నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గవర్నర్ దంపతులు ఉత్సాహంగా గడిపారు... సచివాలయానికి వచ్చిన గవర్నర్ దంపతులు.. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్‌ను సందర్శించి ముగ్ధులయ్యారు... ఈ సందర్భంగా ఆర్టీజీ సెంటర్ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి గవర్నర్ ఆనందం వ్యక్తంచేస్తూ.. గంట కాదు.. రోజంతా ఇక్కడే ఉండాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సచివాలయ భవనాల నిర్మాణం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. పాలనలో లోటుపాట్లను సాంకేతికత ఆధారంగా ప్రభుత్వం అధిగమిస్తున్న తీరును గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు.
నాలేడ్జ్, టెక్నాలజీల సమ్మేళనంతో పాలన సాగిస్తుండటం అద్భుతమని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించారు గవర్నర్. సర్వెలెన్స్ కెమెరాలు, డిజిటల్ క్లాసు రూములు, లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్, రేషన్ కార్డులు, పెన్షన్లు, డ్రోన్లు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పబ్లిక్ గ్రీవియెన్స్ తదితర అంశాలన్నీ ఆసక్తిగా గవర్నర్ దంపతులు పరిశీలించారు... సచివాలయం మొత్తాన్ని బ్యాటరీ కారులో తిరిగి గవర్నర్ దంపతులు పరిశీలించారు... అంతకు ముందు గవర్నర్ నరసింహన్, బడ్జెట్ సమావేశాల పురస్కరించుకుని, ప్రసంగం చదివి వినిపించారు..
ప్రధానంగా విభజన హామీలు ప్రస్తావిస్తూ, గవర్నర్ ప్రసంగం ఇలా సాగింది "విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందే. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా నష్టపోయింది. ప్రధాన ఆర్థిక కేంద్రాన్ని కోల్పోయింది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయంతో కష్టాలు మరింత పెరిగాయి. అందువల్ల కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలి. విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం అమలు చేయాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. "