ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పై, హైకోర్టులో కేసు ఉండటంతో, హైకోర్టు ఎన్నికలు ఎప్పుడు జరుపుతారో చెప్పాలి అంటూ, అసలు ఇప్పుడు జరిపే పరిస్థితి ఉందో లేదో చెప్పాలి అంటూ, ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని పై తమకు పూర్తి అఫిడవిట్ ఇవ్వాలి అంటూ, హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు నవంబర్ 4 న విచారణకు రానుంది. అయితే అంతకంటే ముందే, ఎన్నికల నిర్వహణ పై ఎలక్షన్ కమిషన్ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని, అందరి అభిప్రాయం తీసుకుని దీని పై కోర్టుకు తమ నిర్మాణం తెలపాలి అనే ఉద్దేశంతో, ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణ పై ప్రతి రాజకీయ పార్టీ తమ తమ అభిప్రాయాలు తెలియ చేసాయి. ఇప్పటికే బీహార్ లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలే జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో, ఎన్నికల నిర్వహణ పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ సమావేశానికి, వైసీపీ పార్టీ తప్ప, మిగతా అన్ని పార్టీలు హాజరు అయ్యి తమ అభిప్రాయాలు తెలిపారు. క-రో-నా నిబంధనలు పాటిస్తూ సమావేశం జరిగింది. అందరినీ ఒకేసారి కాకుండా, ఒక్కో పార్టీకి, కొంత సమయం కేటాయించారు. ఇందులో కొన్ని పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని కోరగా, మరికొన్ని పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే అని ప్రకటించాయి. ఈ నేపధ్యంలో, వైసీపీ మాత్రం, ఎలక్షన్ కమిషన్ పై విమర్శలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఈసి పట్టించుకోలేదని ఆరోపణలు చేసింది.
సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా, అభిప్రాయలు చెప్తూ, ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని, అయినా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అంటూ, వైసీపీ ఆరోపించింది. అయితే ఈ రోజు సమావేశం అయిన తరువాత, సమావేశం వివరాలు చెప్తూ ఎన్నికల కమిషన్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇందులో, 19 పార్టీలకు ఆహ్వానం పంపగా 11 పార్టీలు తమ వద్దకు వచ్చి అభిప్రాయం తెలిపాయని, రెండు పార్టీలు రాత పూర్వకంగా అభిప్రాయలు చెప్పాయని, ఆరు పార్టీల ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదని చెప్పారు. అయితే ఈ సందర్భంగా వైసీపీ ఆరోపణలు పై స్పందిస్తూ వారి మాటలు బాధించాయని అన్నారు. తాము ఎక్కడా అతిక్రమించలేదని, ప్రభుత్వంతో సంప్రదించలేదు అని చెప్పటం అవాస్తవం అని అన్నారు. నిన్న హెల్త్ సెక్రటరీతో , హెల్త్ కమీషనర్ తో రాష్ట్రంలో పరిస్థితి పై చర్చించామని, ఈ రోజు చీఫ్ సెక్రటరీతో కూడా చర్చలు ఉన్నాయని, ప్రభుత్వంతో పాటు, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవటం ఆనవాయితీ అని, దాని ప్రకారమే మేము వ్యవహరించామని అన్నారు. గౌరవ హైకోర్టు చెప్పిన ప్రకారం, వారికి తమ అభిప్రాయం చెప్పాల్సి ఉన్నందున, అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, తమ పై ఆపాదించటం శోచనీయం అని అన్నారు. రాజ్యాంగాబద్ధంగా ఏమి చెయ్యాలో, అవే చేస్తున్నామని, ఎక్కడా అతిక్రమణలు జరగలేదని స్పష్టం చేసారు.