జస్టిస్ ఎన్వీ రమణ.. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వ కారణం. గుంటూరు జిల్లాలో పుట్టి, దేశ అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. ఆయన తెలుగు వారు కావటం, అదీ మన ఆంధ్రప్రదేశ్ వారు కావటం మనకు గర్వ కారణం. ఆయన వచ్చిన నెల రోజుల్లోనే ఆయన మార్క్ ఏమిటో చూపించారు. ఇది ఇలా ఉంటే, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, జస్టిస్ ఎన్వీ రమణ మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. నిన్న తిరుమల వెళ్లి వెంకన్నను దర్శనం చేసుకున్న ఎన్వీ రమణ, ఈ రోజు హైదరాబాద్ వెళ్ళారు. అయితే ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ అఫ్ ఇండియాకు ఉన్న ప్రోటోకాల్స్ దాదాపుగా ఉంటాయి. అయితే నిన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల వచ్చిన సందర్భంలో, అదీ మొదటి సారి చీఫ్ జస్టిస్ అయిన తరువాత, సొంత రాష్ట్రం వచ్చిన సందర్భంలో, ఆయనకు ఘన స్వాగతం లభిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే సాదా సీదాగా ఆయనకు స్వాగతం లభించిందనే చర్చ జరుగుతుంది. కేవలం టిడిపి చైర్మెన్, టిటిడి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఆయనకు స్వాగతం పలికారు.
చిత్తూరు జిల్లా మంత్రులు కూడా రాకపోవటం చర్చనీయాంశం అయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి కూడా హాజరు కాలేదు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డిలాంటి వాళ్ళు మాత్రమే కనిపించారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు, గవర్నర్ పెద్ద వయసు కాబట్టి వచ్చి ఉండరు, మంత్రులు కూడా ఎవరూ వెళ్ళలేదు. ఇక ఆయన తిరుమల పర్యటన ముగించుకుని హైదరబాద్ చేరుకున్నారు. ఇక్కడ పూర్తి భిన్న వాతావరణం నెలకొంది. మంత్రి కేటీఆర్ సహా ఇతర మంత్రులు స్వాగతం పలికారు. ఆయన బస చేసిన దగ్గరకు, సియం కేసీఆర్, గవర్నర్ కూడా వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణా క్యాబినెట్ సగం వరకు మంత్రులు వచ్చి ఆయన్ను కలిసారు. తమ రాష్ట్రం కాకపోయినా, సాటి తెలుగువారు అనే మమకారంతో, కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ , జస్టిస్ ఎన్వీ రమణ సొంత రాష్ట్రం కాబట్టి, మొదటి సారి చీఫ్ జస్టిస్ అయిన తరువాత వచ్చారు కాబట్టి, ఇక్కడ కూడా అంతలా ఆయనకు ఘన స్వాగతం పలికి ఉండాల్సిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ విమర్శలకు ఏపి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుందో.