వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లోపల ఎలా ఉన్నా, బయటకు మాత్రం క్లౌడ్ 9లో ఉన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల ఫలితంతో తాము అసాధారణ వ్యక్తులం అన్నట్టు హడావిడి చేస్తున్నారు. ప్రజలు అంతా తమకే పట్టం కట్టారని, 90 వేల మెజారిటీ అంటే మాటలు కాదు అంటూ హడావిడి చేస్తున్నారు. సహజంగా ఎవరు అయినా ఇలాగే చేస్తారు. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, తమ పరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు అని చెప్పుకోవటం సహజం. అంటే మూడు సార్లు పెరిగిన కరెంటు చార్జీలకు ప్రజలు పట్టం కట్టారని అనుకోవాలా ? పెట్రోల్, డీజిల చార్జీల పెరుగుదలకు ప్రజలు పట్టం కట్టారని అనుకోవాలా ? అధ్వానమైన రోడ్డులు, అప్పులు, రాజధాని లేని రాష్ట్రం, ఇలా అనేక విధ్వంసాలకు ప్రజలు పట్టం కట్టారని అనుకోవాలా ? కాదు కదా ? మరి బద్వేల్ లో ఏమి జరిగింది ? బద్వేల్ లో జరిగింది ఉప ఎన్నిక. అక్కడ అభ్యర్ధి చనిపోతే జరిగిన ఉప ఎన్నిక.అదే కుటుంబం నుంచి వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వటంతో, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎన్నికకు దూరంగా ఉంది. తిరుపతిలో వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చారు కాబట్టి పోటీ పెట్టారు. బద్వేల్ లో అదే కుటుంబం నుంచి టికెట్ ఇచ్చారు కాబట్టి, టిడిపి ప్రధాన ప్రతిపక్షంగా దూరంగా ఉంది.ఇక కొద్దో గొప్పో బలం ఉన్న జనసేన కూడా ఈ ఎన్నికకు దూరంగా ఉంది. ఇక మిగిలింది ఒక శాతం కూడా ఓటింగ్ లేని బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ పోటీలో నిలిచాయి. అంటే ఈ ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి కానీ, తరువాత బలం ఉన్న పార్టీ జనసేన కానీ పోటీ చేయలేదు.
మరి ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోలేమా ? అభ్యర్ధి చనిపోయారు కాబట్టి సానుభూతి, అలాగే ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయలేదు కాబట్టి, సులభంగా పెద్ద మెజారిటీతో గెలుపు అనేది అనివార్యం. గతంలో కంటే 8 శాతం ఓటింగ్ తక్కువ పడింది. అదీ కాక ఇక్కడ తిరుపతి లాగే దొంగ ఓట్ల జాతర జరిగిందని వీడియోలు కూడా వచ్చాయి. ఇలాంటి గెలుపుని కూడా గెలుపు అని గొప్పగా చెప్పుకుంటూ, డబ్బా కొడుతుంటే ఇంకా ఏమి చెప్పాలి ? అలా అనుకుంటే, ఇలాగే 2015లో తిరుపతి ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికకు దూరంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి 1,16,524 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు వైసిపీకి వచ్చింది కేవలం 90,228 మెజారిటీ మాత్రమే, అంటే అప్పటి టిడిపి కంటే 25 వేల మెజారిటీ తక్కువ. మరి అప్పుడు టిడిపి ఇలాగే చేసిందా ? వాస్తవంలో బ్రతకకుండా, పోటీ లేని చోట గెలుపుని కూడా అధికార పక్షం గొప్పగా చెప్తుంది అంటేనే, వాళ్ళు ఎదో విషయంలో భయపడుతూ, అన్నీ పెద్దదిగా చెప్పుకుని తిరుగుతున్నారని అర్ధం అవుతుంది.