వైసీపీలో కొత్తగా చేరిన నేతలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అప్పటి వరకూ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధినేత నేతలకు ఊహించని షాకిస్తున్నారు. మల్లాది విష్ణు కోసం వంగవీటి రాధాకు కేటాయించిన స్థానాన్ని మార్పు చేయడం, ఆనం కోసం బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని దూరం చేసుకోవడం, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్‌ను కాదని విడదల రజనీని సమన్వయకర్తగా నియమించడం, ఇప్పుడు తాజాగా ఇదే జిల్లా నుంచి పార్టీ కీలక నేత లేళ్ల అప్పిరెడ్డిని పక్కనపెట్టడం.. ఇలా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో అప్పటి వరకూ పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు డీలా పడిపోతున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై లేళ్ల అప్పిరెడ్డి గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఇలాంటి తరుణంలో పార్టీలో కొత్తగా చేరిన ఏసు రత్నంను పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అధిష్టానం నియమించడంతో లేళ్ల వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తమ నేతకు పార్టీ మొండిచేయి చూపడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రవేశాలకు లోనవుతున్నారు. ఈ విషయం తెలిసిన అప్పిరెడ్డి అనుచరులు కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాధాన్యత లేని చోట ఉండవద్దని, పార్టీ నుంచి బయటకు రావాలని అప్పిరెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. లేళ్ల మాత్రం మరోసారి అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్ ఏసురత్నంను గుంటూరు పశ్చిమం నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంపై అప్పిరెడ్డి వర్గం ఈ రోజు ఆందోళనకు దిగింది.
తాము అభ్యంతరం వ్యక్తం చేసినా అయననే ఇన్ చార్జీగా కొనసాగించడంతో పార్టీ నుంచి వెళ్లిపోదామని ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు. తాము నియోజకవర్గంలో పార్టీని బలపర్చేందుకు పనిచేస్తే సడెన్ గా బయటివ్యక్తికి నియోజకవర్గం బాధ్యతలు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ప్రస్తుతం అప్పిరెడ్డి వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవితో పాటు పశ్చిమం సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. గుంటూరు పార్లమెంట్ స్థానం విషయంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయం శ్రేణులను విస్మయానికి గురి చేసింది. గుంటూరు పార్లమెంట్ టికెట్ తనదేనన్న నమ్మకంతో లావు శ్రీకృష్ణ దేవరాయలు నియోజకవర్గమంతా కలియతిరిగారు. అయితే.. ఉన్నట్టుండి ఆయనను నరసరావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించారు.