అధికార వైసీపీలో వర్గ విబేధాలు గుప్పు మంటున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక లుకలుకలు బయట పడగా, అవి రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. నిన్న విశాఖలో ఏకంగా విజయసాయి రెడ్డి పైనే, బహిరంగ వేదిక పై, ఎమ్మల్యేలు ఆయన వ్యాఖ్యలు ఖండించారు. ఇక అమరావతిలో ఉండవల్లి శ్రీదేవి ఉదంతం తెలిసిందే. సొంత పార్టీ నేతలే ఆమె పేకాట వ్యవహారం అంటూ బయట పెట్టారు. ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. మరో పక్క అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ సొంత పార్టీ నేతలే రచ్చ చేసి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇక నెల్లూరులో సీనియర్ నేత ఆనం, అలాగే మరో ఎమ్మల్యే వరప్రసాద్ బహిరంగంగానే విమర్శించారు. ఇక గన్నవరంలో రచ్చ అందరూ చూసారు. మరో పక్క ఎంపీ రఘురామరాజు, రోజు రచ్చబండే పెట్టేస్తున్నారు. ఇలా ప్రతి జిల్లాలో, ఏదో ఒక చోట, ప్రతి రోజు అసంతృప్తి బయట పడుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా, పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సొంత పార్టీ మంత్రులు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏకంగా రాష్ట్ర మంత్రులను విమర్శిస్తూ, కొంత మందిని దుష్ట శక్తులతో పోల్చి, సంచలన వ్యాఖ్యలు చేసారు. శంకరాయగూడెం గ్రామంలో నిన్న ఒక కార్యక్రమంలో పాల్గున్న ఎమ్మెల్యే సొంత పార్టీ నేతల పైనే విమర్శలు గుప్పించారు.
గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చేయలేకపోతున్నాం అని, మంత్రులు సహకరించటం లేదని, నేను మొదటి సారి ఎమ్మెల్యే అని పట్టించుకోవటం లేదని చెప్తూ మంత్రుల్ని దుష్ట శక్తులతో పోల్చినట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతుంది. ఈ గ్రామంలో సచివాలయ నిర్మాణం చేయలేక పోతున్నామని, అయితే తాను ప్రయత్నం చేస్తూనే ఉంటానని అన్నారు. తన దగ్గర ఒక విధంగా, మరొకరి దగ్గర మరో విధంగా చెప్పి, గ్యాప్ తెస్తున్నారని విమర్శించారు. బహిరంగ వేదిక పై ఎమ్మెల్యే ఏమన్నారు అంటే. "ఇవన్నీ మీకు చెప్పేవి కాదు. దుష్టశక్తులు కొన్ని వచ్చాయి. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వటం వలన మంత్రులు అందరూ కూడా, నాకు పూర్తిగా సహకరించటం లేదు. మీ దగ్గర మీకు చెప్పే లాగా, మా దగ్గర మాకు చెప్పే లాగా, ఈ రోజు సంకరాయగూడెంకు అన్యాయం జరిగింది అంటే కేవలం మంత్రులు వల్లే. చూద్దాం, ఇప్పటికైనా జరుగుతుంది ఏమో. నా ప్రయత్నాలు నేను చేస్తాను. " అంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసారు.