ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వం వహిస్తున్న బెంచ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఎత్తున హెబియస్ కార్పస్ పిటిషన్లు నమోదు అయ్యాయి. ఆ హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఈ రోజు విచారణ సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుందా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. అంటే ఆర్టికల్ 356 ఉపయోగించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఏమో అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు విజయవాడకు చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లంటి లోచిని అనే వ్యక్తుల హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేస్తూ, ఈ రాష్ట్రంలో చాలా పరిణామాలు మేము గమనిస్తున్నాం, అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతుందా లేదో అని చర్చించి, విచారణ చేసి, ఏమైనా ఉత్తర్వులను, న్యాయస్థానాలు ఇచ్చే అవకాసం ఉందో లేదో చెప్పాలి అంటూ, దీనికి సంబంధించి అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించాలని, కోర్టుకు ఎంత వరకు ఈ విషయంలో వెళ్లేందుకు పరిమితులు ఉంటాయో చెప్పాలని, తమకు దీనికి సంబంధించి మొత్తం సమాచారం ఇవ్వాలని, పిటీషనర్ తరుపు న్యాయవాదిగా ఉన్న రవి తేజ అనే లాయర్ ను, గౌరవ హైకోర్టు ఆదేశించింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగపరంగా పాలన చేయటం లేదు కాబట్టి, కోర్టులు ఏమి చేయగలవో, చట్టాలు చూసి చెప్పాలని కోరింది.
అంతే కాకుండా కోర్టు, కొన్ని విషయాలు ప్రస్తావన కూడా చేసింది. ముఖ్యంగా అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్న బిల్లు, అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత, అది శాసనమండలిలో తిరస్కరణకు గురి అయితే, శాసనమండలినే రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవటం, మేము గమనించామని చెప్పింది. అలాగే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నమోదు అవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్ల పై కూడా, మేము గమనిస్తున్నాం అని కోర్టు చెప్పింది. ఇప్పటికే ఈ విషయం పై , పోలీసుల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అదే విధంగా, సోషల్ మీడియాలో న్యాయమూర్తుల పై , కోర్టుల పై చేస్తున్న వ్యాఖ్యలపై, చర్యలు తీసుకోండని, కోర్టు చెప్పినా, ఏ చర్య తీసుకొని పరిస్థితిని కు మేము గమనించామని, ఇలా పలు సందర్భాలను కోర్టు గుర్తు చేసింది. ఇలాంటి అనేక అంశాల పై అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుందా లేదా అనేది పరిశీలించాల్సి ఉందని, మీరు కూడా ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చేయండి అంటూ, కోర్టు ఆదేశించింది. మొత్తంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పనుల పై , ఇప్పటి వరకు పలు కామెంట్ లు చేస్తూ, హెచ్చరిస్తూ వచ్చిన కోర్టు, ఇక తొందరలోనే చర్యలకు కూడా దిగుతాం అనే సంకేతాలు ఇచ్చింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.