ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సోమవారం విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. మార్చ్ 20న ఆయన హైదరాబాద్ వెళ్ళటం, తరువాత వరుసగా, నాలుగు లాక్ డౌన్లు కేంద్ర ప్రభుత్వం విధించటంతో చంద్రబాబు, హైదరాబాద్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అన్ని వైపులా ఆంక్షలు సడలించటం, అలాగే డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ కు కూడా అనుమతి ఇవ్వటంతో, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రావటానికి నిర్ణయం తీసుకుని, ఇరు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా డీజీపీలకు పర్మిషన్ కోరారు. అయితే తెలంగాణా డీజీపీ కార్యాలయం వెంటనే పర్మిషన్ ఇవ్వగా, ఇంకా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం నుంచి చంద్రబాబుకు అనుమతి రాలేదు.

అయితే ఇదే క్రమంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ డీజీపీకు కూడా లెటర్ రాసారు. సోమవారం ఉదయం విశాఖ పర్యటనకు వెళ్తానని, ఈ మేరకు అనుమతి ఇవ్వాలని, ఏపి డిజిపిని చంద్రబాబు కోరారు. సోమవారం ఉదయం 10.35గంకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు, అక్కడ నుంచి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి బాధితులకు చంద్రబాబు పరామర్శించనున్నారు. అనంతరం అదే రోజు విశాఖనుంచి రోడ్డుమార్గంలో అమరావతికి చంద్రబాబు రానున్నారు. విశాఖ నుంచి ఉండవల్లిలోని తన ఇంటికి రావటానికి కూడా, ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపి డిజిపికి చంద్రబాబు లేఖ రాసారు. అయితే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన రోజునే, చంద్రబాబు కేంద్రాన్ని అనుమతి కోరారు.

అయితే అప్పట్లో, లాక్ డౌన్ ఉదృతంగా ఉండటంతో, అనుమతి రాలేదు. ఇప్పుడు లాక్ డౌన్ ఆంక్షలు కేంద్రం, రాష్ట్రాలకు అధికారం ఇవ్వటంతో చంద్రబాబు, రాష్ట్రాలకు పర్మిషన్ ఇవ్వమని కోరారు. అయితే ఆయన హైదరాబాద్ లో ఉన్నారు అంటూ వైసీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. హైదరాబాద్ లో ఉన్నా, చంద్రబాబు కరోనా పై, ఎప్పటికప్పుడు, ఇక్కడ ఉన్న సమస్యలు కేంద్రం దృష్టికి, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపి వారిని ఆదుకోవటంలో చొరవ చూపించారు. ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ, ప్రజలకు జరుగుతున్న విషయాలు చెప్తూ వచ్చారు. అలాగే ఒక ఫోరం ఏర్పాటు చేసి, కేంద్రానికి కరోనా పై, అలాగే దేశ ఆర్ధిక పరిస్థితి పై కేంద్రానికి సలహాలు పంపించటం, కేంద్రం వాటిని ప్రశంసిస్తూ, లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసే అంశంలో ప్రతికూల రీతిలో ఆదేశాలను శుక్రవారం జారీ చేసింది. పంచాయితీ కార్యాలయాలకు పార్టీ రంగుల పై ప్రభుత్వం ఇచ్చిన 623 జివోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం జీవో ఎందుకు ఇచ్చిందో వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేయడంపై రాష్ట్ర హైకోర్టు తన తీర్పు వెలువరించింది. పంచాయతీలపై రంగుల అంశంపై వాద ప్రతివాదుల వాదనలు విన్న కోర్టు 623 జివోను కొట్టివేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం జివో ఎందుకు ఇచ్చిందో వివరణ ఇవ్వాలని రాష్ట్ర వంచాయితీరాజ్ సెక్రటరీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28వ తేదీలోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నది.

అలా చేయని వక్షంలో కోర్టు దిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని 623 జీవోను సవాలుచేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలుచేసిన చింతలపాటి సోమయాజులు తెలిపారు. గతంలో రాష్ట్రంలో పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేయడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు పంచాయితీ కార్యాలయాలకు వేసిన వైఎస్సార్సీ రంగులు తొలగించాలని ఆదేశించింది. మూడు రంగులు, ఒక్కో రంగు, దేనికి వర్తిస్తుంది అనేది ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

అయితే మళ్లీ అవే రంగులు వేస్తూ జివోను ఎలా ఇస్తా రంటూ 623 జివోను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన సోమయాజులు హైకోర్టులో ఫిల్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలుచేయగా హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. 623 జీవోను కొట్టివేస్తూ సదరు జివో ఎందు కిచ్చారో ఈ నెల 28లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి కోర్టు నోటీసులు ఇవ్వటం పై చర్చ జరుగుతుంది. నీలం సాహ్ని తన కెరీర్ మొత్తం మీద, మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆమె నిక్కచ్చిగా పని చేస్తారని, పేరు ఉంది. అయితే మరో నెల రెండు నెలల్లో, రిటైర్డ్ అవుతారు అనగా, ఆమె చేసిన పని పై కోర్ట్ సీరియస్ అవ్వటం, కోర్ట్ ముందు సమాధానం చెప్పే పరిస్థితి రావటంతో, ఆమె గురించి తెలిసిన వాళ్ళు బాధ పడుతున్నారు. హైకోర్ట్, సుప్రీం కోర్ట్ తీర్పులు ఇచ్చినా, మళ్ళీ రంగులు జీవో, ఆమె స్వయంగా ఇవ్వటం పై, ఇప్పుడు కోర్ట్ తప్పుబట్టటం, ఇవన్నీ ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి.

పోతిరెడ్డిపాడు పై, వివాదం నడుస్తున్న వేళ, జగన్ మొహన్ ప్రభుత్వానికి 16 మంది రాయలసీమ నేతలు లేఖ రాసారు. రాష్ట్ర విభజన తరువాత, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారాయని గుర్తు చేసారు. గోదావరి జలాలను, కృష్ణా డెల్టాకు మళ్ళించి, అక్కడ మిగిలిన నీటిని రాయలసీమకు మళ్ళించాలని కోరారు. పోతిరెడ్డిపాడు కంటే ముందు ఈ పనులు చెయ్యాలని, అలాగే గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ, తెలుగు గంగ ప్రాజెక్టులు కింద ఉన్న ప్రాజెక్టులు, కాలువలు, ముందుగా పూర్తీ చెయ్యాలని, అప్పుడే రాయలసీమకు న్యాయం జరుగుతుంది అన్నారు. ఇవి చేసిన తరువాత, పోతిరెడ్డి పాడు, సామర్ధ్యం పెంచటం గురించి ఆలోచించవచ్చు అని కోరారు. ఇది ఇలా ఉంటే మరో పక్క, వేసవి తాగునీటి అవసరాలకోసం కృష్ణా జలాల్లో రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధప్రదేశ్ కేటాయించాలని ఏపి ప్రభుత్వం కోరగా, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు అంగీకారం తెలిపింది. శుక్రవారం జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాగునీటి పారుదల శాఖల ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

సమావేశంలో నీటి వినియోగం , శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిలువలు తదితర అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వేసవి తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ జలాశయం నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి త్రిసభ్య కమిటీలో ప్రతిపాదించారు. నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం గతంలో పలు మార్లు 510 అడుగుల దిగవకు కూడా తీసుకుపోయి నీటిని వినియోగించుకున్నట్టు బోర్డు దృష్టికి తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర వాటకింద ఇంకా 49 టీఎంసీల నీరు ఉన్నందున అందులో నుంచి రెండు టీఎంసీల నీటిని ఏపీ కి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. దీంతో నాగార్జున సాగర్‌లో నీటిమట్టం 510 అడుగుల దిగువకు తీసుకు పోవాల్సిన అవసరం లేదని త్రిసభ్యకమిటీ అభిప్రాయపడింది.

సాగర్ జలాశయంలో ఉన్న నీటినిలువల్లో రెండు టీఎంసీలు సాగర్ కుడి కాలువకు విడుదల చేసేందుకు త్రిసభ్యకమిటీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ ఏపీకి సంబంధించిన నీటి కేటాయింపులను ఆ రాష్ట్రం పూర్తిగా వినియోగిచుకుందని బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం దృష్టికి తెచ్చారు. ఇతర అంశాలపై కూడా చర్చించారు. నీటి వాటాలు , ఇప్పటివరకూ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణానదీ జలాలను ఏ రాష్ట్రం ఎంత వాడుక ఎన్నది తదితర అంశాలను ఈ నెలాఖరు వరకూ పెండింగ్ పెట్టాలని సూచించగా అందుకు త్రిసభ్య కమిటీ అంగీకరించిందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పధకంతోపాటు పలు అంశాలపై చర్చను కూడా వాయిదా వేసుకున్నట్టు తెలిపారు. ఈ నెల చివరినాటికి నీటి సంవత్సరం ముగియనున్నందున ఆలోపే నాగార్జున సాగర్ జలాశయం నుంచి కేటాయించిన రెండు టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా వినియోగించుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఏపీకి సూచించారు.

విశాఖలో నర్సీపట్టణం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను అరెస్ట్ చేసిన వ్యవహారంపై హైకోర్టు శుక్రవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనతో ప్రమేయం వున్న పోలీసులపై కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీనిపై ఎనిమిది వారాల్లో నివేదికను ఇవ్వాలని సీబీఐకి న్యాయస్థానం వ్యవధిని నిర్దేశించింది. డాక్టరుగా పనిచేసే సుధాకర్ కరోనా సేవల చేసేందుకు తమకు పీపీఈ కీట్లు ఇవ్వడం లేదని బహిరంగంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యా యి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సుధాకర్‌ను సస్పెండ్ చేసింది. ఈ పరిణామం నడుమ దాదావు 15రోజుల అనంతరం సుధాకర్ గుండుతో విశాఖ రోడ్లపై గుర్తుపట్టలేని స్థితిలో ప్రత్యక్షమయ్యారు.

ఆయన రోడ్డుపై ఇబ్బంది కలిగించే రీతిలో ప్రవర్తిస్తున్నాడంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు. పోలీసులు ఆయన్ను కొట్టి, చేతులు వెనక్కు విరిచి కట్టి, బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారని ఈ సందర్భంగా ఆరోపణలు వచ్చాయి, ఆ మేరకు ప్రసార మాధ్యమాల్లో విజువల్స్ , ప్రచురణ మాధ్యమాల్లో ఫోటోలు వచ్చాయి. ఆయన మానసిక స్థితి బాగోలందంటూ ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ విషయం తీవ్ర వివాదస్పదంగా మారింది. ఈ వ్యవహరంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత హైకోర్టుకు లేఖ రాసారు. ఒక వైద్యుడితో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని తన లేఖలో అనిత హైకోర్టుకు వివరించారు.

ఈ లేఖపై సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసును జారీ చేసింది. సుధాకర్ శరీరంపై గాయాలు ఉన్నాయని ఫిర్యాది కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళారు. దీంతో హైకోర్టు విశాఖలోని స్థానిక న్యాయమూర్తిని సుధాకర్ చికిత్స నిమిత్తం చేర్పించబడిన ఆస్పత్రికి పంపింది. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయించింది. ఈ వాంగ్మూలాన్ని పరిశీలించిన మీదట కేసును సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. అయితే ఈ సందర్భంగా కోర్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఏకంగా ప్రభుత్వ నివేదిక మీద నమ్మకం లేదు అని చెప్పటం సంచలనంగా మారింది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన వీడియోలు ముక్కలు ముక్కలుగా ఉన్నాయని, కోర్ట్ వ్యాఖ్యానించింది. అలాగే ప్రభుత్వ నివేదికలో, కేవలం కన్నుబొమ్మ పై కేవలం స్వల్ప గాయం అయ్యింది అని చెప్పగా, మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో ఆరు గాయాలు ఉన్నాయని, కోర్ట్ పేర్కొంది. సుధాకర్ తన వాంగ్ములంలో, పోలీసుల పైనే ఆరోపణలు చేసారని, వారికే ఈ దర్యాప్తు ఇవ్వటం సరికాదు అని కోర్ట్ చెప్పింది.

Advertisements

Latest Articles

Most Read