రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ కొడాలి నాని, హైకోర్టులో పిటీషన్ వేసిన నేపధ్యంలో, ఈ రోజు హైకోర్టు లో విచరణ జరిగింది. విచారణలో భాగంగా మంత్రి కొడాలి నాని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మీడియాతో ఇతర విషయాలు మాట్లాడవచ్చు కానీ, ఎక్కడా ఎన్నికల కమిషన్ పై వ్యాఖ్యలు చేయకూడదు అంటూ తీర్పు ఇచ్చింది. గతంలో మీడియా సమావేశం పెట్టిన కొడాలి నాని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ మంత్రిని నేరుగా కానీ, వివరణ రూపంలో కానీ, తాను చేసిన వ్యాఖ్యల పై వివరణ ఇవ్వాలి అంటూ, నోటీస్ జారీ చేసింది. అయితే ఈ నేపధ్యంలో అదే రోజు, కొడాలి నాని తరుపు న్యాయవాది , రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చి, కొడాలి నాని వివరణ ఇచ్చారు. మంత్రికి ఎక్కడా ఎన్నికల కమిషన్ పై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసే ఉద్దేశం లేదని, నోటీస్ వెనక్కు తీసుకోవాలని కోరారు. వివరణ పై అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పరువుకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యల పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా, కొడాలి నాని మీడియాతో , ఈ నెల 21 వరకు మాట్లాడకూడదు అని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపధ్యంలోనే కొడాలి నాని, హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ నేపధ్యంలోనే, విచారణలో భాగంగా, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపు న్యాయవాది అశ్వినీ కుమార్ తో పాటు, కొడాలి నాని తరుపు న్యాయవాది తరుపున వాదనలు విన్నారు. వాదనలు సందర్భంగా, ఇరు వర్గాల నుంచి వీడియో ఫూటేజ్ తీసుకుని పరిశీలించిన ధర్మాసనం, పూర్తీ వీడియోలు ఇవ్వటంలో ఇద్దరూ విఫలం అయ్యారని, ఇద్దరి వాదనలు సంతృప్తిని ఇవ్వలేదని, ఈ విషయం పై లోతుగా తేల్చటానికి, మరో న్యాయవాదిని నియమిస్తామని చెప్పారు. దీంతో పూర్తి నివేదిక తెప్పించుకున్న ధర్మాసనం దీని పై ఈ రోజు కీలక తీర్పు ఇచ్చింది. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని, అయితే ఎన్నికల పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై, కమీషనర్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ, ఆదేశాలు జారీ చేసింది.