నా ఆత్మీయ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, నమస్కారాలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం కన్నా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదాయం అధికంగా ఉన్నది. అయినా అభివృద్ధి లేదు. సంక్షేమం కుదించారు. అవినీతి, అరాచకాలు పెచ్చుమీరాయి. ఏడాదిగా రాష్ట్రంలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నత న్యాయస్థానాలను కూడా ఈ ప్రభుత్వం ధిక్కరిస్తోంది. పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపు ఏవిధంగా రాష్ట్రానికి నష్టం కల్గించిందో ఈ ఏడాది పరిణామాలే నిదర్శనం. వైసిపి నాయకుల దుర్మార్గాలు-రాష్ట్రానికి వాటిల్లిన కీడు-ప్రజలకు కలిగిన చేటు గురించి మీ దృష్టికి తెచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను. ఏడాదిగా రైతుల సమస్యలు పరిష్కరించలేక పోయారు. మద్దతుధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఆదుకునే చర్యలు లేవు. పేదల కోసం టిడిపి తెచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. కరోనా ఉపశమన చర్యల్లో ఘోరంగా విఫలం అయ్యారు. లాక్ డౌన్ లో ప్రతి పేద కుటుంబానికి రూ. 10 వేలు ఇవ్వాలన్న డిమాండ్ నిర్లక్ష్యం చేశారు. ప్రజలపై రూ. 50 వేల కోట్ల భారాలు మోపి, రూ.87 వేల కోట్లు అప్పు చేశారు. ఆ నిధులతో రాష్ట్రంలో అభివృద్దిగానీ, సంక్షేమంగానీ చేయలేదు. అవినీతి చేశారు, దుబారా చేశారు. కరెంటు బిల్లులు, మద్యం ధరలు, ఇసుక, సిమెంటు రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. 70 మంది భవన కార్మికులు, 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఈ ఏడాదిలో వైసీపీ పాలనలో విషాదం. రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేయడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. ఏడాది పాలనలో వైసిపి లోటుపాట్లను ఎత్తిచూపాం. వాటిని చక్కదిద్దే చర్యలు చేపట్టకుండా రాజకీయ కక్ష సాధింపునకు తెగబడ్డారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేక, తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే వైసిపి నాయకులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. సొంత కంపెనీ సరస్వతీ పవర్ ఇండస్ట్రీకి గనుల లీజులు 50ఏళ్లకు పొడిగింపు, నీళ్ల కేటాయింపులకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రజా సమస్యల పరిష్కారంపై చూపకపోవడమే సీఎం జగన్మోహన్ రెడ్డి నైజం.

కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రాభివృద్ధిని, పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. ప్రత్యర్ధులపై ప్రతీకారమే లక్ష్యంగా పెట్టుకుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపు చర్యలను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే “ప్రజావేదికను” కూల్చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆర్ధిక మూలాలు దెబ్బతీయడం, వ్యాపారాలకు నష్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చడం, తోటలు నరికేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు. బెదిరించి, ప్రలోభపరిచి, లొంగదీసుకోవడమే వైసిపి దుష్టసిద్ధాంతం. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ గనుల యజమానులపై రూ.2వేల కోట్ల జరిమానాలు విధించారు. నెల్లూరు టిడిపి ముస్లిం మైనారిటీ నాయకుల ఇళ్లు కూల్చేశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో టిడిపి సానుభూతి పరులైన బిసిలు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలను ఊళ్లలోనుంచి తరిమేశారు. దాడులు, దౌర్జన్యాలతో భయోత్పాతం సృష్టించారు. ప్రభుత్వ బాధితుల కోసం తెలుగుదేశం పార్టీ పునరావాస శిబిరం పెట్టడం అధికార వైసిపికి సిగ్గుచేటు. బాధితుల పరామర్శకు నన్ను వెళ్లనీకుండా ఇంటి గేట్లకు తాళ్లు కట్టి అడ్డుకునే పైశాచిక చర్యలకు పాల్పడ్డారు. వైసిపి అరాచకాలు డాక్టర్ కోడెల శివప్రసాద రావులాంటి సాహస నాయకుల ప్రాణాలనే బలిగొన్నాయి. 9మంది టిడిపి కార్యకర్తలను, నాయకులను హత్య చేశారు. 7గురు ఆత్మహత్య చేసుకునేలా తప్పుడు కేసులతో పురిగొల్పారు. 56 మంది ఆస్తులు ధ్వంసం చేశారు. 167మందిపై వేధింపులకు పాల్పడ్డారు. 95మందిపై అక్రమ కేసులు బనాయించారు. వందలాది పార్టీ సానుభూతి పరులను ఉద్యోగాలనుంచి తొలగించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేసిన పనులకు కేంద్రం మంజూరు చేసిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులు చెల్లించకుండా వేధిస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ పూర్తయినా, సోషల్ ఆడిట్ జరిగినా, ఎటివోలు సిద్ధం చేసినా ఇంకా చెల్లింపులు చేయకుండా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. నరేగా పనులపై తప్పుడు నివేదికలు ఇవ్వాలని వైసీపీ వేధింపులు తట్టుకోలేక పంచాయితీరాజ్ ఇంజనీర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం మీరంతా చూశారు. ప్రలోభాలతో, బెదిరింపులతో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరిని లాక్కోవడం తెలిసిందే. ఆర్ధికంగా ఇబ్బందులు తొలగిస్తామని ఒకరిని, మైన్స్ కేటాయిస్తామని ఇంకొకరిని, వ్యాపారాలకు రాయితీలు ఇస్తామని మరొక ఎమ్మెల్యేను లాక్కున్నారు. వందల కోట్ల జరిమానాలు చెల్లించాలని నోటీసులు ఇచ్చి మరో నాయకుడిని లోబర్చుకున్నారు. ఆర్ధిక ప్రయోజనాల ఆశతో ఒక ఎమ్మెల్సీకి, బెదిరించి మరొక ఎమ్మెల్సీకి వైసిపి కండువాలు కప్పారు. శాసన సభాపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా గత ఏడాది జూన్ 13న నిండుసభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు.. ? టిడిపి నుంచి ఎవరినైనా తీసుకుంటే తొలుత వారిని రాజీనామా చేయిస్తామని అన్నారు. మరి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలతో ఎందుకని రాజీనామా చేయించలేదు..? ఏదైనా పొరబాటున ఫిరాయింపు జరిగితే అనర్హత వేటు వేస్తామని అన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల పై అనర్హత వేటు ఎందుకని వేయలేదు..? పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం గురించి, కండువాల మార్పిడిపై ఉపన్యాసాలు దంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నదేంటి..? ఒకరిద్దరిని లొంగదీసుకుంటే 100మందిని తయారు చేసే పార్టీ తెలుగుదేశం.

ఆటుపోట్లు టిడిపికి కొత్తేం కాదు. ఏడాది బిడ్డగా ఉన్నప్పటినుంచే ఎన్నో సంక్షోభాలను దృఢంగా ఎదుర్కొంది. ఏడాది పాలనలో స్కీమ్ ల పేరుతో అనేక స్కామ్ లకు వైసిపి పాల్పడింది. భూసేకరణ పేరుతో రూ 1,600కోట్లు స్వాహా చేశారు. ఆవ భూముల్లోనే రూ.400 కోట్ల స్కామ్ చేశారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి పొరుగు రాష్ట్రాలకు దారిమళ్లించి వేల కోట్ల దోపిడి చేశారు. రీచ్ లనుంచే 13లక్షల టన్నుల ఇసుక మాయం చేశారు. మద్యం కుంభకోణంలో రూ 30వేల కోట్లు కొల్లగొడ్తున్నారు. నాసిరకం మద్యం బ్రాండ్లను 300% ధరలకు అమ్మి, అటు జె ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. కంపెనీల్లో వాటాల కోసం బెదిరింపులతో అనేకమంది పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు. చివరికి కరోనా కిట్ల కొనుగోళ్లలో, బ్లీచింగ్ లో, మాల కొనుగోళ్లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు. ప్రతి నియోజకవర్గంలో వ్యాపారుల నుంచి వసూళ్ల దందాకు తెగబడ్డారు. టిడిపిపై అక్కసుతో పేదల సంక్షేమ పథకాల రద్దుకు కూడా తెగించారు. 34 స్కీమ్ లను రద్దు చేశారు. టిడిపికి పేరు వస్తుందన్న కక్షతో అన్నా కేంటీన్లను మూసేశారు. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు రద్దు చేశారు. టిడిపి ఇచ్చిన ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేశారు. అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కున్నారు. పోలవరం, అమరావతి అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపేశారు. "పార్టీపై కక్షతో పేదల పథకాలు నిలిపేసిన హీన చరిత్ర వైసిపిదే..” నవరత్నాల్లోనూ 90% మోసమే.. రాళ్లు జనంపై విసిరి రత్నాలు వైసిపి నాయకులే కొల్లగొట్టారు. అర్హులైన లబ్ధిదారులలో మూడింట రెండు వంతుల మందికి ఆర్ధిక సాయం ఎగొగొట్టారు.

రైతు భరోసా, పించన్ రూ.2 వేల నుంచి రూ. 3వేలకు పెంపు, 45 ఏళ్లకే పించన్, సన్నబియ్యం , సున్నావడ్డీ అన్నింటిలో మోసాలే చేశారు. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు ఏకంగా ప్రజల పైనే దాడులకు తెగబడ్డారు. దళితులపై విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్న దళిత డాక్టర్లు సుధాకర్ రావు, అనితారాణిపై అమానుష చర్యలకు పాల్పడ్డారు. దళిత నాయకులను తప్పుడు కేసులలో ఇరికించి జైళ్లకు పంపారు. బీసీల రిజర్వేషన్లను సగానికి తగ్గించారు. ఎస్సీ,ఎస్టీ మైనారిటీ సంక్షేమంలో కోతలు పెట్టారు, స్కీమ్ లు రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి నాయకుల దాడులు, దౌర్జన్యాలు విధ్వంస కాండ దేశం మొత్తం చూసింది. మాచర్లలో పట్టపగలు నడిరోడ్డుపై టిడిపి నాయకులు బొండా ఉమామహేశ్వ రావు, బుద్దా వెంకన్నపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తెనాలి సహా అనేక చోట్ల టిడిపి అభ్యర్థుల ఇళ్లలో లిక్కర్ సీసాలు వీళ్లే పెట్టి ఎదురు కేసులు బనాయించారు. టిడిపి అభ్యర్ధులను నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరించి ఏకగ్రీవాలు చేసుకునే దుర్మార్గాలు చేశారు. ఎన్నికలు వాయిదా వేశారన్న కక్షతో ఏకంగా ఎన్నికల కమిషనర్ నే తొలగించారు. తప్పుడు చర్యలతో రాష్ట్రానికి దేశ, విదేశాల్లో చెడ్డపేరు తెచ్చారు. ప్రజల భవిష్యత్తు అంధకారం చేశారు. వీటన్నింటినీ ప్రజల్లో ఎండగడుతున్నందుకే టిడిపి సహా ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తున్నారు. అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టిస్తే సంక్షేమం ఉంటుంది. అభివృద్ధిని, సంపద సృష్టిని, సంక్షేమాన్ని వైసిపి నాయకులు నాశనం చేశారు. ప్రజా వ్యతిరేక చర్యలు కాబట్టే వైసిపి ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని కోర్టులు తప్పుపట్టాయి. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు, ఎన్నికల కమిషనర్ ను తొలగించడం, మాతృభాషా బోధన రద్దు, శాసన మండలి రద్దు నిర్ణయం, మూడు రాజధానులు, ప్రజావేదిక కూల్చడం వంటివన్నీ తుగ్లక్ చర్యలు కాబట్టే ప్రజలంతా నిరసిస్తున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకున్న కోర్టులకే దురుద్దేశాలు అంటగట్టడం వైసిపి బరితెగింపునకు పరాకాష్ట. ప్రజాస్వామ్య 4 మూలస్థంభాలను కూలదోసే కుట్రలు చేశారు.

లెజిస్లేచర్, బ్యూరోక్రసీ, జ్యుడీషియరీ, మీడియా ప్రజాస్వామ్య 4 మూల స్థంభాలను కూలదోసే కుట్రలు చేశారు. ప్రజల ప్రాధమిక హక్కులను కాలరాశారు. రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారు. ఏపిని బీహార్ ఆఫ్ సౌత్ గా చేశారని, గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడుతున్నారనే అప్రదిష్ట రాష్ట్రానికి తెచ్చారు. దేశం అంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ సొంత రాజ్యాంగం (రాజారెడ్డి రాజ్యాంగం) అమలు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తినే చంపేస్తున్నారు. "భౌతికంగా నేను లేకున్నా భారత రాజ్యాంగం రూపంలో ప్రజల గుండెల్లో బతికే ఉంటాను. రాజ్యాంగాన్ని చంపినప్పుడే నేను చనిపోయినట్లు” అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. దేశచరిత్రలో ఇన్ని తప్పులు ఎవరూ చేయలేదు. ఇటువంటి రాక్షస పాలన ఏ రాష్ట్రంలోనూ చూడలేదు. ఇంత విధ్వంస కాండ ఎప్పుడూ జరగలేదు. ఇన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎవరూ తీసుకోలేదు. వీటన్నింటిపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి, వైసిపి నాయకుల చిత్తచాంచల్యాన్ని ప్రజలే చక్కదిద్దాలి. "ప్రతీకారేచ్ఛ గలవాడు పాలనకు అయోగ్యుడు. సానుకూల స్వభావమే వ్యక్తికి, సమాజానికి ప్రయోజనం. అత్యున్నత పదవిలో ఉన్నవారు కక్ష సాధింపు ధోరణి సమాజానికి చేటు” అనేది వైసిపి నాయకులు తెలుసుకోవాలి. ధర్మాన్ని నిలబెట్టడంలో, న్యాయాన్ని, చట్టాన్ని కాపాడటంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. వైసిపి దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తాం. ప్రజల ప్రాధమిక హక్కుల పరిరక్షణ, “రూల్ ఆఫ్ లా” కాపాడటమే ధ్యేయంగా రాజీలేని పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటంలో గత ఏడాదిగా రాజకీయాలకతీతంగా కలిసి వచ్చిన వారందరినీ అభినందిస్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాలను, భావితరాల భవిష్యత్తును కాపాడే కృషిలో ఇకపై కూడా మీరంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్టులో, అటు సుప్రీం కోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులు అన్నీ, చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండే కేసులు. ఎవరైనా సరే, ఈ కేసులు కోర్టులు కొట్టేస్తాయని ఇట్టే చెప్తారు. అయితే, ప్రభుత్వం ఈ విషయంలో జరుగుతున్న వరుస తప్పులు తెలుసుకుని, తమ వైఖరి మార్చుకోవాలి కాని, ప్రభుత్వం మాత్రం, హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తాం అని చెప్పటం, అక్కడ కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్న విషయం చూసాం. అయితే ఈ నేపధ్యంలో, ఈ రోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులుగా ఉన్న, పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్‌ హబీబ్ అనే ముగ్గురు న్యాయవాదులు రాజీనామా చెయ్యటం, వెంటనే దాన్ని ప్రభుత్వం ఆమోదించటం జరిగిపోయాయి. ప్రభుత్వానికి సంబంధించిన, కేసుల విషయంలో, వీళ్ళు హైకోర్టులో చూసుకుంటూ ఉంటారు. అయితే వీరి రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం, త్వరలోనే వీరి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయ్యనుంది. అయితే వీరి రాజీనామా విషయం పై ఇప్పుడు పలు ప్రశ్నలు వస్తున్నాయి.

వీరి రాజీనామా ఎందుకు చేసారు ? ప్రభుత్వ విధానాలను మేము మోయ్యలెం అని రాజీనామా చేసారా ? లేక తమ వల్లే ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం వీరితో చర్చించి రాజీనామా చేపించిందా ? లేక వీరంత వీరే రాజీనామా చేసారా అనేది తెలియాల్సి ఉంది. ఈ పరిణామంతో ఒక్కసారిగా ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది. ఇందులో షేక్‌ హబీబ్ అనే న్యాయవాది మహిళా న్యాయవాది. వీరి ముగ్గురినీ గత ఏడాది నియమించినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం తమ నిర్ణయాలు రాజ్యంగబద్ధంగా, చట్ట ప్రకారం ఉంటె, కోర్టులు కూడా సహకరిస్తాయని, అలా కాకుండా రంగులు వెయ్యటం, రాజ్యాంగం ప్రకారం మాతృభాషలో చదువు, రాజ్యంగం ప్రకారం నియమించిన ఎన్నికల కమీషనర్ ను తప్పించటం లాంటి పనులు చేస్తే, ఏ న్యాయవాది అయినా ఏమి చెయ్యలేరని, న్యాయవాదులు మార్చటం కాదని, ప్రభుత్వం తమ వైఖరిని సరి చూసుకోవాలనే వాదన వినిపిస్తుంది.

క-రో-నా పేరుతో ప్రభుత్వాలు దోచుకుతింటున్నాయని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇక నిన్నటి సినీ ప్రముఖుల అమరావతి పర్యటన పై, నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. సినిమా వారు కేవలం స్వార్ధం కోసమే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలుస్తున్నారని ఆరోపించారు. కనీసం అమరావతి రైతులకు మద్దతు తెలపలేని వీరి గురించి ఏమి చెప్తాం అని అన్నారు. అమరావతి తరలింపు కోసం సినీనటులను జగన్ అడ్డంపెట్టుకుని, పావుగా వాడుతున్నారని నారాయణ అన్నారు. సినీ ప్రముఖులు ముఖ్యమంత్రులను కలవటం పై, సినీ నటుడు బాలకృష్ణ చెప్పింది నిజమే అని, భూముల కోసమే కలుస్తున్నారని అన్నారు. అక్రమ భూముల క్రమబద్ధీకరణ కోసమే నిన్నటి అమరావతి పర్యటన జరిగింది అని అన్నారు. రానున్న ఎన్నికలు అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా పైనే జరుగుతాయని అన్నారు. రాజధాని రైతులు వెళ్తే సంఘీభావం ప్రకటించవచ్చుకదా, తప్పేముంది, అందులో మీకు ఏమి అవుతుంది అని అన్నారు.

వీళ్ళు ఎవరిని కలిసినా, భూములు కావలి, సబ్సిడీలు కావాలి, స్టూడియోలు కావాలి అనే డిమాండ్లతో, వాళ్ళ స్వార్ధం కోసమే కలుస్తున్నారని అన్నారు. నిజంగా ప్రజల పట్ల, సమాజం పట్ల వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటె, 200 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న వారిని, ఎందుకు కనీసం పరామర్శించలేదు అని నారాయణ అడిగారు. వీళ్ళ వాలకం చూస్తుంటే, బాలకృష్ణ చెప్పింది నిజమే అని అనిపిస్తుందని అన్నారు. జగన్‌ను చూసి భయపడుతున్న సినీనటులు పరిశ్రమకు ఏం చేస్తారు ? అమరాతి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అని అన్నారు. ప్రజలను మోసం చేయడానికే సినిమా గ్యాంగ్ అమరావతికి వచ్చిందని అన్నారు. రాజధాని వెళ్లకుండానే విశాఖలో అరాచకాలు జరుగుతున్నాయని, విశాఖకు రాజధాని వెళ్తే ఫ్యాక్షన్ సెంటర్ గా మారుతుందని నారాయణ ఆరోపించారు. రాజధానిని తరలిస్తే సహించేది లేదని, ఎవరితో ఎన్ని డ్రామాలు వేయించినా, చూస్తూ కూర్చోమని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ, రెండో సారి ప్రధాని అయిన తరువాత, ఏడాది కాలం పూర్తి కావటంతో, ఈ ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పై బీజేపీ వర్చ్యువల్ ర్యాలీలు చేస్తుంది. ఇందులో భాగంగా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, బీజేపీ నేత రాం మాధవ్ మాట్లాడారు. తమ ప్రభుత్వం చేసిన విషయాలు చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయాల పై మాట్లాడారు. గత ప్రభుత్వంలో, బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉన్నాం అని, కాని చంద్రబాబు గారు మధ్యలోనే వెళ్లిపోయారని, ఆయనకు ఏదో ఆశ పుట్టి, మనతో దూరం జరిగారని అన్నారు. అయితే గత ఎన్నికల్లో వైసిపీ అధికారంలోకి వచ్చిందని, వాళ్ళు ఇప్పుడు ఏడాది పాలన పూర్తీ చేసుకున్నారని అన్నారు. పుట్టినరోజు నాడు కనిపిస్తే, నూరేళ్ళు చల్లగా ఉండవయ్యా అని శుభాకాంక్షలు చెబుతాం, అలాగని ఏడాది కాలంగా, జగన్ చేసిన పాపాలు మర్చిపోయాం అని కాదు అంటూ రాం మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏడాది పూర్తయిన సందర్భంగా, జరిగిన ఇంటర్వ్యూ లో తన వాదన సాక్షి వక్రీకరించటం పై రాం మాధవ్ ఈ వ్యాఖ్యలు చేసారు.

ప్రోటోకాల్ ఈజ్ డిఫెరెంట్ ఫ్రం పాలసీ అని వైసిపీ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఏడాది పూర్తి చేసుకున్నావ్, మంచిగా ఉండు, అని ఎవరైనా అంటాం, అని కాని మీ పాపాలు మేము సమర్దిస్తున్నాం అని కాదు అని అన్నారు. మోడీ ప్రభుత్వం అవినీతి రహితంగా నడుపుతుంటే, ఇక్కడ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది అన్నారు. బెయిల్ మీద ఒకాయిన ఉంటే, బెయిల్ కోసం ఇంకో ఆయన ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో అభివ్రుది మంత్రం ఉంటె, ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ మంత్రం ఉందని, అన్నీ రివర్స్ లో ఉన్నాయని, "రివర్స్ ప్రభుత్వం "అని నామకరణం చేసారు రాంమాధవ్. రాజధానితో రివర్స్ మొదలైంది అని, పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ అయ్యింది అని, మద్యపాన నిషేధం రివర్స్ అని, కొత్త బ్రాండులతో మద్యం ప్రవహింప చేస్తున్నారని అన్నారు.

తిరుమల భూములు అమ్మకంలో ప్రజలు రివర్స్ అయ్యారని, అక్కడ కూడా రివర్స్ అని అన్నారు. ఎలక్షన్ కమీషనర్ లో రివర్స్ అని అన్నారు. వారానికి ఒకసారి మొట్టికాయలు తిన్న ప్రభుత్వం, దేశంలో ఎక్కడా లేదని అన్నారు. దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే, ఏపికి అన్ని రకాలుగా మోడీ సహకారం అందిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి దేశానికి వచ్చే టాక్స్ రెవిన్యూ తగ్గిపోయింది అని అన్నారు. పుండు మీద కారం లాగా, ఇప్పుడు క-రో-నా వచ్చిందని, ఇప్పుడు మరింతగా తగ్గిపోయింది అని, అయినా మోడీ ప్రభుత్వం, రూ.35 వేల కోట్లు ఏపికి ఇవ్వటానికి సిద్ధం అయ్యిందని, ఇప్పటికే మొదటి రెండు నెలల్లో రూ.10 వేల కోట్లు ఇచ్చామని, ఆ లెక్కంతా చెప్పారు. మరి, ఇప్పుడు రాంమాధవ్ వ్యాఖ్యల పై, జగన్ ఎలా స్పందిస్తారో..

Advertisements

Latest Articles

Most Read