జగన్ మోహన్ రెడ్డి కొత్త పార్టీ అయిన, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి, ఆ పార్టీ వ్యవహారాలు అన్నీ, విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తూ వచ్చారు. పార్టీ నిర్మాణం, సభ్యత్వాలు, ప్రత్యర్ధుల పై ఏ రోజు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి దాడి చెయ్యాలి, సోషల్ మీడియా, పార్టీ కార్యాలయ వ్యవహారాలు, ఇలా ఒకటేమిటి, అన్నీ విజయసాయి రెడ్డి కనుసన్నల్లో జరిగేవి. రాజ్యసభ సభ్యుడిగా, ఢిల్లీలో వైసీపీ తరుపున మొత్తం ఆయనే. ఇక తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి ఎప్పుడు వచ్చినా, అధికార ప్రతినిధులతో మీటింగ్ లు, సీనియర్ నేతలతో మీటింగ్లు చూస్తూ, పార్టీ మొత్తాన్ని తానే నడుపుతూ వస్తున్నారు. పది రోజుల క్రితం కూడా, తాడేపల్లిలో, అధికార ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడారు. ఇక తాజాగా పార్టీ లైన్ దాటారు అంటూ, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకి పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. అయితే పార్టీలో ఇంత కీలక బాధ్యతలు చూస్తున్న విజయసాయి రెడ్డికి, నిన్న జగన్ షాక్ ఇచ్చారు.
విజయసాయి రెడ్డిని కేలవం ఉత్తరాంధ్రకి పరిమితం చేసారు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం బాధ్యతలు మాత్రమే ఇచ్చి, ఆయనను ఆ మూలకు మాత్రమే పరిమితం చేసారు. చివరకు తన సొంత జిల్లా అయిన, నెల్లూరు జిల్లాకు కూడా ఆయనకు బాధ్యత ఇవ్వలేదు. ఇక తాడేపల్లి ఆఫీస్ బాధ్యతలతో పాట, కర్నాల్,అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం బాధ్యతలు కూడా సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇవ్వటం, సంచలనంగా మారింది. ఇక కీలకమైన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యత వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. సజ్జలకి తాడేపల్లి పార్టీ ఆఫీస్ తో పాటు, 6 జిల్లాల బాధ్యత ఇస్తే, వైవీకి 5 జిల్లాల బాధ్యత ఇచ్చారు. విజయసాయి రెడ్డికి కేవలం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు మాత్రమే ఇవ్వటం, ఆశ్చర్యాన్ని కలిగించింది. సజ్జలకు, విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందని, జగన్ సజ్జల వైపు మొగ్గు చూపారని, వస్తున్న ప్రచారం తరువాత, సజ్జలకు ఎక్కువ బాధ్యతలు ఇచ్చి, విజయసాయి రెడ్డికి కట్ చెయ్యటంతో, వైసిపీ శ్రేణుల్లో కూడా చర్చ మొదలైంది.
ఇక రఘురామకృష్ణ రాజు ఇష్యూ ఇంత పెద్దది కావటానికి కారణం, కూడా విజయసాయి రెడ్డి వల్లే అని, పార్టీ హైకమాండ్ నమ్ముతుంది. రఘురామరాజు కూడా, విజయసాయిని టార్గెట్ చేసారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి పవర్స్ కట్ అయ్యాయి, మరి రఘురామరాజు గారు ఇప్పటికైనా చల్ల బడతారో లేదో. అయితే విజయసాయి రెడ్డి గత నెలలో, ప్రెస్ మీట్ పెట్టి, జగన్ కు నా పై పూర్తి నమ్మకం ఉందని, నేను కూడా జగన్ ను చనిపోయే దాకా వదలను అని, పార్టీ పూర్తి బాధ్యతలు, సోషల్ మీడియా నేనే చూసుకుంటున్నా అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే విజయసాయి రెడ్డి వర్గం మాత్రం, విజయసాయి పై పని భారం తగ్గించెందుకునే, ఆయన్ను రాజధాని అవుతున్న విశాఖకు పరిమితం చేసారని చెప్తున్నారు.