సొంత పార్టీ, ఎమ్మెల్యేలకు టార్గెట్ అయిన సర్సావురం ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు పై పోరు పోలీస్ స్టేషన్ వరకు ఎక్కింది. రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్సీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీని వాస్ భీమవరం పోలీసులకు, మరో ఎమ్మెల్యే ప్రసాదరాజు నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని, తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తూ, తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన ఎంపీ రఘు రామకృష్ణంరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి బుధవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదులో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి శ్రీరంగనాథరాజు కూడా పోడూరు పిఎస్లో నర్సాపురం ఎంపీ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇళ్ల పథకంలో స్థలాలు కేటాయింపులో అక్రమాలు జరిగిన విషయం, కొనుగోళ్లలో కూడా గోల్ మాల్ జరుగుతున్న విషయం, ఇసుక స్కాం పై గతంలో రఘురామకృష్ణంరాజు జగన్ దృష్టికి తెచ్చారు. అయితే దీనిపై వైకాపా నేతలు తీవ్రంగా స్పందించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయితే ఆ పార్టీ నాయకులు కాళ్ల వేళ్లా పడి బతిమాలితేనే తాను పార్టీలో చేరానంటూ రఘు రామకృష్ణంరాజు కూడా ఘాటుగానే స్పందించారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత రఘురామకృష్ణంరాజుకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపైనా అభ్యంతరం చెబుతూ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇటు ఎంపీ కూడా హైకోర్టులో పిటిషన్ వేయగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు కూడా పోలీసు ఫిర్యాదులతో షాకిస్తున్నారు. అయితే రఘురామరాజు దీని పై తనదైన శైలిలో ముందుకు వచ్చారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి, తన పై వీళ్ళు పెడుతున్న కేసులు, అసలు కేసులే కాదని, వాటిని క్వాష్ చెయ్యాలి అంటూ, పిటీషన్ వేసారు.

ఇంతటి విపత్కర పరిస్థితిలో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా, ప్రజల కోసం, పని చేస్తున్న మా పై, ఇష్టం వచ్చినట్టు అవమానకరంగా ప్రవర్తించటం దారుణం అంటూ, ఐఏఎస్ అధికారుల పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ వైద్యుల సంఘం, నిరసన వ్యక్తం చేస్తూ, ఆవేదనతో చీఫ్ సెక్రటరీ నీలం సహానీకి లేఖ రాసారు. తమ మనోభావాలు దెబ్బ తీస్తూ, అవమానకరంగా ఐఏఎస్ ఆఫీసర్లు ప్రవర్తిస్తున్నారని, తీరు మార్చుకోకుండా, ఇలా అవమానకరంగా ప్రవర్తిస్తే, పని చెయ్యటం కష్టం అంటూ, చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. అసోసియేషన్ కన్వీనర్‌ డాక్టర్ జయధీర్ బాబు, అన్ని జిల్లాల్లో, డాక్టర్లను ఎలా అవమానిస్తున్నారో చెప్తూ, చీఫ్ సెక్రటరీకి మూడు పేజీల సుదీర్ఘ లేఖ రాసారు. తమ పై జరుగుతున్న వేధింపులు కనుక వెంటనే ఆపక పొతే, ధులు బహిష్కరించటానికి కూడా వెనుకాడమని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆర్‌ఎంపీలను ఇక నుంచి, కరోనా కేసులు చూడాలి అంటూ, చెప్పటం ఎంత వరకు సమంజసం ? ఇది మెడికల్‌ ఎథిక్స్‌కు విరుద్ధం కాదా ? అంటూ ప్రశ్నించారు. ఈ విషయం పై, మేడికల కౌన్సిల్ అఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇక ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్, విధులకు ఆలస్యంగా వచ్చారు అంటూ, డిస్ట్రిక్ట్ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ అని, సమావేశం అయ్యేంత వరకు హాలులో నుంచోమని చెప్పారని, ఇది తమకు ఎంత అవమానం అని లేఖలో తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా డీఎంహెచ్‌ఓ పై, ఐఏఎస్ లు అందరి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని తెలిపారు. అలాగే తమ పని చేసుకోనివ్వకుండా, ఇష్టం వచ్చినట్టు టెలికాన్ఫరెన్స్‌లు పెడుతూ, తమ పై పని ఒత్తిడి పెంచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పని ఒత్తిడితో ఉన్న తాము, అధికారులు పెట్టే వేధింపులు తట్టుకోలేక పోతున్నాం అని, వెంటనే ఇవి ఆపాలని కోరారు.

ఎపి సిఎంవోలో తాజాగా చోటు చేసుకున్న మార్పులతో, ఐఏఎస్ వర్గాల్లో చర్చకు దారి తీసాయి. గతంలో సిఎంవో వరిధిలో ఆయా అధికారులు నిర్వహించిన వనుల విధానం మారింది. వారికి కేటాయించిన వివిధ పని అంశాలను బుధవారం తాజా ఉత్తర్వులతో మార్పుచేసారు. పలు కీలక శాఖలను ముగ్గురు సిఎంవో అధికారుల నడుమనే కేటాయించారు. దీంతో సిఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మరింత కీలకంగా మారారు. సీఎంఓలో ఆయా అధికారులకు కేటాయించిన వని అంశాల జాబితాలో అజయ్ కల్లాంకు ప్రత్యేకించి ఎటువంటి అంశాన్ని కేటాయించలేదు. ఆయన ప్రధాన సలహాదారులుగానే వ్యవహరిస్తారు. అయితే కోరి మరీ తెచ్చుకున్న అజయ్ కల్లంకు సియం ఎందుకు పక్కన పెట్టారు, అనే విషయం పై చర్చ జరుగుతుంది. అలాగే మరో రిటైర్డ్ అధికారి పీవీ రమేష్ విషయంలో కూడా, ఇదే జరిగింది. ఆయన పవర్స్ కూడా కట్ చేసారు. దీంతో పీవీ రమేష్ రాజీనామా చేస్తారు అనే వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి తాజా నిర్ణయంతో, ప్రవీణ్ ప్రకాష్ మరింత పవర్ఫుల్ అయ్యారు.

సిఎంఓ వని బాధ్యతలను ప్రవీణ్ ప్రకాష్, సాల్మన్ ఆరోగ్యరాజ్, ధనుంజయ్ రెడ్డిల మధ్యనే విభజించారు. దీని ప్రకారం సిఎమ్ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సాధారణ పరిపాలన శాఖతో పాటు హోమ్, రెవిన్యూ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, న్యాయ లెజిస్ట్రేటివ్ వ్యవహారాలు, సిఎమ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇతర అనుబంధ విభాగాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు అన్ని అంశాలు ప్రవీణ్ ప్రకాష్ పరిధిలోనే ఉంటాయి. సాల్మన్ ఆరోగ్యరాజ్ కు రవాణా , రోడ్లు భవనాల శాఖ, హౌసింగ్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, వంచాయితీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, అన్ని సంక్షేమ శాఖలు, పరిశ్రమలు, వాణిజ్యం, మౌళిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటి, గనులు, కార్మిక ఉపాధి కల్పనా శాఖ, కె. ధనుంజయ్ రెడ్డికి జలవనరులు, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వ్యవసాయం అనుబంధ విభాగాలు, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ, ఎనర్జీ, టూరిజం, మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్, ఫైనాన్స్ కేటాయించారు.

కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న సప్తగిరుల పై వెలసిన తిరుమల క్షేత్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 80కి చేరడంతో కంటైన్మెంట్‌జోన్ పరిధిలోకి తీసుకువస్తూ అధికారులు తొలుత చేసిన ప్రకటనతో ఇటు స్థానికులేగాక అటు భక్తులు కూడా ఉత్కంఠకు గురికావలసి వచ్చింది. కంటైన్మెంట్ జోన్ పరిధిలో వున్న ప్రాంతానికి బయటి వ్యక్తుల రాకపోకలు నిషేధం. అలాంటిది తిరుమల క్షేత్రాన్ని ఈ జోన్ పరిధిలో ప్రకటించడంతో ఒకింత ఆందోళన కలిగించింది. ఆ తరువాత కొద్దిగా తేరుకున్న రాష్ట్ర, జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్ నుంచి తిరుమలను తొలగించినట్లు సాయంత్రం 3గంటల బులెటిన్లో మరో ప్రకటన చేయడంతో అందరూ ఊరట చెందారు. గత వారం వరకు 70 మంది టిటిడి ఉద్యోగులు, సిబ్బంది ఆలయంలో, ఇతరత్రా విధులు నిర్వహిస్తున్న వారు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. దీంతో తిరుమలలో గత ఆదివారం టిటిడి ధర్మకర్తలమండలి కూడా అత్యవసర సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, తదుపరి పరిణామాలపై చర్చించింది.

అయితే తాజాగా మళ్లీ మరో పదికేసులు తిరుమలలో కరోనా పాజిటివ్ నమోదవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తిరుమలను ఒక్కసారిగా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. అయితే శ్రీవారి ఆలయం మాత్రం తెరిచే వుంటుందని ప్రకటించారు. కానీ అధికారుల్లో కూడా భక్తుల సంశయం మెదలడంతో వెనువెంటనే కంటైన్మెంట్ జోన్ నుంచి తొలగించారు. తిరుపతి నుంచి తిరుమలకు ప్రయాణించే ఉద్యోగుల్లో కొందరికి పాజిటివ్ లక్షణాలు రావడంతోనే తిరుమలలో ఇప్పుడు ఆందోళన తీవ్రమైంది. ప్రతిరోజూ 200మంది టిటిడి సిబ్బందికి కరోనా ర్యాండమ్ పరీక్షలు చేస్తు న్నారు. భక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం వరకు 800మంది భక్తులకు ర్యాండమ్ పరీక్షలు చేస్తే అందరికీ నెగిటివ్ రావడం విశేషం. మరోవైపు తిరుపతి పరిసరాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గురువారానికి చిత్తూరుజిల్లాలో 2,459కేసులు నమోదయ్యాయి. తిరుమల ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ చేయడం... ఆ తరువాత తోలగించడం మాత్రం అధికారుల తీరును భక్తులు తప్పుపడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read