ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, అక్కడి సమస్యలపై ప్రభుత్వ వైఖరేమిటనే దానిపై చర్చించడానికి ఆ ప్రాంత టీడీపీ నేతలు సమావేశమవుతుంటే, సారా సత్తి బాబు అని పిలవబడే మంత్రి బొత్స సత్యనారాయణ పొంతన లేకుండా ఏదేదో మాట్లాడాడని, టీడీపీనేత, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి రాజధాని లేదని ప్రజలందరూ బాధపడుతున్నారని చెప్పిన బొత్స, అమరావతి రైతులతో మాట్లాడాల్సిన పనిలేదని చెప్పడం సిగ్గు చేటన్నారు. రాజధానికి శంఖుస్థాపన జరగడానికి ముందు, ఆనాడు ఉన్న తెలుగుదేశంప్రభుత్వం రైతులతో ఏం మాట్లాడిందో, ఎలాంటి ఒప్పందాలు చేసుకుందో, సీఆర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పందమేంటో, మంత్రి బొత్సకు తెలియదని ఆయన వ్యాఖ్యలతోనే అర్థమవుతోందన్నారు. జగన్ కు, ఆయన ప్రభుత్వానికి, మంత్రులకు రాజధానికి వెళ్లి, అక్కడి రైతులు, మహిళలతో మాట్లాడే దమ్ము, ధైర్యం, పరిస్థితులను అవగాహాన చేసుకునేంత జ్ఞానం ఉన్నాయని తాము అనుకోవడం లేదని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి వారి ముందుకు పోవడానికి ధైర్యంలేని వారే, ముఖ్యమంత్రిలా పరదాల మాటున చాటు మాటున తిరుగుతుంటారన్నారు. ఆ విషయం సంగతి పక్కన పెడితే, కరకట్ట కమల్ హాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేశ్ లు కిరాయికి మనుషులను తీసుకొచ్చి, రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన మూడు రాజధానుల శిబిరం ఏర్పాటుపై బొత్సకు సిగ్గుందా అని మర్రెడ్డి నిలదీశారు. నిజంగా బొత్సకు సిగ్గుంటే, మూడు రాజధానుల శిబిరంలోని వారితో మాట్లాడాలన్నారు. మూడు రాజధానులు ఎప్పుడు కడతారో శిబిరంలోని వారికి చెప్పి, మంత్రి బొత్స తక్షణమే వారి దొంగ దీక్షలు విరమింప చేయాలన్నారు. సిగ్గుశరం లేకుండా అమరావతి రైతులతో చర్చించేది ఏమీలేదని చెబుతున్న బొత్సకు మతి పూర్తిగా పోయిందనడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు తేల్చిచెప్పారు. విశాఖను ఈ ప్రభుత్వం, మంత్రి బొత్స ఏం చేయదలుచుకున్నారో చెప్పాలన్నారు? జగన్ అధికారం లోకి వచ్చినప్పటినుంచీ విశాఖ మహానగరంలోని భూములతో పాటు, చుట్టు పక్కలున్న విలువైన భూములను తమకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నది వాస్తవం కాదా అన్నారు.
టీడీపీప్రభుత్వం తీసుకొచ్చిన లులూ గ్రూప్, అదానీ గ్రూప్ లు తరలి పోయాయని, భోగాపురం భూముల్లో పాలకులు కుంభకోణాలకు సిద్ధమయ్యారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కూడా లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్నారు. ద ప్రైడ్ విశాఖ స్టీల్ ను పోస్కోకు ధారాధత్తం చేయడానికి బొత్స లాంటి పోసుకోలు బృందమంతా ప్రయత్నాలు చేస్తోందన్నారు. గతంలో ఫోక్స్ వ్యాగన్ కంపెనీతో బొత్స ఏం వెలగబెట్టాడో అందరికీ తెలుసునన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ నేతలవి ఉత్తుత్తి పోరాటాలని ప్రజలందరికీ అర్థమైందన్నారు. బయటి వ్యక్తుల భూములను బలవంతంగా లాక్కొని, రిజిస్ట్రేషన్లు చేయిం చుకోవడానికే బొత్స, విశాఖ రాజధాని కావాలంటున్నాడన్నారు. విశాఖ ను రాజధాని చేయమని బొత్సను, ఎవరు అడిగారో చెప్పాలన్నారు. అమరావతిని విశాఖకు తరలిస్తుంటే, కరకట్ట కమల్ హాసన్, బూతుల మంత్రి నానీలు ఏం చేస్తున్నారని, వారినే బొత్స ఎందుకు ప్రశ్నించడన్నారు. ప్రాంతాల మధ్య విబేధాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి, ప్రభుత్వ రంగ ఆస్తులను పరులకు దారాధత్తం చేసి వాటాలు పంచుకోవడానికి, పోతుందేమో అనుకుంటున్న మంత్రి పదవిని నిలబెట్టుకోవడానికే మంత్రి బొత్స నోటికొచ్చినట్లు మాట్లాడుతన్నాడని మర్రెడ్డి మండిపడ్డారు. కలుగులో ఎలుకలా బొత్స అప్పుడప్పుడు బయటకు వస్తుంటాడని, సీనియర్ అయిన బొత్స మంత్రి పదవికేమీ ఇప్పట్లో ఢోకా ఉండదని, కాకపోతే ఆయన కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని మర్రెడ్డి హితవు పలికారు. మున్సిపల్ శాఖా మంత్రిగా బొత్స ఇది వరకు విశాఖలో సమావేశం నిర్వహించాడని, ఆ సమయంలో విజయసాయిరెడ్డి లేకుండా ఆ సమావేశం ఎందుకు పెట్టారని ముఖ్యమంత్రి నిలదీస్తే, సత్తిబాబు నేలచూపులు చూశాడన్నారు. ఆర్థిక ఉగ్రవాది విజయసాయిరెడ్డికి ఉన్న ప్రాధాన్యత కూడా మంత్రి బొత్సకు ముఖ్యమంత్రి వద్ద లేదని తేలిపోయిందన్నారు. అలాంటి బొత్స అమరావతి రైతులగురించి, సుజల స్రవంతి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం మానుకుంటే ఆయనకే మంచిదని శ్రీనివాసరె డ్డి హితవు పలికారు.