గత కొన్ని రోజులుగా బీజేపీ - వైసిపీ మధ్య పొత్తు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే... ఈ ఇరు పార్టీల వ్యవహార శైలి కూడా అలాగే ఉంది... మరి కొన్ని రోజుల్లోనే వీరు కలిసిపోతున్నారు అనే భ్రమ ప్రజల్లో ఉంది... అయితే, దీని పై బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌రావు స్పందించారు... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపాతో కలిసి పోటీ చేసే అవకాశం లేదని తేల్చిచెప్పారు. అవినీతి పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వారిని భాజపా దగ్గరకు తీసుకోదన్నారు...
కేంద్రం ఆదేశిస్తే ఒక్క క్షణం కూడా తాను మంత్రి పదవిలో కొనసాగనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో భాజపా, వైకాపాలు కలుస్తాయంటూ వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎయిమ్స్ నిర్మాణానికి దశలవారీగా నిధులు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు... మరో పక్క మంత్రి మాణిక్యాలరావు మాకు జగన్ ఉన్నాడు అంటున్నారు కదా అంటే, వారి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కామినేని అభిప్రాయపడ్డారు.
ఇటీవల బిజెపి విజయవాడలో నిర్వహించిన సమావేశంలో 'కామినేని శ్రీనివాస్' అర్థంతరంగా బయటకు రావడంతో..ఆయన బిజెపిలో ఉండరని, టిడిపిలో చేరతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ..తాను బిజెపిలోనే ఉంటానని స్పష్టం చేశారు. బిజెపి,వైకాపా పొత్తు అయ్యే పనికాదని..అత్యంత నిజాయితీపరుడు..అత్యంత అవినీతిపరుడి మధ్య పొత్తు ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు.