నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఏకంగా ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వార్నింగ్ ఇచ్చారు. పది రోజుల క్రితం, ఎమ్మెల్యే ఏదో కార్యక్రమంలో పాల్గునటంతో, లాక్ డౌన్ అమలులో ఉండగా, ఇలాంటి పనులు చెయ్యకూడదు అని తెలిసినా, ఇలా చేసినందుకు, అతని పై కేసు పెట్టారు. అయితే నా మీదే కేసు పెడతారా అంటూ, కోవూరు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు ఎమ్మెల్యే. అయితే తరువాత, ఎంక్వయిరీలో, ఆ కార్యక్రమంలో కొంత మంది అధికారులు కూడా పాల్గునటం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు కూడా లాక్ డౌన్ పాటించకపోతే ఎలా అంటూ, ఆ అధికారులకు నోటీసులు ఇచ్చారు. దీంతో, వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మళ్ళీ ఫైర్ అయ్యారు. నిత్యావసరాల పంపిణీకి అధికారులను నేనే ఆహ్వానించాను, అధికారులకు నోటీసీలు ఇవ్వడం నేను ఒప్పుకోను. అధికారులపై చర్యలు తీసుకుంటే ఎంతకైనా తెగిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
నాడు సీఎం, వైసీపీ అధినాయకత్వం ఆదేశాలతో సైలెంట్‌గా ఉన్నా, కలెక్టర్, ఎస్పీలు తమ గౌరవాన్ని కాపాడుకోవాలి, ఒక్క అధికారిపై చర్యలు తీసుకున్నా నేనేంటో చూపిస్తా, కలెక్టర్, ఎస్పీలకు రాజకీయాలు కావాలంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరండి, మీ ఇద్దరికి దమ్ము, ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, జిల్లాలో వీరిద్దరూ ఏసీ గదులకే పరిమితమయ్యారు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు అంటూ, ఇష్టం వచ్చినట్టు, కలెక్టర్, ఎస్పీ పై చిందులు వేసారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. అయితే, ఆయన ఏకంగా కలెక్టర్, ఎస్పీలకు వార్నింగ్ ఇవ్వటం పై, ప్రతిపక్ష టిడిపి మండి పడింది. ఇలా ఇష్టం వచ్చినట్టు చేసే, రాష్ట్రంలో కేసులు 1500 దాటించారని మండి పడ్డారు.
వైకాపా నాయకుల దుశ్చర్యలకు జాతీయ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందని టిడిపి నేత కూనా రవికుమార్ గుర్తు చేశారు. రాష్ట్రం కరోనా వ్యాప్తిలో వైకాపా నేతలు ముందు వరుసలో ఉన్నారని ఆరోపించారు. ఏ జిల్లాలో చూసుకున్నా వైకాపా నాయకుల నిర్వాకం వలన వైరస్ వ్యాప్తి చెందిన సంఘటనలే ఉంటాయన్నారు. ``గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే ముస్తఫా బావమరిది ఢిల్లీ వెళ్లి వచ్చి క్వారంటైన్ కు వెళ్లలేదు. కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేయాలని సూచించినప్పటికీ.. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రోద్బలంతో స్థానిక డాక్టర్ వైద్యం చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యం మధుసూధన్ రెడ్డి ట్రాక్టర్ ర్యాలీ తీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి శిక్షలు వేస్తే విజయసాయి రెడ్డి సహా 150 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైల్లో ఉండేవారని స్పష్టం చేసారు. ఆదిమూలపు సురేష్ - హైదరాబాద్ వెళ్లి వచ్చినా ఎందుకు క్వారంటైన్ లో పెట్టలేదు?. కొత్త ఎస్.ఈ.సీగా నియామకం అయిన కనగరాజు ఏవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చారు? నెల్లూరులో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని నల్లపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద పోలీసులు కేసు పెడితే వందల మందితో స్టేషన్ ముందు ధర్నాకు దిగడం ఏమి సబబ’’ని కూనా రవికుమార్ నిలదీశారు.