ఉదయం సోషల్ మీడియాలో, మీడియాలో, కోర్టుల పై వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఎందుకు కేసులు పెట్టటం లేదు, ఎందుకు అరెస్ట్ చెయ్యటం లేదు అంటూ సిఐడి పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, సిఐడి విచారణ సరిగా లేదని, సిబిఐ విచారణకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సాయంత్రానికి వచ్చే సరికి, మరో కేసు విషయంలో కూడా, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, సిబిఐ విచారణకు ఆదేశించాలని, ఇలా అన్ని కేసులు సిబిఐకి ఇవ్వాలి అంటే, ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ ఒక ఆఫీస్ తెరవాలి అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు హైకోర్టులో పలు హెబియస్ కార్పస్ పిటీషన్ల పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత, జడ్జి ముందు 24 గంటల్లోపు హాజరు పరచాలని, అయితే ఇక్కడ అలా జరగటం లేదు అంటూ పిటీషనర్ కోర్టుకు తెలిపారు. జుడీషియల్ విచారణకు సంబంధించి పోలీసులు తరుపు కౌన్సిల్ చేసిన వాదనల పై, స్పందించిన ధర్మాసనం, ఇలా అయితే సిబిఐ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆఫీస్ తెరవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ప్రతి కేసుని కూడా సిబిఐకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, సిబిఐ అధికారులు ఇక్కడ ఆఫీస్ తెరవాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిన్న కూడా హెబియస్ కార్పస్ పిటీషన్ల పై విచారణ జరిగింది. అయితే ఈ సందర్భంగా నిన్న కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటీషన్లను ఉపసంహరించుకోవాలి అంటూ, న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి రావటంతో, హైకోర్టు స్పందిస్తూ, ఇలాంటి చర్యలు ఒక వ్యవస్థను భయపెట్టే సంఘటనలు అని, న్యాయవాదులనే బెదిరిస్తే కోర్టులను మూసేయాలని వ్యాఖ్యలు చేసింది. బీహార్ లో ఇదే తరహా ఘటనలు జరిగితే, అక్కడ కోర్టు సుమోటోగా తీసుకుని డీజీపీని విచారణకు పిలిచిందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించింది. గతంలో కూడా ఇదే అంశం పై హైకోర్టు సీరియస్ అయ్యి, ఏపి పోలీసులు తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు కూడా సిబిఐకి వెళ్ళే అవకాసం లేక పోలేదు. వచ్చే వారం కోర్టు దీని ఆపి ఏమి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.