క-రో-నా అంక్షల నేపధ్యంలో, టిటిడి పరిమిత సంఖ్యలోనే, భక్తులకు టికెట్లు ఇస్తూ వస్తు ఉంది. దీంతో శ్రీవారి దర్శనానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి నెలకు సంబంధించిన టికెట్లను టిటిడి ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. అయితే ఇంతకు ముందు టిటిడి ఆన్లైన్ వెబ్సైటుని, టిసిఎస్ సంస్థ నిర్వహించేది. సహజంగా టికెట్లు విడుదల చేసే సందర్భంలో, అందరూ ఒకేసారి వెబ్సైటులోకి టికెట్ లు బుక్ చేసుకుంటానికి ఎంటర్ అవుతారు. దీంతో సర్వర్ మొరాయిస్తుంది. ప్రతి సారి ఇదే సమస్య వస్తూ ఉండటంతో, టిటిడి విమర్శలు పాలు అవుతుంది. ఈ నేపధ్యంలోనే టిటిడి ప్రత్యామన్యాల పై దృష్టి పెట్టింది. అయితే దీని పై అమెజాన్ సర్వర్లను కోరగా, వారు భారీగా కోట్ చేయటంతో, టిటిడి అధికారులు అంత డబ్బులు పెట్టే ఉద్దేశం లేదని, రిలయన్స్ అంబానీకి సంబంధించిన జియోని వారు సంప్రదించినట్టు సమాచారం. ఈ విషయం పై రిలయన్స్ టిటిడి చైర్మెన్ సుబ్బా రెడ్డి, ఇతర అధికారులు మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే రిలయన్స్ కూడా ఇందుకు అంగీకరించినట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు, వచ్చే నెల టికెట్లను టిటిడి విడుదల చేసింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో భక్తులు టికెట్లు బుక్ చేసుకోవటానికి, ఆ పేజి లోకి వచ్చి షాక్ తిన్నారు.
టికెట్ బుకింగ్ చేసుకుందామని టిటిడి వెబ్సైటు ఓపెన్ చేస్తే, అది జియో మార్ట్ అనే వెబ్సైటుకి వెళ్తుంది. ప్రభుత్వ వెబ్సైటుకి కాకుండా, ఇలా రిలయన్స్ వెబ్సైటుకి వెళ్ళటం పై, పలువురు ఆశ్చర్య పోయారు. అలాగే సాంకేతిక సమస్య కూడా అలాగే ఉంది. చాలా సేపు టికెట్లు బుక్ అవ్వలేదు. ప్రజలకు టిటిడి వెబ్సైటుని రెలియన్స్ కు ఇచ్చారని తెలియక పోవటంతో, సోషల్ మీడియాలో టిటిడి పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఒక ప్రైవేటు ఏజెన్సీకి డైరెక్ట్ గా వాళ్ళ వెబ్సైటులో టికెట్ లు ఇవ్వటం, అక్కడ ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం రిలయన్స్ కు వెళ్తుంది ఏమో అనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేసారు. ఎన్నో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండగా, రిటైల్ వ్యాపారం చేసే రిలయన్స్ కు ఇవ్వటం పై కూడా విమర్శలు వస్తున్నాయి. దీని పై స్పందించిన టిటిడి, ప్రయోగాత్మకంగా చేసామని, వచ్చే నెల నుంచి మొత్తం సెట్ అయిపోతుందని, ఇబ్బందులు ఏమి ఉండవని, ఇలాంటివి లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు.