వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే మొద‌టి నుంచీ బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ కిష‌న్ రెడ్డికి అవ్యాజ‌మైన ప్రేమ‌. హిందుత్వమే అజెండాగా న‌డిచే బీజేపీలో కీల‌క‌నేత అయిన కిష‌న్ రెడ్డి, జ‌గ‌న్ రెడ్డితో అనుబంధం కొనసాగించ‌డంలో ఎటువంటి మొహ‌మాటం ప‌డ‌రు. సుప్రీంకోర్టులో ఉన్న రాజ‌ధాని అంశంపైనా జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం కోసం కేంద్ర‌మంత్రి అయి ఉండి విశాఖ రాజ‌ధాని ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేపారు కిష‌న్ రెడ్డి. దీంతో తీవ్ర దుమారం రేగ‌టంతో మ‌ళ్లీ మాట మార్చారు కిషన్‌ రెడ్డి. ఏపీ రాజధాని అమరావతి అని దిద్దుబాటు ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్టణం రాజధాని అని తాను అన్న మాట, జిల్లా కేంద్రమైన విశాఖపట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటే కానీ, రాష్ట్ర రాజధాని విశాఖపట్టణం అన్నది నా ఉద్దేశం ఎంతమాత్రం కాదని కిష‌న్ రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ అని బీజేపీ ఇదివరకే ప్ర‌క‌ట‌న ఇచ్చింద‌ని, దీనికే తామంతా క‌ట్టుబ‌డి వున్నామ‌ని కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ నేత‌ల‌కు, కిష‌న్ రెడ్డికి ఇష్టంలేక‌పోయినా అమ‌రావ‌తే రాజ‌ధాని అని కేంద్ర పెద్ద‌లు సంకేతాలు ఇవ్వ‌డంతో అయిష్టంగానే వారు స్పందిస్తున్నారు. జ‌గ‌న్ రెడ్డి కోసం ఏకంగా కోర్టులో ఉన్న అంశంపైనే కిష‌న్ రెడ్డి మాట్లాడారంటే, ఎంత‌గా ఆ ప్రేమ ఉందో తేట‌తెల్లం అవుతుంది.

పీలేరులో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌పై దా-డి-కి య‌త్నించిన వైసీపీ మూక‌ల్ని టిడిపి కేడ‌ర్ త‌రిమేసింది.  నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు పీలేరు నియోజకవర్గంలో జ‌న‌హోరుతో క‌దం తొక్కింది. న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి త‌న స‌త్తా  చాటారు. పీలేరు ప‌ట్ట‌ణంలో అడుగు తీసి అడుగు వేసే ఖాళీ లేనంత‌గా జ‌నంతో నిండిపోయింది.  నారా లోకేష్‌ని చూసేందుకు రోడ్లవెంట మహిళలు, యువకులు ప‌రుగులు పెట్టారు. పీలేరు పట్టణంలో లోకేష్‌పై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో పీలేరు హోరెత్తిపోయింది. పెద్దెత్తున యువ‌త పాద‌యాత్ర ఆరంభ‌మైన నుంచీ రాత్రివ‌ర‌కూ యువ‌నేత వెంటే ఉన్నారు. బ‌హిరంగ స‌భ ప్రాంగ‌ణం కిక్కిరిసిపోయింది. ప్ర‌సంగానికి ఈల‌లు, చ‌ప్ప‌ట్లు మారుమోగాయి. వేదిక‌పై నుంచి మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే  చింత‌ల రామ‌చంద్రారెడ్డిపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఎక్క‌డ ఎంత దోచారో లెక్క‌లు ప్ర‌జ‌ల ముందుంచారు. పాపాల పెద్దిరెడ్డి, ఆయ‌న పార్టీని ఓడించ‌క‌పోతే రాష్ట్రానికి భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని హెచ్చ‌రించారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర పీలేరులో అంచనాల‌కు మించి దిగ్విజ‌యం కావ‌డం వైసీపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోయారు. వైసీపీ నేత, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గిరిధర్ నాథ్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిపి దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. వేలాదిగా టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా తిరగబడటంతో పారిపోయి మార్కెట్ యార్డులో దాక్కున్నారు. పాద‌యాత్ర సాగే ప్రాంతాల‌లో క‌రెంటు తీసేశారు. పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డే అడ్డంకులు క‌ల్పించారు. అయినా యువ‌గ‌ళం పీలేరులో గ‌ర్జించింది. స‌వాల్ విసిరింది. వైసీపీ మూక‌లే తోకముడిచాయి.

జ‌గ‌న్ రెడ్డి, లోకేష్ ఇద్ద‌రూ ముఖ్య‌మంత్రుల కొడుకులే. ఇద్ద‌రూ రెండు పార్టీల‌కి గుండెకాయ‌లాంటివాళ్లే. చ‌దువులో చూసుకుంటే జ‌గ‌న్ కంటే లోకేష్ ఎక్కువ చ‌దువుకున్నారు. అహంకారంలో జ‌గ‌న్, లోకేష్‌కి అంద‌నంత ఎత్తులో ఉంటాడు. సంస్కారంలో లోకేష్ ద‌రిదాపుల‌కీ రాలేడు జ‌గ‌న్. ఇది ఎవ‌రో తెలుగుదేశం వాళ్లు చెబుతున్న మాట కాదు. జ‌గ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడై, ఇప్పుడు బీజేపీలో ఉన్న జ‌మ్మ‌ల‌మ‌డుగు ఆదినారాయ‌ణ‌రెడ్డి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన అంశం. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఎంత పెద్ద వ‌య‌స్సులో వారైనా సార్ అని అనాల్సిందేనని ప‌ట్టుబ‌డ‌తాడ‌ని, సార్ అని పిల‌వ‌క‌పోతే అహం దెబ్బ తింటుంద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి వివ‌రించారు. జ‌గ‌న్ రెడ్డి ముందు కుర్చీలో కూర్చునేందుకు కూడా పార్టీలో ఎవ్వ‌రూ సాహ‌సించ‌రని చెప్పుకొచ్చారు. అయితే తానెప్పుడూ జ‌గ‌న్ రెడ్డిని సార్ అని పిల‌వ‌లేద‌ని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పిలుపు వ‌చ్చిన సంద‌ర్భంగా లోకేశ్ తో ముందుగా చ‌ర్చించాన‌ని, ఈ భేటీలో లోకేష్‌``అన్నా నేను మీ కొడుక్కంటే చిన్నోడిని. పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు`` అని అన్నాడ‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి వెల్ల‌డించారు.

విశాఖ‌లో రెండు రోజుల‌పాటు ఏపీ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్ కి ముందు, జ‌రుగుతున్న‌ప్పుడు టిడిపి కీల‌క నేత‌లు ఎవ్వ‌రూ నోరు విప్ప‌లేదు. వైసీపీని విమ‌ర్శిస్తే ఏపీ బ్రాండ్ డ్యామేజ్ అవుతుంద‌నే ఉద్దేశంతో మౌనంగా ఉన్నారు. అయితే వైసీపీ తాము నిర్వ‌హించిన స‌మ్మిట్ క‌నివినీ ఎరుగ‌ని రీతిలో విజ‌యం సాధించింద‌ని, చంద్ర‌బాబు కంటే ఎన్నో రెట్లు పెట్టుబ‌డులు సాధించామ‌ని డ‌ప్పాలు కొట్టుకోవ‌డం ఆరంభించారు. దీంతో టిడిపి యువ‌నేత నారా లోకేష్ అది గ్లోబ‌ల్ స‌మ్మిట్ కాదు లోక‌ల్ ఫేక్ స‌మ్మిట్ అంటూ మీడియా ముందుకొచ్చారు. స‌మ్మిట్, ఎంవోయూలో డొల్ల‌త‌నాన్ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు. స‌మ్మిట్ కి గ్లోబ‌ల్ అంటున్నారు..ఒక్క అంత‌ర్జాతీయ కంపెనీ అయినా వ‌చ్చిందా? అని ప్ర‌శ్నించారు లోకేష్‌. అలాగూ 370 కంపెనీల‌తో ఎంవోయూలు 13 ల‌క్ష‌ల పెట్టుబ‌డులు అని ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్ రెడ్డి అందులో 70 కంపెనీల పేర్లే ఎందుకు ప్ర‌క‌టించార‌ని నిల‌దీశారు. గ్లోబ‌ల్ టు లోక‌ల్ దింపిన లోకేష్‌, ఇన్వెస్ట‌ర్లు ఫేక్ అని ఆధారాలు బ‌య‌ట‌పెట్టారు. మ‌రోవైపు 1 ల‌క్ష రూపాయ‌లు పెట్టుబ‌డితో 2022లో పులివెందుల డైరెక్ట‌ర్ల‌తో ఆరంభ‌మైన ఇండోసోల్ 76 వేల కోట్ల పెట్టుబ‌డులు ఎలా పెడుతుంద‌ని, 25 వేల ఎక‌రాలు కొట్టేసేందుకు దీనిని తెర‌పైకి తెచ్చార‌ని ఆరోపించారు. టిడిపి హ‌యాంలో  39,450 పరిశ్రమలు తెచ్చామని, వాటి ద్వారా  5,13,350ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ మంత్రే అసెంబ్లీలో ప్ర‌క‌టించార‌ని లోకేష్ గుర్తు చేశారు. టీడీపీ హయాంలో అనంతపురం జిల్లాకు కియా, బర్జర్ పెయింట్స్, జాకీ, కడపకు వెల్ స్పన్, చిత్తూరుకు టీసీఎల్, ఫాక్స్ కాన్, సెల్ కాన్, మైక్రోమ్యాక్స్, ఫాక్స్ కాన్, డిక్సన్ కంపెనీలు, కర్నూలుకు సిమెంట్ కంపెనీలు, సోలార్ ఉత్పత్తి కేంద్రాలు, నెల్లూరు హీరోమోటార్స్, అపోలో టైర్స్, ప్రకాశం ఏషియన్ పేపర్ మిల్స్, గుంటూరు, కృష్ణాకు అశోక్ లైల్యాండ్,కేసీపీ, హెచ్.సీ.ఎల్, ఉభయగోదావరిలో అనేక ఫిషరీస్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనేక ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్ తో ఒప్పందం, లూలూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాంజియెంట్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు తెచ్చామ‌ని ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను తెచ్చిన ఒక్క కంపెనీ అయినా చూప‌గ‌లరా అని స‌వాల్ విసిరారు. పాద‌యాత్ర‌లో చిత్తూరు జిల్లాలో టిడిపి తెచ్చిన కంపెనీల ముందు సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరితే స్పందించలేని ముఖ్యమంత్రి జ‌గ‌న్ రెడ్డిని అని ఎద్దేవ చేశారు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పేరుతో ఆఫ్రికా మోడ‌ల్ మూడు రాజ‌ధానులు తెచ్చిన సీఎం జ‌గ‌న్ రెడ్డి ఆఫ్రికా మాదిరిగానే నిరుద్యోగిత శాతాన్ని 30 శాతం చేస్తార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యువ‌నేత లోకేష్ ఆధారాల‌తో స‌హా స‌మ్మిట్, పెట్టుబ‌డులు ఫేక్ అని ప్ర‌క‌టించారు. దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read