వాళ్ళు అన్నం పెట్టే రైతులు. అంతే కాదు, ఈ రాష్ట్రం ముక్కలు అయి రోడ్డున పడితే, మనది రాజధాని లేని రాష్ట్రం అని, రాజధాని కోసం భూములు ఇవ్వాలని అడిగితే, తమతో పాటు, ఈ రాష్ట్రం కూడా బాగు పడుతుందని నమ్మి, 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులు వాళ్ళు. వాళ్ళేమి నేరాలు, ఘోరాలు చేయలేదు. అయినా ఈ రోజు ఆ రైతులను చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. చేతులకు బేడీలు వేసి, బస్సులో నుంచి దింపుతుంటే, గుండె తరుక్కు పోయింది. ఇక ఘటన వివరాల్లోకి వెళ్తే, 315 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం పై ఎలాంటి స్పందన లేకపోయినా వారు శాంతి యుతంగా ఉద్యమం చేస్తున్నారు. అయితే ఇక్కడే అమరావతికి పోటీగా, ఆటల్లో కొంత మందిని తీసుకొచ్చి, కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారు కొంత మంది. ఆటల్లో వేరే ఊరి నుంచి తమ ఊరి వచ్చి హడావిడి చేస్తున్న వారిని, అడ్డుకున్నారు రైతులు. ఇప్పుడు అదే వారి పాలిట శాపం అయ్యింది. కేవలం అడ్డుకున్నందుకు రైతు చేతికి సంకెళ్ళు వేసారు. మా గ్రామంలోకి బయట నుంచి ఎలా వస్తారు అని అడిగినందుకు వారి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి, 11 మంది దళిత, బీసి రైతులను అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన తరువాత, వారిని నరసరావుపేట సబ్ జైలుకు, మళ్ళీ అక్కడ నుంచి ఈ రోజు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఈ తరలించే క్రమంలో, 8 మంది రైతులకు సంకెళ్ళు వేసారు. ఈ ఘటన పై అందరూ షాక్ అయ్యారు. వాళ్ళు ఏమి పాపం చేసారు, రాజధానికి భూములు ఇవ్వటమే వారి తప్పా అంటూ వివిధ రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

అయితే ఈ పరిస్థితి చూసిన రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి ఇద్దరికి కలిపి సంకెళ్ళు వేసి, ఇలా దారుణంగా తీసుకురావటం పై, ఆవేదన వ్యక్తం చేసారు. రాజధాని కోసం భూములు త్యాగం చేస్తే, ఈ ప్రభుత్వం తమ చేతికి సంకెళ్ళు వేసి, బహుమానం ఇచ్చిందని వాపోయారు. రైతు కుటుంబాలు మానసిక వేదన గురి అవుతున్నారు. అయితే పోలీసులు, ఈ విషయంలో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. రైతులను, అదీ తమ ఊరికి ఎందుకు వస్తున్నారు అని అడిగిన కేసు విషయంలో, ఇంతలా చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇక మరో పక్క ఇప్పటికే, ఈ కేసు పెట్టిన వ్యక్తి తాను కేసు వెనక్కు తీసుకుంటాను అని పోలీసులకు రిటెన్ గా రాసి ఇచ్చినా, పోలీసులు మాత్రం, కోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పారు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఎవరు చెప్తే చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని, తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 315 రోజులుగా వేదిస్తున్నారని, ప్రభుత్వం ఇలా చేసి ఏమి సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం, పోలీసులు ఈ వ్యవహారం పై ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం, పోలవరం విషయం పై చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యెక హోదా వదులుకున్నారు. ఇక విభజన చట్టంలో పెట్టిన హామీలు, ఎప్పటికి అవుతాయో తెలియదు. అవి కూడా సాగదీస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర విభాజన తరువాత, రెండు కళ్ళలో ఒకటి అనుకున్న అమరావతి రాజధానిని, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంపేస్తుంది. ఇక ఏపి ప్రజలకు మిగిలింది ఏమైనా ఉంది అంటే అది పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే. ఇప్పటి ప్రభుత్వం కలలు కంటున్నట్టు, రేపు విశాఖ రాజధాని అయినా, అక్కడ నీళ్ళు కావాలి అంటే, మనకు కావాల్సింది నీళ్ళు. అవి పోలవరం పూర్తయితేనే వస్తాయి. విశాఖ నుంచి రాయలసీమ వరకు, ప్రతి జిల్లా నీళ్ళతో కలకలలాడే ప్రాజెక్ట్ ఇది. అందుకే గత ప్రభుత్వం, పట్టు బట్టి 71 శాతం పనులు పూర్తి చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత, రివర్స్ టెండరింగ్ పేరుతో ఆలస్యం అవ్వగా, తరువాత పనులు మందగించాయి. పనులు వేగం నెమ్మదిగా ఉంది. అయితే ఇప్పటి ప్రభుత్వం, 2021కి పోలవరం పూర్తి చేస్తాం అని బల్ల గుద్ది చెప్తుంది. అయితే సరిగ్గా ఇక్కడే కేంద్రం నుంచి వస్తున్న వార్తలు చూసి అందరూ షాక్ అయ్యారు. 2013-14 రివైజేడ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ప్రకారం, రూ.57,940 కోట్లు అప్రూవ్ చేయాలని, జూన్ 2018లో, చంద్రబాబు ఆపాటి కేంద్రం జల శక్తి మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసారు. తరువాత కేంద్రంతో రాష్ట్రం సఖ్యతగా లేకపోయినా, రాజకీయం విబేధాలు వచ్చినా, 2019 ఫిబ్రవరిలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ, సిడబ్ల్యుసి కూడా 55,548 కోట్లకు అంగీకారం తెలిపేలా సక్సెస్ అయ్యారు.

ఇక తరువాత కేంద్ర ఆర్ధిక శాఖ అప్రూవ్ చేయటమే మిగిలింది. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటం, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీతో సంబంధాలు ఉండటంతో, ఇది చాలా చిన్న విషయం అని, ఆర్ధిక శాఖ ఆమోదిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం బాంబు పేల్చింది. పునరావాసం మాకు సంబంధం లేదని చెప్పింది. 25 వేల కోట్లు మాత్రమే ఇస్తాం అంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో, గతంలో విజయసాయి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు 16 వేల కోట్లు ఉన్న ప్రాజెక్ట్ ని, 56 వేల కోట్లకు పెంచి అవినీతి చేసారు అంటూ, జగన్ పాదయాత్రలో ఊరు ఊరు తిరిగి చెప్పిన వీడియోలు వైరల్ అయ్యాయి. అంటే జగన్ ఉద్దేశం 16 వేల కోట్లతో పోలవరం కట్టమని, కేంద్రానికి చెప్పటమా ? అందుకే కేంద్రం అంతే ఇస్తాను అంటుంది, అంటూ సోషల్ మీడియాలో కామెంట్ లు వస్తున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ , రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా అంటూ జగన్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఇక విజయసాయి రెడ్డి, గతంలో 55 వేల కోట్లు కేంద్రం ఒప్పుకుందని, అది మా ఘనతే అంటూ చేసిన ట్వీట్ కూడా వైరల్ అయ్యింది. కేంద్రం ఒప్పుకుంటే మీ ఘనత, ఒప్పుకోకపోతే, చంద్రబాబు మీద తోసేస్తారా అంటూ, ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి, గతంలో రాజకీయాల కోసం, జగన్, విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు వారికే బూమరాంగ్ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రజలకే కాదు, అధికార పార్టీ నేతలకు కూడా షాకులు తగులుతున్నాయి. అధికార పార్టీ నేతలకు ఎదురవుతున్న పరిస్థితి చూసి, అసలు ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు పరిస్థితి ఏమిటా అనే ప్రశ్న వస్తుంది. ఈ సారి ఖరీఫ్ లో రైతన్నలను నకిలీ విత్తనాలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈ సమస్య పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి వచ్చేయటంతో, ఇబ్బంది పడుతున్నారు. పత్తితో పాటుగా, వరి వేసిన రైతులది ఇదే పరిస్థితి. అందులో అధిక వర్షాలు పడటంతో, ఈ సమస్య తొందరగా గుర్తించారు. పత్తిలోనే కాకుండా, వరి విత్తనాలు కూడా, కొన్ని చోట్ల నకిలీవి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. తాజగా నిన్న మంగళగిరిలో కూడా రైతులు ఈ నకిలీ విత్తనాల బారిన పడ్డారు. ఈ ఇబ్బందులు ఎదుర్కొంది సామాన్యులు కాదు. ఏకంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. తన పొలంలో వేసిన విత్తనాల్లో, 20 శాతం వరకు నకిలీవి అని ఆయనే గుర్తించారు. 14 ఎకరాల్లో వరి వేయగా, 5 ఎకరాల్లో ఈ నకిలి విత్తనాలను ఎమ్మెల్యే గుర్తించారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, ఎమ్మెల్యే గారు ఈ విత్తనాలు ఎక్కడో బయట నుంచి కొనలేదు. లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనలేదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపి సీడ్స్ నుంచి ఈ విత్తనాలు కొనుగోలు చేసి, పంట వేసారు. ఇప్పుడు అవి నకిలీ అని తేలాయి. ఏపి సీడ్స్ లో సరఫరా చేసిన, మంజీరా అనే కంపెనీ విత్తనాలుగా తేల్చారు.

అయితే ఇదే విషయం పై ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు చేసారు. గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయభారతికి, ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే, వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే గారి పొలం వద్దకు వచ్చి, నష్టపోయిన పంటను పరిశీలన చేసారు. కంకిదశలో ఉన్న పైరు పై, గింజ లేకపోవటాన్ని గుర్తించారు. ఈ అంశం పై అధికారులు నివేదిక ఇస్తామని చెప్పారు. మరో పక్క ఎమ్మెల్యే మాత్రం, ఈ విషయం పై ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే ఆర్కే, ఈ జూన్ నెలలో, 125 కిలోల బీపీటీ 5204 రకాన్ని ప్రభుత్వం వద్ద కోనోగులు చేసి, తన 14 ఎకరాలలో వరి వేసారు. అయితే ఇప్పుడు నకిలీ విత్తనాలు అని తేలింది. అయితే ఎమ్మెల్యే కాబట్టి, ఆయన ధైర్యంగా ఫిర్యాదు చేసారు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి ? రైతులు అసలకే కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలే నకిలీవి అయితే, ఎవరికి చెప్పుకోవాలి ? ఇది రాష్ట్రంలో పరిస్థితి.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో, ఆ పార్టీ అధ్యక్షుడు, నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై స్పందించారు. ముఖ్యంగా పోలవరం గురించి మాట్లాడుతూ, "రాష్ట్రానికి రెండు కళ్లను వైసిపి పొడిచేసింది. అమరావతి, పోలవరాన్ని పొడిచేశారు. 13జిల్లాలను సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని ఎడారిగా మార్చారు.22మందిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ప్రగల్భాలు ఏమయ్యాయి..? పోలవరం పూర్తి చేస్తా, ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్దమనిషి వాటిగురించే ఎత్తడం లేదు. 22మంది వైసిపి ఎంపిలను తన స్వార్దానికి, కేసుల మాఫీకి జగన్ వాడుకుంటున్నాడు. దేశంలో ఇతర జాతీయ ప్రాజెక్టుల నిర్మాణం ఎలా ఉంది..? అదే పోలవరం ప్రాజెక్టు పురోగతి ఎలా చేశాం..? పోలవరం నిర్మాణం 72% పూర్తయ్యింది అంటే పనుల పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం వల్లే సాధ్యం అయ్యింది. దీనిపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి." అని అన్నారు. ఇదే విషయం పై, సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ "పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ 2 కేంద్రం ఆమోదం పొందేలా చేయడంలో వైసిపి విఫలం అయ్యింది. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు 7ఏళ్ల క్రితం అంచనాల ప్రకారం ధరలు చెల్లిస్తామని కేంద్రం అంటుంటే వైసిపి చోద్యం చూస్తోంది. వైసిపి అబద్దాల ప్రచారానికి పోలవరాన్ని బలిచేయడం బాధాకరం." అని అన్నారు.

ఇక వివిధ అంశాల పై చంద్రబాబు స్పందించారు. "కిలో ఉల్లి, క్యారెట్ ధరలు రూ 100 దాటిపోయాయి. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలు, సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. కరెంటు బిల్లులు, ఆర్టీసి ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు భారీఎత్తున పెంచేశారు. ఎక్కడికక్కడ జె ట్యాక్స్, లోకల్ ట్యాక్స్, వైసిపి ట్యాక్స్ లు దండుకుంటున్నారు. హారన్ కొడితే జరిమానాలు విధించడం మరో తుగ్లక్ చర్య. సర్వేరాళ్లపై జగన్ రెడ్డి బొమ్మలు ఇంకో తుగ్లక్ చర్య. తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేశారు. వరదల్లో నష్టపోయిన రైతుల పరామర్శకు వైసిపి నాయకులు వెళ్లరు.. బాధితుల పరామర్శకు వెళ్లిన టిడిపి నాయకులపై కేసులు పెడతారు. గోదావరి జిల్లాలలో బాధితుల పరామర్శకు వెళ్లిన టిడిపి నేతలపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. సాయం చేయకపోగా రైతులపై వైసిపి తప్పుడు కేసులు హేయం. ప్రశాంతమైన కుప్పంలో కూడా వైసిపి ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. నిర్బంధం ఎంత పెరిగితే, వైసిపిపై ప్రజల్లో అంత వ్యతిరేకత. " అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read