రాష్ట్రంలో ప్రజాస్వామ్య వలువలు ఊడ్చబడ్డాయని, తిరుపతి ఉపఎన్నిక చూస్తే, తానెందుకు అలా అనాల్సివచ్చిందో ప్రజలకు అర్థమవుతోందని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అతిదారుణంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.."తిరుపతి ఉపఎన్నిక ఏ రకంగా జరుగుతుందో రాష్ట్రప్రజలంతా వారి పనులు ఆపిమరీ గమనించాలి. దానివల్ల ప్రభుత్వతీరు, ప్రభుత్వపెద్దల పనితీరు, ఈ ప్రభుత్వం ఏరకంగా అధికారంలోకి వచ్చిందో తెలుస్తుందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తు న్నా. వంటచేసే మహిళలు, కార్ఖానాలో పనిచేసే కార్మికులు, పొలాల్లో ఉండే రైతులు, కూలీలు అందరూ వారి పనులు పక్కనెట్టి, కాసేపు టీవీలు చూడాలి. తిరుపతి ఉపఎన్నిక ఎలా జరుగుతుందో అందరూ తెలుసుకోవాలి. ఉప ఎన్నిక పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులున్నారు.... ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్నా రు.. సెక్రటేరియట్ లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ఉన్నారు. ఢిల్లీలో ఎన్నిక ల సంఘం ఉంది. ఇన్ని ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యం యధాస్థితిలో సాగిపోతోంది. పెద్దిరెడ్డి దౌర్జన్యాలను ఆపే దిక్కులేదు ఈ రాష్ట్రంలో. పీలేరు నుంచి బస్సులో జనాలను తీసుకొస్తే, అక్కడున్న స్థానికులు వారిని ఆపి, ఎక్కడివారు ఎందుకొచ్చారని నిలదీశారు. స్థానికులతో పాటు, హోంగార్డు కూడా ఉన్నాడు. వారంతా బస్సు ఆపి, ఎక్కడి నుంచి వస్తున్నారని నిలదీయడంతో బస్సులోని వారంతా దిగి పరిగెత్తారు. బస్సు డ్రైవర్ బస్సు ఆగిపోయిందని, దొంగ ఓట్లు వేయడానికి వచ్చామని చెప్పి, కనుక్కొని బస్సును ఆపారని, బస్సులోని వారంతా పారిపోయారని, అతను బస్సు ఓనర్ కి ఫోన్ చేసి చెప్పాడు. ఆ బస్సు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం నుంచే వచ్చింది. ఆ బస్సుడ్రైవర్ పెద్దిరెడ్డికి తెలుసు. బస్సులో వచ్చినవారంతా హోంగార్డుని, స్థానికులనుచూసి ఎందుకు పారిపోయారు? బస్సుని వారు ఆపకపోతే, అందులో వచ్చినవారంతా దొంగఓట్లు వేసేవారు కదా పెద్దిరెడ్డిగారు? ప్రజాస్వామ్యానికి ఏంఖర్మ పట్టింది పెద్దిరెడ్డి మంత్రిత్వంలో, ఆయనొక మంత్రా... జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రా? మీదొక ప్రభుత్వమా?
బీజేపీ మహిళానేత శాంతారెడ్డి కొందరు దొంగఓటర్లనుపట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నైతిక విలువలున్నా, ఒక్కక్షణం ఆయన తాడేపల్లి నివాసం నుంచి శాంతారెడ్డి వైపుచూడాలి. ఆమెమాటలకు ఆయన సమాధానం చెప్పాలి. ఆమె మాటలు వింటానికి ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధమేనా? ఆ మాటలు వింటే పెద్దిరెడ్డి బతుకు ఇక అంతే... నానోటితో నేను చెప్పలేను. శాంతారెడ్డి మాటలకు ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గేయడంలేదా? ఈ ప్రభుత్వం గాజులేసుకుందని ఆమె అంటుంటే వారికి సిగ్గుగా లేదా? ఈరకంగా దొడ్డిదారిన, దొంగదారిన, గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా? జగన్మోహన్ రెడ్డి విజయాలన్నీ ఇదే విధంగా వచ్చాయా? లక్షలకు లక్షల మెజారిటీలన్నీ ఇలానే సాధించారా? జగన్మోహన్ రెడ్డి విజయాలన్నీ ఇలా దొంగ గెలుపులేనా? ప్రజలు మెచ్చి, వారికి నచ్చి గెలిపించారని అనుకుంటున్నాం. దొంగఓట్లు వేయించడంలో మీరంతా ఇంతటి దిట్టలని ఇప్పుడే తెలిసింది. ఈ రకంగా ఒకరిపేరుతో మరొకరు దొంగఓట్లు వేయడమే పెద్దనేరం, సిగ్గుచేటు. అలా వచ్చినవారికి బుద్ధిలేదు. పంపినవెధవకు సిగ్గులేదు. ఎంతో పకడ్బందీగా, నిష్ణా తులైన వారిలా దొంగఓటర్లు వ్యవహరించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి అంటే ఈ రకంగా జరుగుతాయని దేశమంతా తెలియచేస్తాం. ఇంతటితో వదిలేదులేదు. మీకు వచ్చిన మెజారిటీ అంతా ఈ విధంగా దొంగఓటర్లతో వచ్చిందే. 151సీట్లు కూడా ఇలానే వచ్చాయా? ఇటువంటి నైపుణ్యం ఎక్కడనేర్చుకున్నారో చెప్పండి. ఇదివరకు స్టూవర్ట్ పురం దొంగలబ్యాచ్ పేరుచెబితే, పోలీస్ స్టేషన్లలోని సెల్ ల తాళాలు ఊడిపోయేవి. ఇప్పుడు ఈ పార్టీ పేరుచెబితే నకిలీఓట్లు కుప్పలుకుప్పులుగా పడిపోతున్నా యి. మీ గెలుపులన్నీ ఇలా తప్పుడుదారిలో సాధించినవేనా జగన్మోహన్ రెడ్డి గారు? కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి, తిరుపతి ఉపఎన్నికను రద్దుచేయాలి.