ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, హైకోర్టులో ఇప్పటి వరకు దాదాపుగా 70 సార్లు ఎదురు దెబ్బ తగిలింది. అలాగే హైకోర్టు తీర్పుని, సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టుకు వెళ్తున్న ఎక్కువ సార్లు, సుప్రీం కోర్టులో కూడా ఎదురు దెబ్బ తగులుతూ వచ్చింది. అయితే, సరిగ్గా ఇక్కడే వైసీపీ నుంచి వైలెంట్ రియాక్షన్ వచ్చింది. డాక్టర్ సుధాకర్ కేసులో, హైకోర్టు ఉత్తర్వులు ఇస్తూ, ఈ కేసుని సిబిఐకి ఇస్తున్నామని చెప్తూ, దానికి కారణాలు కూడా చెప్పింది. అభియోగాలు పోలీసులు పైనే ఉన్నాయి కాబట్టి, సిబిఐకి ఇస్తున్నాం అని హైకోర్టు చెప్పింది. అయినా సరే, హైకోర్టు పై, విమర్శలు దాడి చేసింది వైసీపీ. హైకోర్టు తీర్పు పై విమర్శలు చేస్తే చేసుకోవచ్చు కాని, జడ్జిల పై పర్సనల్ కామెంట్స్ చెయ్యటం, కుట్రలు అంటకడతం లాంటి పనులు చెయ్యటం, ఏకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నేతలు ఇలా చెయ్యటంతో, హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది, వీరందరికీ నోటీసులు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీం కోర్టులో కూడా ఇదే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎందుకు తప్పులు చేస్తున్నాం అనేది చూడకుండా, చట్ట ప్రకారం నిర్ణయాలు ఉంటున్నాయా అనేది చూడకుండా, కోర్టుల పై నెపం నెట్టుతున్నారు.

అయితే, ఇప్పుడు హైకోర్టు కొట్టేసిన మరో కేసులో, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో, తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెడతాం అంటూ, ప్రభుత్వం తెచ్చిన జీవో 81, 85 లను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎవరు ఏ మీడియంలో చదువుకోవాలో, అది వారి ఇష్టం అని, విద్యా హక్కు చట్టం ప్రకారం, మాతృభాష కూడా ఉండాలి అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం, తెలుగు మీడియం ఆప్షన్ ఇవ్వటానికి ఎందుకో మొగ్గు చూపటం లేదు. ఇంగ్లీష్ మీడియం పెట్టుకోండి, కాకపొతే తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉంచండి అని చెప్పినా, ప్రభుత్వం వినటం లేదు. హైకోర్ట్ కొట్టేయగానే, వెంటనే వాలంటీర్లతో సర్వే చేపించి, 80 శాతం మంది ఇంగ్లీష్ మీడియంకి అనుకూలంగా ఉన్నారని, అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం అంటూ, సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఇక్కడ బేసిక్ పాయింట్ అయిన, తెలుగు మీడియం ఆప్షన్ ఇవ్వటానికి, ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటో మరి. ప్రభుత్వం చెప్తున్నట్టు, ఆ 80 శాతం మందిని ఇంగ్లీష్ మీడియంలో చదివించి, తెలుగు మీడియం కోరిన ఆ 20 శాతం మందికి, అదే పెట్టవచ్చు కదా ? చూద్దాం సుప్రీం కోర్టు ఏమి చెప్తుందో.

స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటుకు సంబధించిన, జీవో 41ని రద్దు చెయ్యాలంటూ, హైకోర్టులో ప్రకాశం జిల్లా వాసి, ఒకరు పిటీషన్ దాక్షలు చేసారు. స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో కు చట్టబద్దమైన, అనుమతి లేదని, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో నమోదు చేసే కేసులు న్యాయపరంగా చెల్లవని పిటీషనర్ తన వాదనను కోర్టుకు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం, ఎస్ఈబీ ఏర్పాటు చేసారో చెప్పాలి అంటూ, ప్రభుత్వంలోని ఆరుగురు అధికారులను హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ సహా, మరో ముగ్గురికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్ఈబీ ఏర్పాటు పై హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై, విచారణను, హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. అయితే ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణాని అరికట్టేందుకు ప్రభుత్వం, ఈ స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అనే విభాగం ఏర్పాటు చేసి, ఆరు వేల మంది వరకు ఇందులో ఉంచనుంది. అయితే పోలీసు, విజిలెన్స్ ఇతర శాఖలు ఉండగా, మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త శాఖ దండగ అని, అది కాక, దీనికి చట్టబద్దత ఉండదు అని పిటీషనర్ వాదన.

ఇక మరో పక్క, మెడికల్ పీజీ సీట్ల రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ, జారీ చేసిన జీవో 57 వల్ల రిజర్వేషన్లు 78%కి చేరడంతో, హైకోర్టును ఆశ్రయించారు ఓపెన్ క్యాటగిరీ విద్యార్ధులు. దీని పై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. జీవో 57 పై వైద్య విద్యార్ధులు మండి పడుతున్నారు. జీవో 57 వల్ల రిజర్వేషన్లు, 78 శాతానికి పెరిగి పోయాయని, దీని వల్ల ఓపెన్ క్యాటగిరీ విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. కౌన్సిలింగ్ లో సీటు వచ్చిన తరువాత, ఇప్పుడు సీటు పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర వర్శిటీ రీజియన్ పరిధిలోనే, 67 సీట్లను ఓపెన్ క్యాటగిరీ విద్యార్ధులు కోల్పోయారు. ఇంతటి నష్టం తెస్తున్న ఈ జీవోని రద్దు చెయ్యాలని, వైద్య విధ్యార్ధులు ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో, హైకోర్టులో కేసు వేసారు. నోటీసులు ఇచ్చిన హైకోర్టు, కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణ 18కి వాయిదా వేసింది.

మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను, విగ్రహాలను వైఎస్సార్సీపీ నాయకులు పగలగొడుతున్నారు. గత ప్రభుత్వంలో 804 కోట్ల నిధులతో హంద్రీనీవా ద్వారా పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చాం. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కూడా పేరూరుకు వచ్చి డ్యాంలు ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే మంగళవారం కొంత మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక, దివంగత నేత వరిటాల రవీంద్ర, శ్రీరాములయ్య, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోలను పగలగొట్టడం జరిగింది. తాము వైఎస్సార్సీ చేసే అభివృద్ధి పనులకు స్వాగతిస్తున్నామని, విగ్రహాలను, శిలాఫలకాలను పగలగొట్టడం పనికిమాలిన చర్య అని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె.పార సారధులు పేర్కొన్నారు. బుధవారం అనంతపురం నగరంలోని ఎస్పీ బంగ్లా వద్ద ఎస్సీ సత్యయేసుబాబును కలిసి వైఎస్సార్సీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న సంఘటనల పై ఫిర్యాదు చేసి వినతిపత్రాన్ని అందజేశారు.

అనంతరం మీడియాతో కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరూరు డ్యాంకు నీరు తీసుకురావాలన్న సంకల్పంతో హంద్రీనీవా ద్వారా 804 కోట్లు నిధులు వెచ్చించి నీటిని తీసుకొచ్చారన్నారు. కొంత మంది వైఎస్సార్సి నాయకులు పరిటాల రవి, చంద్రబాబునాయుడు ఫోటోలను ధ్వంసం చేశారన్నారు. అధికారం శాశ్వతం కాదని ప్రభుత్వాలు వస్తుపోతుంటాయని కక్షలు పెంచరాదన్నారు. గతంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న తాము హెచ్చరించామని అలా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త వికాదన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రామగిరి మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అయితే వైఎస్సార్సి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామగిరి మండలంలోని వైఎస్సార్సి నాయకులు, కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. రామగిరి మండల కేంద్రంలో స్టేడియంను ఏర్పాటు చేశామని, అక్కడ ఆర్చిను ఏర్పాటు చేసివుంటే దానిని పగలగొట్టారన్నారు. అలాగే కొన్ని గ్రామాలోల పరిటాల రవీంద్ర పేర్లను తొలగించడం జరిగిందన్నారు. పేరూరు డ్యాంకు నీరు ఎటునుంచి తెచ్చినా మాకు సంతోషమేనని, తాము ఎవరు అభివృద్ధి చేసినా ఆశీర్వదిస్తామని, కానీ ఇలాంటి పనికిమాలిన పనులకు పాల్పడకూడదన్నారు.

జగన్ పాలన పై మరో నేత, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. రోజు రోజుకీ వైసీపీలో అసంతృప్తి గళాలు వినిపిస్తున్న సమయంలో, తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి మామయ్య, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, వైసీపీ ప్రభుత్వం పై, సంచలన ఆరోపణలు చేసారు. కురుపాం నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని, శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు అన్నారు. కురుపాం నియోజకర్గం, సాక్షాత్తు డిప్యూటీ సియం ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. వైసీపీ పార్టీకి అనుకూలంగా లేకపోతే, అన్ని అర్హతలు ఉన్నా, లబ్దిదారులకు పథకాలు మంజూరు చెయ్యటానికి, అధికారులు పదే పదే తిప్పించుకుంటున్నారని అన్నారు. డిప్యూటీ సియం పుష్ప శ్రీవాణి నియోజకవర్గంని కొంత మంది అధికారులు అసలు పట్టించుకోవడం లేదని సంచలన ఆరోపణలు చేసారు. అభివృద్ధి పనులు పనులు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అన్నారు. అవకాశం ఉన్నా జల వనరుల శాఖలో తాగునీటి సమస్య పరిష్కారం చేయలేకపోతున్నామని అన్నారు.

మంచి రోడ్లు కూడా వేయలేని పరిస్థితి నెలకొందని, పింఛన్లు కూడా పూర్తిగా ఇచ్చే పరిస్థితి లేదని, శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వైసీపీ ప్రభుత్వం పైనే గళం విప్పారు. కుల వ్రుత్తిదారులను ఆదుకోవటం కోసం, ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదని ఆరోపించారు. ఈ సమస్యలు అన్నీ, ఎవరికీ తెలియ చెయ్యాలో, అర్ధం కావటం లేదని శత్రుచర్ల అన్నారు. అయితే డిప్యూటీ సియం పుష్ప శ్రీవాణి సొంత మామయ్య కావటంతో, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. జగన్ పాలన ఏడాది అయిన తరువాత నుంచి, వరుస పెట్టి, సొంత పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సొంత పార్టీ పాలన పైనే ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న, సీనియర్ నేత, మాజీ మంత్రిగా పని చేసిన ఆనం కూడా, ఏడాది పాలన కేకు సంబురాలు తప్ప, అభివృద్ధి అనే మాట ఎక్కడా లేదు అంటూ, వ్యాఖ్యలు చెయ్యటమే కాక, మరో ఏడాది చూస్తాను, పరిస్థితి మారకపోతే సొంత పార్టీనే నిలదీస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే రఘురామకృష్ణ రాజు, ప్రసన్నకుమార్ రెడ్డి, ఇలా వరుస పెట్టి, ప్రతి ఒక్కరు సొంత ప్రభుత్వం పైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read