తిరుపటి ఉప ఎన్నిక జరిగిన తీరు పై చంద్రబాబు, మీడియాతో మాట్లడారు. ఆయన మాటల్లో.. "తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ పార్టీలు పాల్గొన్నాయి. వైసీపీ చేసిన దుర్మార్గాలను అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాయి. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం 2,200 మంది సెంట్రల్ ఫోర్స్, 800 మంది మైక్రో అబ్జవర్స్, అన్ని బూతుల్లో వెబ్ కెమార్లు పెడతామని చెప్పింది. వందలాది బస్సులు, కార్లలో జనాలను తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను దొంగ ఓట్లు వేయించేందుకు తీసుకొచ్చారు. వందల మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. మామూలుగానైతే ఎన్నికల జరిగే సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన బలగాలతో తనిఖీ చేస్తారు.. కానీ అది ఎక్కడా జరగలేదు. ఇన్ని వేల వాహనాలను పోలీసులను ఎలా అనుమతించారు? ఎందుకు చెక్ పోస్టులను తీసేశారు? తెల్లవారు జాము నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వస్తున్న వారిని అన్ని రాజకీయ పార్టీలు పట్టుకున్నా ఎందుకు సెంట్రల్ అబ్జర్వర్లు పట్టించుకోలేదు? దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి ప్రశ్నిస్తే తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితి. భర్త పేరు తెలియని భార్య, తండ్రి పేరు తెలియని కుమారులు వచ్చి అడ్డంగా దొరికితే పారిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లోకి కొన్ని వేల మందిని తరలిస్తే పోలీసులు ఎక్కడున్నారు? ప్రశ్నించిన టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. ఇదేనా న్యాయం, ధర్మం, ఇదేనా ప్రజాస్వామ్యం కాపాడటం అంటే? రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న జగన్ రెడ్డి కోసం పోలీసులు పని చేస్తున్నారు. పనబాక లక్ష్మీ దొంగ ఓటర్లను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే మా నాయకులను అరెస్టు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులందరూ పోరాడుతున్నారు. బందిపోట్లను మరిపించేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. దీనిని ప్రజలంతా గమనించాలి. వైసీపీ ముఠా గ్యాంగ్ తో తిరుపతి నాశనం కావాల్సిందేనా? పోలీసులు వాలంటీర్లు, వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఎన్నికలను ప్రహసనంగా మార్చారు. మా ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తుంటే అధికారులకు సిగ్గనిపించడం లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక వ్యక్తి కాకపోయినా తిరుపతిలో బరితెగించి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల జరిగే ప్రాంతాల్లో మంత్రులు ఎందుకు ఉన్నారు? ఒక్క ప్రతిపక్ష నాయకులనే అరెస్టు చేస్తాం, అధికారపక్షానికి ఊడిగం చేస్తామన్నట్లుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం.? ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ ప్రయత్నిస్తుంటే వైసీపీ మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఏది చేసినా ప్రజలు నమ్మేస్తారని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.
స్కూల్, కాలేజీ బస్సుల్లో తిరుపతికి అక్రమంగా దొంగ ఓటర్లను తరలించారు. దొంగల్ని పట్టుకోకుండా అమాయకులను అరెస్టు చేసి వీరంగం సృష్టించిన చంద్రగిరి ఎస్ఐ తీరు అందరూ గమనించారు. టీడీపీ నేతలు తెల్లవారు జామునుంచి పోరాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమైంది? ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదు? వైసీపీ చేస్తున్న అరాచకాలకు సీఈసీ సమాధానం చెప్పాలి.? పోలీసు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా ప్రవర్తించారు. 10 ఏళ్లు కేంద్రంలో పని చేసిన వ్యక్తి, 4 సార్లు ఎంపీగా చేసిన మహిళ దొంగల్ని పట్టించినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం కేంద్రం ఎన్నికల కమీషన్ కూడా అదే తోవలో పోతుంటే మేం ఎవరికి చెప్పాలి.? వైసీపీ అరచకాలను గట్టిగా ఖండిస్తున్నాం. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో వైఫల్యం చెందిందా? వైసీపీ చేసిన దుర్మార్గాలను వీడియా ఆధారాలతో సహా సీఈసీకి అందిస్తాం. అవ్వన్నీ పరిగణలోకి తీసుకుని తిరుపతి ఎన్నికను రద్దు చేసి సెంట్రల్ ఫోర్స్ తో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా కేంద్రం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి ధర్మాన్ని కాపాడాలి. వాలంటీర్ లు, పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అవసరమైన చోట రీపోలింగ్ పెట్టాలి. బరితెగించిన అధికారులపైనా సీఈసీ చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా వారికి వంతపాడటం ఏమాత్రం సమంజసం కాదు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలి. ఢిల్లీలోని టీడీపీ ఎంపీలు ఎన్నికల కమిషన్ ను కలిసి తిరుపతిలో ఎన్నికను అడ్డు పెట్టుకొని చేసిన దుర్మార్గాలపై ఫిర్యాదు చేస్తారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ న్యాయం చేయాలి. వాస్తవాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నికల సంఘంపై ఉన్న నమ్మకం పెంచడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.
దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని ప్రశ్నిస్తుంటే తడబడుతున్నారు. తప్పు చేస్తున్నామని వాళ్లే బాధపడుతున్నారు. సామాన్యులతో వైసీపీ నాయకులు నేరాలు చేయిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఫడవిట్ ప్రకారం తిరుపతి ఎన్నికల నియమావళిని అతిక్రమించి అక్కడే ఉన్నారు. అలాంటి వ్యక్తి మంత్రిగా ఉండటానికి అనర్హుడు. వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. పెద్దిరెడ్డి చేసిన దొంగ పనికి సిగ్గుపడకుండా బరితెగించి మాట్లాడుతున్నారు. పబ్లిక్ మీటింగ్, పెళ్లికో వచ్చినట్లు వేల మంది వచ్చారు. ఓటర్లకు నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది. తిరుపతిలో ఓటర్లందరికీ సాయంత్రం 7 గంటలకు ఓటు వేసే హక్కు ఉంటుంది. ఓటర్లు కేంద్రానికి వెళ్లినప్పుడు ఓటు వేసి ఉంటే ఛాలెంజ్ ఓటు వేస్తే ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయో భయటపడుతుంది. నిజమైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించకోకపోతే దొంగలదే పైచేయి అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి అందరం కలిసి ముందుకు రావాల్సి ఉంది. దుర్మార్గులను ఎక్కడికక్కడ నియంత్రణ చేయకపోతే రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను కోల్పోవాల్సి వస్తుంది.