బాదుడే బాదుడు అంటూ, పెట్రోల్, డీజిల్ రెట్ల పై, గత చంద్రబాబు ప్రభుత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డి ఊరు ఊరు తిరిగి ఎలా ఎండగట్టారో అందరం చూసాం. అప్పట్లో చంద్రబాబు పెంచిన వ్యాట్ కేవలం రూ.2 రూపాయాలు. దాని కోసమే నానా యాగీ చేసి, జగన్ మోహన్ రెడ్డి చేసిన హంగామా ఇంతా అంతా కాదు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తారని అందరూ భావించారు. అయితే రేట్లు తగ్గించక పోగా, భారీగా వ్యాట్ పెంచేసారు. రోడ్డు సెస్ అని, లీటర్ కు రూ.1 బాదేసారు. ఇవన్నీ ఇలా ఉండగా, పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరిగిపోయాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాదిలో టాప్ ఉంటే, దేశంలోనే రెండో స్థానంలో మన ధరలు ఉన్నాయి. ఈ ఇంపాక్ట్ అన్ని నిత్యవసరాల మీద కూడా పడింది. ఈ నేపధ్యంలో, కేంద్రం మీద ఉప ఎన్నికల సెగ తగలటంతో, వారు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారు. పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించారు. దీపావళి కానుక అంటూ కేంద్రం ప్రకటించింది. కేంద్రం ధరలు తగ్గించటంతో, రాష్ట్రాలు కూడా వ్యాట్ ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దాదాపుగా దేశంలో ఉన్న 23 రాష్ట్రాలు, పెట్రోల్, డీజిల్ ధరల పైన వ్యాట్ తగ్గిస్తూ, కేంద్రం తగ్గించిన దానికి అదనంగా తగ్గించారు.
కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన రెండు కలుపుకుని దాదాపుగా 16 రూపాయల వరకు చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం, ధరలు తగ్గించ లేదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు తగ్గించటంతో, ఏపి కూడా తగ్గిస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు నాలుగు రోజుల తరువాత ఏపి ప్రభుత్వం స్పందించింది. ఎప్పుడు తగ్గిస్తామో, ఎంత తగ్గిస్తామో చెప్పలేదు కాని, సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటాం అని, ప్రజలకు ఊరట ఇచ్చే నిర్ణయం చెప్తాం అంటూ, ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. దీంతో ఏపి ప్రభుత్వం కూడా తగ్గిస్తుందనే ఆశలు ప్రజల్లో ఉన్నాయి. మరి ఎంత తగ్గిస్తారు, ఎప్పుడు తగ్గిస్తారు ? అసలు తగ్గిస్తారా ? లేక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి ఇలా కవర్ చేసారా ? మరో పక్క ఈ అంశం తెలుగుదేశం పార్టీ మంగళవారం నాడు, అన్ని పెట్రోల్ బంకుల్లో నిరసనకు పిలుపు ఇచ్చింది.