ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్కాంలు జరుగుతున్నాయని, ముఖ్యంగా, ల్యాండ్, స్యాండ్ విషయంలో ఎన్నో వేల కోట్లు చేతులు మారుతున్నాయి అంటూ, అధికార వైసీపీకి చెందిన ఒక ఎంపీ ప్రధానికి లేఖ రాయటం, ప్రధాని కార్యాలయం స్పందించి, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమకు ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించటంతో కలకలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అయితే ఇందులోనే పెద్ద స్కాం జరిగిందని, కొంత మంది దగ్గర ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసే క్రమంలో, ఈ స్కాం జరిగినట్టు తెలిపారు. అక్కడ భూమి ధర కన్నా, రెట్టింపు రేట్లు చెల్లించి, ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టారని తెలిపారు. ముందుగానే ఆ భూమిని తక్కువ రేటుకు కొన్న కొంత మంది నాయకులు, తరువాత ప్రభుత్వం ఆ భూమి కొనుగోలు చేసేలా ప్లాన్ చేసారని ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. గోదావరి ముంపులో ఉండే ఆవ భూముల్లో, 600 ఎకరాలు ఇలాగే కొన్నారని తెలిపారు. ఈ ఒక్క చోటే 100 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అన్నారు.
ఇందులో ముఖ్యమంత్రి బంధువు కూడా ఉన్నారని, ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. అలాగే ఇసుకలో కూడా భారీగా దోచుకుంటున్నారని, ఇసుక కొరతను సృష్టించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇసుక పై భారీగా దోచుకుంటున్నారని, ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. అలాగే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. ఇలా అనేక అంశాల పై లేఖ రాసిన ఆ ఎంపీ, ఇవి కొన్ని మాత్రమే అని, మిగతా చాలా విషయాల పై, ప్రధాని విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని, దేశాన్ని కాపాడుతున్న మీరు, రాష్ట్రాన్ని కూడా కాపాడాలని కోరారు. అయితే ఈ లేఖ పై స్పందించిన ప్రధాని కార్యాలయం, ఈ లేఖను కేంద్రం హోం శాఖకు పంపటంతో, కేంద్ర హోం శాఖ, ఈ అంశాల పై పూర్తి నివేదిక ఇవ్వాలని, రాష్ట్ర ప్రాధాన కార్యదర్శిని ఆదేశించింది. కేంద్ర హోం శాఖతో పాటు, ప్రధాని కార్యాలయానికి కూడా ఆ నివేదికను పంపాలని, చీఫ్ సెక్రటరీని కోరారు.