టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పై మరో కేసు నమోదు అయ్యింది. ఆయనను టార్గెట్ చేస్తూ వస్తున్న వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా విజయసాయి రెడ్డి, గత నెల రోజులుగా హడావిడి చేస్తున్నారు. అయితే, మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ ఉండటంతో, ఉద్యోగులు అందరూ కలిసి ఈవో వెంకటేశ్వరరావు ముందు నిరసన తెలిపారు. దీంతో, మాన్సాస్ చైర్మన్ అంటే అశోక్ గజపతి రాజుతో పాటుగా, కరస్పాండెంట్‌తో సహా 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసారు. దీని పై పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. మాన్సాస్ ఉద్యోగులు వేతనాలు అడిగితే అక్రమ కేసులా? అంటూ మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించాలి- ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలని, ఉత్తరాంధ్రలో భూకబ్జాలకు పాల్పడుతున్న విజయసాయిరెడ్డి &కో పై కేసు నమోదు చేయాలి కళా వెంకట్రావ్ డిమాండ్ చేసారు. ఈ రోజు విలేఖరులతో మాట్లాడిన ఆయన, మాటల వివరాలు... "మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ ల ఛైర్మన్ గా సంచయత నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంతో జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. క్రమం తప్పకుండా పనిచేస్తున్న మాన్సాస్ ఉద్యోగులు జీతాలు అడిగితే అక్రమ కేసులు బనాయిస్తూ జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కరోనా సమయంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీతాలు తీసుకున్నారు. అలాంటిది పనిచేసే ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నారు. 16 నెలలుగా సగం జీతాలు చెల్లిస్తున్నారు. జూన్ నెల వేతనం రూపాయి కూడా చెల్లించలేదు. సగటు ఉద్యోగి జీతం అడిగితే అక్రమ కేసులు నమోదు చేస్తారా? విధుల్లో నుంచి తప్పిస్తారా? జగన్ రెడ్డి పాలనలో మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు అందక భిక్షాటన చేయడం చూశాం. ఒకప్పుడు ఆర్థికంగా లోటులేని మాన్సాస్ సంస్థ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి జగన్ రెడ్డి దిగజార్చారు. సిబ్బంది జీతాల సమస్య ఇంతవరకు మాన్సాస్ లో ఎప్పుడూ లేదు. జగన్ రెడ్డి విధానాలతో నిత్యం సమస్యలు వెంటాడుతున్నాయి. "
"ఉద్యోగులను అక్రమంగా తొలగించారు. మాన్సాస్ ట్రస్ట్ సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించాలి. ఉద్యోగులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. ఉత్తరాంధ్రలో భూకబ్జాలకు పాల్పడుతున్న విజయసాయిరెడ్డి &కో పై కేసు నమోదు చేయాలి. జగన్ రెడ్డి పాలన అంతా ముప్పై మూడు కబ్జాలు, అరవై ఆరు లూటీలుగా సాగుతోంది. రాష్ట్రాన్ని భూ మాఫియా కొండ చిలువలా చుట్టేసింది. మాన్సాస్ భూములు కొట్టేసేందుకు అర్ధరాత్రి హడావుడి జీవోలతో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా సంచయితను నియమించిన జగన్ రెడ్డికి.. హైకోర్టు తీర్పుతో కూడా కనువిప్పు కలగలేదు. సేవాభావంతో పనిచేస్తున్న ట్రస్ట్ పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను, హిందువుల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు 13 వేల ఎకరాల భూములను ఏ-2 ఆధ్వర్యంలో కబ్జా చేసేందుకు కుట్ర పన్నారు. వారి కుట్రలకు న్యాయస్థానాల ద్వారా అడ్డుకట్టపడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా మాన్సాస్ ట్రస్ట్ పట్ల కక్షసాధింపు ధోరణిని విడనాడాలి.
"