రాష్ట్ర ప్రభుత్వం అన్నిట్లో అవినీతి చేస్తుందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. పేదలకు ఇళ్ళ పట్టాల పేరుతో అతి పెద్ద కుంభకోణం చేసిందని, దానికి సంబందించిన వివరాలు బయట పెట్టారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా. పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో అధిక ధరలకు చెల్లించి భూములు కొనుగోలు చేసారని, అది కూడా వైసీపీ వాళ్ళ దగ్గరే కొన్నారని అన్నారు. 10 లక్షలు కూడా విలువ చెయ్యని స్థాలలాను 70 లక్షల వరకు పెట్టి కొన్నారని అన్నారు. ఇళ్ళ పట్టాల విషయంలో తెలుగుదేశం పార్టీ పై నెపం మోపుతున్నారని, తెలుగుదేశం నేతలే కోర్టుకు వెళ్లి ఆపారని అంటున్నారని, ఆ తెలుగుదేశం నేతల పేర్లు ఏమిటో బయటకు చెప్పాలని వైసీపీ కి సవాల్ విసిరారు. కొంత మంది తమ ప్రైవేటు భూములు లాక్కునే విషయంలో కోర్టుకు వెళ్తే, ఆ భూముల పై కోర్టు తీర్పులు ఉన్నాయని, అవి వదిలి పెట్టి, మిగతా పట్టాలు ఎందుకు పంచి పెట్టటం లేదని, వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసారు. ఏ టిడిపి నేత కోర్టుకు వెళ్లి ఆపారో, పేర్లు చెప్తే, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు కదా, ఆ పేర్లు చెప్పండని డిమాండ్ చేసారు. కోర్టుకు వెళ్ళిన వారిలో వైసీపీ నేతలు ఉన్నారని, తాము పేర్లుతో చెప్తామని ఉమా అన్నారు

అనపర్తికి చెందిన మాజీ జడ్పీటీసీ, వైసీపీనేత అయిన కత్తి భగవాన్ రెడ్డి ఇళ్ళ పట్టాల విషయంలో కోర్టుకు వెళ్లి ఆపారని అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే తమ పై నిందలు వేస్తారా అని నిలదీశారు. అవినీతి విషయంలో తేడాలు వచ్చిన వైసిపీ నేతలే కోర్టుకు వెళ్లి ఆపుతున్నారని, సాక్షాత్తు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజే, అవినీతి విషయం బయట పెట్టిన విషయాన్ని గుర్తు చేసారు. అధిక ధరలు చెల్లించి, కొంత మంది దగ్గర భూములు కొనటం దగ్గర నుంచి, మెరక పేరుతో చేసిన మరో దోపిడీ దాకా, మొత్తం నాలుగు వేల కోట్లు అవినీతి ఇందులో జరిగిందని, మొత్తం ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దీని పై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఒక పక్క పేదల కోసం తెలుగుదేశం పార్టీ నిర్మించిన ఇల్లు ఇవ్వకుండా, ఇళ్ళ స్థలాల పేరుతొ మభ్య పెట్టి, 4 వేల కోట్లు అవినీతి చేసి, కొండలలో, గుట్టల్లో, చెరువుల్లో, శ్మశానాలలో భూములు ఇచ్చి, పేదలకు అన్యాయం చేసారని, బొండా ఉమా వాపోయారు. బొండా ఉమా చెప్పిన స్కాం వివరాలు ఇక్కడ చూడవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పై దాడులు జరుగుతున్న వేళ, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.మంగళగిరి పట్టణంలోని, 27 వవార్డులో ఉన్న రామాలయం ప్రహరీ గోడ కూలిపోవటం, అలాగే రామాలయం గర్భగుడికి కూడా ప్రమాదం వాటిల్లిందని స్థానికులు వాపోతున్నారు. 2019 ఏప్రిల్‌లో, స్థానికులు అందరూ కలిసి, ఇక్కడ రాములవారి గుడి కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి. అయితే రామాలయం పక్కన ఉన్న ఖాళీ స్థానంలో కమ్యూనిటీ హాల్ కడతామని, ఎమ్మెల్యే ఆర్కే చెప్పారని స్థానికులు అంటున్నారు. అయితే అక్కడ కమ్యూనిటీ హాల్ వద్దని, స్థానికులు ఎంత మొత్తుకున్నా, మేము అక్కడ కమ్యూనిటీ హాల్ కడటానికి నిర్ణయం తీసుకున్నామని, నిర్ణయం అయిపోయిందని ఎమ్మెల్యే గతంలో చెప్పారని, స్థానికులు ఎంత మొత్తుకున్నా, అక్కడ కమ్యూనిటీ హాల్ కడటానికి నిర్ణయం తీసుకున్నారని వాపోయారు స్థానికులు. కొద్ది రోజుల క్రితం, అక్కడ పనులు కూడా మొదలు పెట్టారు.

అయితే అక్కడ గుడికి ఇబ్బంది అవుతుందని స్థానికులు గోల చెయ్యటంతో, గుడి ప్ర‌హ‌రీ గోడ‌కు 3 మూడు మీట‌ర్లు వదిలి పునాది తవ్వుతామని ఎమ్మెల్యే మాట ఇచ్చారని, ఇప్పుడు మాత్రం ఏకంగా గ‌ర్భ‌గుడి వ‌ర‌కు తవ్వేసారని, ఇప్పుడు గుడి ప్రహరీ గోడ పడిపోవటంతో పాటుగా, త‌వ్వ‌కం చేయ‌టం వ‌ల్ల గ‌ర్భ గుడికి ప్ర‌మాదం జ‌రిగిందని స్థానికులు వాపోతున్నారు. 18-20 అడుగుల గొయ్యు తవ్వితో గుడి పడిపోతుందని ఎంత చెప్పినా వినిపించుకోలేదని, అక్కడ గుడి లేకుండా చెయ్యాలని, అందరూ కలిసి ఆడుతున్న డ్రామా అంటూ స్థానికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్థానికి తెలుగుదేశం నేతలు ఎమ్మెల్యే ఆర్కే ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్కడ గుడి కూడా లేకుండా ప్లాన్ చేసారని, అసలు అక్కడ ఎమ్మేల్యే ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ వివాదం పై ఎమ్మెల్యే ఇంకా స్పందించలేదు.

చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ సోదరుడు, రామచంద్ర పై, కొంత మంది దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే గత చరిత్ర, అక్కడ మంత్రి పెద్ద రెడ్డితో, జడ్జి రామకృష్ణకు ఉన్న వైరం నేపధ్యంలో, ఈ దాడి పెద్దిరెడ్డి మనుషులు చేసారు అంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఇదే విషయం పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాసారు. ఒక రోజు ముందే విజయవాడలో దళితులు అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారని, ఆ సమావేశంలో ప్రభుత్వం చేస్తున్న దురాగతాల పై జడ్జి రామకృష్ణ విమర్శలు చేసారని, ఆ తరువాతే కొంత మంది వ్యక్తులు రామకృష్ణ సోదరుడు రామచంద్ర పై దాడి చేసారని, ఈ దాడి వెనుక మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందని వార్తలు వస్తున్నాయని, గత చరిత్ర, నేపధ్యం అన్నీ చూసి, తగు చర్యలు తీసుకోవాలని, డీజీపీకి లేఖ రాసారు చంద్రబాబు. అయితే ఈ రోజు చంద్రబాబు లేఖకు డీజీపీ సమాధానం ఇస్తూ, మీరు చెప్పింది తప్పు, రామచంద్రను కొట్టింది తెలుగుదేశం నాయకుడే, మీరు ఆధారాలు లేకుండా ఇలాంటి ఉత్తారాలు రాయకండి అంటూ చంద్రబాబుకి లేఖ రాయటం చర్చకు దారి తీసింది.

అంతే కాదు, మీకు ఏమైనా ఆధారాలు ఉంటే సీల్డ్ కవర్ లో మాకు పంపించండి, మేము విచారణ చేస్తాం అంటూ డీజీపీ ఆ లేఖలో తెలిపారు. దీంతో ఈ లేఖ పై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం చెప్పారు. "సీల్డ్ కవర్ లో సాక్ష్యాధారాలు పంపాలని డిజిపి నాకు లేఖ రాయడం హాస్యాస్పదం. నేను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట..ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా, ప్రతిపక్షానిదా..? దళితులపై ఈ విధమైన గొలుసుకట్టు దాడులు, ఆలయాలపై దాడులు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా..? దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా..? కొందరు పోలీసుల ఉదాసీనత చూసి నేరగాళ్లు రెచ్చిపోతున్నారు." అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతే కాదు, ఘటన జరిగిన రోజున రాజకీయాలకు సంబంధం లేదని డీఎస్పీ చెప్పారని, కుమార్ రెడ్డి అనే వైసీపీ సానుభూతి పరుడు పై కేసు నమోదు చేసామని చెప్పి, సాయంత్రానికి ప్రతాప రెడ్డి అనే టిడిపి కార్యకర్త పేరు తెచ్చారని, వ్యవస్థలను ఏవిధంగా మేనేజ్ చేస్తున్నారో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని చంద్రబాబు అన్నారు.

అధికార పక్షాన్ని ప్రసన్నం చేసుకోవటం కోసమో, లేక అధికార పక్షానికి భయపడో, వివిధ వర్గాలు, కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతూనే ఉంటుంది. అధికారపక్షం మెప్పు కోసం, అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు ఏ పాట పాడితే, అది అందుకుని, వారికి భజన చేస్తూ ఉంటారు. అయితే ఇది కొంత వరకు పరవాలేదు కానీ, ఏకంగా రూల్స్ మార్చేస్తూ, లేక విషయం కోర్టులో ఉండగా కూడా అత్యుత్సాహం ప్రదర్శించే వారు కూడా ఉంటారు. ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్నా, ఇంకా ఆ నిర్ణయం అమలులోకి రాలేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గానే ఉంది. గతంలో అసెంబ్లీ ఏకగ్రీవంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీర్మించినదే ఇప్పటికీ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించి, ఇండియా పొలిటికల్ మ్యాప్ లో చేర్చింది.

ఇక హైకోర్టుని కూడా అమరావతిలో నోటిఫై చేసారు. అయితే విజయవాడలో ఒక ప్రముఖ స్కూల్ మాత్రం, అత్యుత్సాహం చూపించింది. దేశంలో మూడు రాజధానులు ఉన్న రాష్ట్రం ఏది అంటూ, వివిధ ప్రశ్నలు, ఆన్లైన్ పరీక్షల్లో ఇచ్చింది. స్కూల్లో అమరావతి రాజధాని ప్రశ్నపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపడ్డారు. స్కూల్ యాజమాన్యాన్ని ఫోన్ చేసి అమరావతి రైతులు, తల్లిదండ్రులు నిలదీసారు. అమరావతి రాజధాని అంశం కోర్టులో ఉండగా.. 3 రాజధానులని స్కూల్ యాజమాన్యం ఎలా డిసైడ్ చేస్తుందన్న రైతుల ప్రశ్నించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చింది. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం దిగి వచ్చింది. తప్పు జరిగిందని, సరిదిద్దుకుంటామని, స్కూల్ యాజమాన్యం ప్రకటన చేసింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.

Advertisements

Latest Articles

Most Read