కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, జగన పాలన పై సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి పాలన తీవ్ర నిరాస పరిచిందని, వైఎస్ఆర్ ఆశయాలకు ఏమాత్రం ఈ పరిపాలన సరిపోదని అన్నారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆమె మాటలు, యధాతధంగా, "ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. విభజనకు కాంగ్రెస్ సహకరించింది అని మా మీద కోపగించుకుంటారు కానీ, ఆంధ్రప్రదేశ్ విడిపోతే, అభివృద్ధిలో దూసుకుపోయే సత్తా ఉంది. ఎందుకు అంటే అది కోర్ బిజినెస్ ఏరియా. అక్కడ పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్స్ ఉన్న రాష్ట్రాలు చూడండి, ఎంత అభివృద్ధి చెందుతున్నాయో. బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కరు, పోర్ట్స్ దగ్గరలో కంపెనీలు పెడతారు. అభివృద్ధి జరుగుతూ ఉంది అనుకున్న సమయంలో, సడన్ గా పడిపోయింది. రాష్ట్ర రాజధాని ఏంటో ఎవరికీ తెలియదు, జరుగుతా ఉన్నది ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. షర్మిల గారు నేను వారసురాలని అని చెప్పుకుంటూ ఉంది, మరి అమరావతిలో ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్లతో షర్మిల గారు, విజయమ్మ గారు ఎందుకు మాట్లాడలేదు ? జగన్ గారికి చెప్పి, ఎందుకు సమస్య పరిష్కారం చేయటం లేదు ? అక్కడున్న సమస్యలు వదిలేసి, ఇక్కడ దుకాణం ఎందుకు పెట్టారో అర్ధం కావటం లేదు. అమరావతి రైతులకు మేము కూడా, వ్యక్తిగతంగా నేను కూడా మద్దతు పలుకుతున్నా అని అన్నారు.
"ఇప్పటికే అక్కడ చాలా నిర్మాణాలు జరిగాయని, పెద్ద ఆక్టివిటీ జరిగిందని, విదేశాల నుంచి కూడా ఫోకస్ వచ్చిందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూసి వాళ్ళు అందరూ షాక్ లో ఉన్నారు. ఒక రాజధాని నిర్మాణాన్ని మధ్యలో ఎలా ఆపగలరు ? రాజధాని ఇక్కడ కాదు అని వేరే చోటుకు ఎలా వెళ్ళిపోతారు ? రైతులకు న్యాయం చేస్తారని అంటారు కానీ, రైతులకు ఏమి న్యాయం చేస్తున్నారు ? ఇది ఒక నియంత ప్రభుత్వంలా ఉంది. డబ్బులు పంపిస్తాం, ఇంటికి రేషన్ పంపిస్తాం, కష్టపడే అవసరం లేదు అని డబ్బా కొడతారు, ఈ రోజు జీతాలు ఇవ్వటానికి కూడా మీకు డబ్బులు లేవు. మరి మీ ఆర్దిక క్రమశిక్షణ ఏంటి ? ఇది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అంటే, ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విభజన తరువాత అక్కడ రైతులకు భూమి విలువ పెరిగితే, ఇప్పుడు దాన్ని నాశనం చేసారు. ప్రజాస్వామ్య విలువలు ఏమి లేవు అక్కడ. ఇంకా చెప్పాలి అంటే, చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్తే, ఏపి ఇంకా నష్టపోతుందని, మేము మాట్లాడటం లేదు. జగన్ పాలన చూస్తే చాలా బాధగా ఉందని" అన్నారు.