విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన నేపధ్యంలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం లక్ష్యంగా జరుగుతున్న దర్యాప్తు వేగం పుంజుకుంది. గుంటూరులోని రమేష్ ఆసుపత్రి స్థలం లీజు వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిసింది. క్రిస్టియన్ మిషనరీ (ఎఈఎల్‌సి) సంస్థకు చెందిన స్థలాన్ని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం లీజుకు తీసుకున్నారు. ఈ స్థలంలో రమేష్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యంకు, రాయపాటి సోదరులకు బంధుత్వం ఉంది. రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమత గుంటూరు రమేష్ ఆసుపత్రి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సాంబశివరావు సోదరుడి కూతురు రాయపాటి శైలజ విజయవాడ రమేష్ ఆసుపత్రి చైర్మన్‌గా ఉన్న రామ్మోహనరావుకు కోడలు. ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు సహకారంతోనే గుంటూరులో డాక్టర్ రమేష్ ఆసుపత్రిని నెలకొల్పారు. స్వర్ణ ప్యాలెస్ ఘటన నేపధ్యంలో రాయపాటి సోదరుల వ్యవహారాల పైనా ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిసింది. సాంబశివరావు కుటుంబ సభ్యులు రమేష్ ఆసుపత్రికి సబ్ లీజుకు ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు నగర నడిబొడ్డున ఈ స్థలం ఉండటంతో ఆసుపత్రికి బాగా ఉపయోగపడింది.
ఇందుకు సంబంధించిన వ్యవహారాలను ఆరా తీసేందుకు ఇప్పటికే రాయపాటి మమతను విచారించిన విజయవాడ పోలీసులు తాజాగా మంగళవారం గుంటూరు రమేష్ ఆసుపత్రిలో ఆయన సోదరుడి కూతరు అయిన శైలజను విచారించారు. ఆమె అమరావతి ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారన్న సమాచారంతో కొంత మంది వైసిపి నాయకుల సలహాతో రాయపాటి కుటుంబంపై దృష్టి సారించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని కానీ ఇంతలా కొంత మందిని లక్ష్యం చేసుకుని వేధింపులు ఎక్కడా ఎప్పుడూ చూడలదేని రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె శైలజ పేర్కొన్నారు. పోలీసుల విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా కేర్ సెంటర్లను ఎక్కడైనా పరిశీలించారా అని తనను పోలీసులు అడిగారని కానీ తాను 8 నెలలుగా వైద్య వృత్తికి దూరంగా ఉన్నానని చెప్పారు. నా పుట్టుపూర్వోత్తరాలు కూడా అధికారులు అడిగారని తెలిపారు. 30 ఏళ్లుగా పేరు తెచ్చుకున్న ఒక సంస్థను లక్ష్యంగా చేసుకుని కులం పేరుతో దుష్ప్రచారం చేయడం తగన్నారు. రమేష్ బాబును రమేష్ చౌదరిగా ప్రచారం చేస్తుంటే ఒక టార్గెట్ గానే తమకు కనబడుతుందన్నారు.