచ్చారు. చివరకు తగ్గిస్తామో, తగ్గించామో చెప్పలేదు కానీ, మొత్తం అవాస్తవాలతో, ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో ఉన్న వాటి పై అనేక విమర్శలు ఉన్నాయి. అవి పక్కన పెడితే, జగన్ మోహన్ రెడ్డి ఇలా కోట్లు ఖర్చు చేసి ప్రకటన ఇచ్చే బదులు, నేరుగా మీడియా ముందుకు వచ్చి, అదే వాస్తవాలు చెప్పొచ్చు కదా ? ఎందుకు కేసీఆర్ లాగా జగన్ మీడియా ముందుకు రాలేదు ? తాము ఇచ్చిన ప్రకటనలో అవాస్తవాలు ఉన్నాయి కాబట్టి, అవే మీడియా ముందుకు వచ్చి చెప్తే దొరికిపోతాం అని జగన్ మీడియా ముందుకు రాలేదని టిడిపి ఆరోపిస్తుంది. ఏది ఏమైనా ప్రకటనల కంటే, జగన్ మీడియా ముందుకు వస్తే, ప్రజలకు మరింతగా అర్ధం అయ్యేది, రాష్ట్రానికి డబ్బులూ మిగిలేవి