ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా, ఐఆర్ ఇచ్చినా, ఉద్యోగులకు అనేక విధాలుగా తోడ్పాటు ఇచ్చినా, ఆర్ధిక పరిస్థితి బాగోక పోయినా, సమయానికి జీతాలు ఇచ్చినా, ఇలా ఎన్ని చేసినా, చంద్రబాబుని ఓడించి, జగన్ ను గెలిపించుకున్నారు. మొదటి సారి జగన్ సచివాలయానికి వచ్చినప్పుడు, జై జగన్ అంటూ, నినాదాలు కూడా చేసారు. ఇంకేముంది మా జీవితాలు మారిపోతాయని అనుకున్నారు. వద్దంటే బెనిఫిట్స్ వస్తాయి, ఇక మాకు పండుగే అని అనుకున్నారు. కాని సీన్ రివర్స్ అయ్యింది. బెనిఫిట్స్ సంగతి తరువాత, ముందు జీతాలు ఫస్ట్ తారిఖు కాదు, మొదటి వారంలో పడితే చాలు అని దండం పెట్టుకునే స్థాయికి వచ్చారు. అన్ని రాష్ట్రాలు పీఆర్సి ఇస్తున్నా, మనకు లేకపోయినా, ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారు. డీఏలు బాకీ ఉన్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాకీ ఉన్నాయి, జీతాలు పడటం లేదు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అనేక సమస్యలతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఉద్యోగుల పై ఒత్తిడి పెరుగుతూ రావటంతో, వారు కూడా ఇక ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టటం, సజ్జల ఫోన్ చేయటంతో, కంట్రోల్ లోనే ఉంటాం అని చెప్పటం, అందరూ చూసారు.
తరువాత పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు అంటూ, సజ్జల వద్దకు వెళ్లారు. ప్రభుత్వంతో చర్చలు అని సజ్జల వద్దకు వెళ్ళటం పై విమర్శలు వచ్చినా, వెనక్కు తగ్గలేదు. ఇక అక్కడ సజ్జల, ఈ నెలాఖరు నాటికి పీఆర్సి అని ప్రకటించారు. దీని పై ప్రభుత్వం వైపు నుంచి తదుపరి చర్యలు కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో, చీఫ్ సెక్రటరీ నుంచి పిలుపు వచ్చింది. పిలుపు వచ్చిందని సంతోషించే లోపే, ఈ భేటీలో ఆర్ధిక పరమైన విషయాలు తప్ప, మీ సమస్యలు అన్నీ చెప్పండి అంటూ నోట్ వచ్చింది. అయితే ఉద్యోగులు ప్రధాన సమస్యలు అన్నీ ఆర్ధిక పరమైన అంశాలే కావటంతో, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూసి అవక్కయారు ఉద్యోగులు. మరి ఈ సమావేశంలో ఆర్ధిక పరమైన అంశాలు మాట్లాడక పొతే, సజ్జల హామీ ఇచ్చినట్టు ఈ నెలాఖరు లోపు పీఆర్సి ఎలా ఇస్తారు అంటూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పెద్ద మనసుతో చీఫ్ సెక్రటరీ అన్నీ ఆలకించాలని కోరుకుంటున్నారు.