ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ వెళ్ళిపోవాలని ఉత్సాహంగా ఉన్నా, అమరావతి రైతులకు ఇచ్చిన చట్టబద్ధ అగ్రిమెంట్ ప్రకారం, ఇక్కడ రాజధాని నిర్మించకుండా వేరే చోటుకు వెళ్ళిపోవటం పై, కోర్టులో కేసు వెయ్యటంతో, విశాఖ వెళ్ళే పని వాయిదా పడుతూ వస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం, విశాఖకు ఇప్పటి నుంచే కొన్ని హంగులు ఏర్పాటు చేస్తుంది ఇందులో భాగంగా కాపులుప్పాడ ప్రాంతంలో, దాదాపుగా 30 ఎకరాల్లో ఒక వీఐపి గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తున్నారు. దీనికి భూమి పూజ కూడా సైలెంట్ గా జరిగిపోయిందని, పది రోజుల క్రిందట వార్తలు కూడా వచ్చాయి. అయితే దీని పై ఇప్పుడు కొత్త వివాదం రాజేసుకుంది. విశాఖలో మొదటి భావనానికే వ్యతిరేకత వస్తూ ఉండటంతో, ఇది మరో తల నొప్పిగా మారింది. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా, ఈ విషయమై కేంద్రానికి లేఖ రాసారు. ప్రభుత్వం కాపులుప్పాడ ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తుందని, కానీ అది తొట్లకొండ బౌద్ధారామం ఉన్న ప్రాంతం అని, ఎంతో విశిష్టత కలిగిన ప్రదేశం అని కేంద్రానికి రాసిన లేఖలో తెలిపారు. తొట్లకొండను ఎప్పుడో 1978లో ఒక పెద్ద చారిత్రాత్మిక ప్రదేశంగా గుర్తింపు వచ్చిందని, అలాగే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కూడా, ఆ ప్రదేశాన్ని బఫ్ఫర్ జోన్ గా గుర్తిస్తూ, 300 మీటర్ల దూరంలో రక్షిత ప్రాంతంగా గుర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రానికి రాసిన లేఖలో రఘురామకృష్ణం రాజు వివరించారు.
ఎంతో విశిష్టత కలిగిన ప్రదేశంలో, రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ హౌస్ లు కడుతుందని, వెంటనే దాన్ని ఆపెసేలా చర్యలు తీసుకోవాలని, కేంద్ర సాంస్కృతిక శాఖకు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇక మరో పక్క, ఈ విషయం పై బౌద్ధ సంఘాలు కూడా ఉద్యమ బాట పట్టాయి. తోట్లకొండకు చెందిన 3300 ఎకరాలు ప్రొటెక్టెడ్ ఏరియాగా నోటిఫై చేసి ఉందని, అక్కడ ఇప్పుడు 30 ఎకరాల్లో ప్రభుత్వం గెస్ట్ హౌస్ కడుతుందని, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. గతంలో ఇక్కడ ఈ భూమి ఫిలిం క్లబ్ కి కేటాయిస్తే, తాము చంద్రబాబు వద్ద ఈ విషయం గురించి చెప్తే ఆయన వెనక్కు తీసుకున్నారని, అలాగే వైఎస్ఆర్ కూడా నేవీకి ఇక్కడ భూమి ఇస్తే, తాము చెప్తే, ఆయన కూడా వెనక్కు తీసుకున్నారని బౌద్ధ సంఘాలు అంటున్నాయి. ఇక్కడ ప్రభుత్వమే కంచే చేను మేస్తే అన్న చందాన తయారు అయ్యిందని ఆరోపిస్తున్నాయి. మరో పక్క ఈ వివాదం పై ప్రభుత్వం స్పందించిన. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆ భూమికి, ఇక్కడ గెస్ట్ హౌస్ స్థలానికి సంబంధం లేదని అన్నారు. దానికి దీనికి కిలోమీటర్ దూరం ఉందని చెప్తున్నారు.