ప్రణాళికాబద్ధమైన పచ్చదనంతో నగరాలను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ పీఎంఏవై (Ntr Pmay) గృహ నిర్మాణాలు, ‘పచ్చదనంతో పట్టణాలు, నగరాల సుందరీకరణ’ అంశాలను ముఖ్యమంత్రి బుధవారం సాయంత్రం సచివాలయంలో సమీక్షించారు. నవ్యాంధ్ర పచ్చదనంతో కొత్తశోభను సంతరించుకొనేందుకు రాజధాని అమరావతిలో బౌద్ధమాల, తిరుపతిలో వైకుంఠమాల, విశాఖలో సౌందర్యమాల పేర్లతో పచ్చదనాన్ని కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
రాజధాని అమరావతి, విశాఖ, తిరుపతిలలో జాతీయ రహదారులు, బాహ్యవలయ రహదారులు, నగరాలను కలిపే ప్రధాన రహదారుల చుట్టూ పచ్చదనం నింపి ఆకుపచ్చ హారంలా తీర్చిదిద్దాలని కోరారు. తిరుపతిలో వైకుంఠమాల, విశాఖలో సౌందర్యమాల, అమరావతిలో బౌద్ధమాలగా కారిడార్ల తరహాలో అభివృద్ధి చేసి పచ్చదనం తేవాలని ముఖ్యమంత్రి కోరారు. రహదారుల చుట్టుపక్కల మొక్కలు, చెట్లు నాటాలని సూచించారు.
వచ్చే మార్చిలోగా రాష్ట్రంలోని 71 పురపాలక సంఘాల పరిధిలోని కాలనీల్లో 100 ఉద్యానాలను (పార్కులను) అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వంద పార్కులను కాలనీ సంఘాలే నిర్వహించే విధంగా వారిని సిద్ధంచేయాలని, సోషల్ మెస్సేజింగ్ యాప్స్ ద్వారా హరిత సుందరీకరణ సంస్థ సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పచ్చదనంపై తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజల్ని కదిలించి భాగస్వాముల్ని చేశానని, ఇప్పుడు నవ్యాంధ్రలో పచ్చదనం, నగరాలు, పట్టణాల సుందరీకరణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, ఆనందానికి పచ్చదనంతో నగరాలను సుందరీకరించడం అనివార్యమని, ముందుకు వచ్చిన భాగస్వాములు కూడా చురుగ్గా కదిలి పనిచేయడంలేదని ముఖ్యమంత్రి అన్నారు. త్వరలో నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాలు, వైద్యశాలలు, కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.
నగరాలు, పచ్చదనంలో కాలనీ సంఘాలను భాగస్వాములను చేయాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. విశాఖ, విజయవాడ, శ్రీకాళహస్తిలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 3 కేంద్రీయ నర్సరీల ద్వారా కొత్త కొత్త ఫల, పుష్ప జాతులను ప్రజలకు పరిచయం చేయాలని, చైతన్యం తేవాలని సూచించారు. పదిరకాల పుష్పజాతుల్లో అగ్రశ్రేణిలో ఉండే 5 రకాలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 15 ప్రధాన వైద్యశాలలు, 11 విశ్వవిద్యాలయాలను పచ్చదనంతో సుందరీకరించే ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల రహదారులలో ఉన్న మధ్య తలాలను (central medians) సుందరీకరించాలని జాతీయ రహదారుల వెంట కంటికి ఇంపుగా, ఆకర్షణీయ రంగుల పుష్ప జాతుల మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. తిరుమల, అవిలాల చెరువులను ప్రాకృతిక సౌందర్యంతో తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళిక ఎంతవరకు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు.
హైవేల పక్క మొక్కలను సొగసుగా కత్తిరించి, మొక్కలను తొలగించి వేరొక చోట నాటే కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాజధాని ప్రాంతంలో మొక్కలు నాటడం, సుందరీకరణ వేగవంతం చేయాలన్నారు.
రాష్ట్రంలో 96 అమృత్ ఉద్యానాలు (అమృత్ పార్కులు) త్వరితగతిన నిర్మాణమవుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2015-16లో రూ. 16.57 కోట్లతో 30 అమృత్ పార్కుల నిర్మాణం చేపట్టగా వచ్చే నవంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. 2016-17లో రూ. 31.22 కోట్ల వ్యయంతో చేపట్టిన 32 అమృత్ ఉద్యానాల పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరికి పూర్తిచేస్తామని వివరించారు. 2017-18లో రూ.30.98 కోట్ల వ్యయంతో 32 ఉద్యానాల రూపకల్పన పనులు పురోగతిలో ఉన్నాయని, వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తిచేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి దృశ్య,శ్రవణ నివేదిక ద్వారా వివరించారు. నెల్లూరులో రూ.30 కోట్లతో చెరువు సుందరీకరణ మంజూరు దశలో ఉందని, వచ్చే ఏడాది డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తవుతాయని చెప్పారు.
శ్రీశైలం దేవాలయాన్ని రూ.2025 లక్షల వ్యయంతో, విజయవాడ కనకదుర్గ దేవాలయాన్ని రూ.2047.05 లక్షలతో, శ్రీకాళహస్తి ఆలయాన్ని రూ.1584.50 లక్షలతో, ద్వారకాతిరుమల దేవాలయాన్ని రూ.41473 లక్షలతో, అన్నవరం ఆలయాన్ని రూ.4118.30 లక్షలు, సింహాచలం ఆలయం రూ.310.00 లక్షలు, కాణిపాకం ఆలయాన్ని రూ377.25 లక్షల వ్యయంతో ( మొత్తం రూ 7177.13) సుందరీకరించే ప్రతిపాదనలను సిద్ధంచేసి అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.
పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో మొత్తం 181.09 కి.మీ మేర మధ్య తల్పాల (central medians) అభివృద్ధికి పనులు మంజూరయ్యాయి. ఇందులో 86.08 కి.మీ సివిల్ పనులున్నాయి. ఇప్పటిదాకా 69.38 కి.మీ మధ్యతల్పాల నిర్మాణం పూర్తయ్యింది.
పనులు మంజూరైన మొత్తం 181.09 కిమీలలో పచ్చికను మృదువుగా తీర్చిదిద్దడానికి (soft scaping) రూ..49.03 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.21.27 కోట్లు పచ్చికను మృదువుగా చేయడానికి, సివిల్ పనులకు రూ.27.8 కోట్లు కేటాయించారు. వచ్చే నెలాఖరులోగా ఈ పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
మొక్కలు నాటే కాలంలో రాష్ట్రమంతా 25.18 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటిదాకా 7.9 లక్షల మొక్కలు నాటడం పూర్తయ్యింది. వచ్చే అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని సీఎం సూచించారు. మొక్కల సంరక్షణకు ఒక్కో వృక్ష రక్షక కవచం కోసం రూ. 100 వంతున ధరతో 1,20,000 వృక్షరక్షక కవచాలను పంపిణీచేయాలని నిర్ణయించారు. వృక్షాలు, పుష్ప జాతులు, ఉద్యాన సేవలకు సంబంధించి మొబైల్ యాప్ ను తీసుకురానున్నట్లు ని హరిత, సుందరీకరణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. చంద్రమోహనరెడ్డి ముఖ్యమంత్రికి చెప్పారు. నగరాల్లో ప్రయోగాత్మకంగా పార్కులలో ఫిట్ నెస్ పరికరాలను ఏర్పాటుచేసి పౌరులకు మెరుగైన సదుపాయాల కల్పనకు రూ 1.98 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా కొన్ని చోట్ల ఉద్యానాల్లో ఇప్పటికే వీటిని నెలకొల్పారు. హరిత, సుందరీకరణ సంస్థ రాష్ట్రంలోని నగర పాలక, పురపాలక ప్రాంతాల్లో 650 ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. వీటిలో 156 (24%) ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 15% టెండర్ల దశలో ఉండగా, 10% పూర్తికాలేదు. 27% పురోగతిలో ఉండగా, 24% అసలు చేపట్టలేదు. ఈ 650 ప్రాజెక్టులలో ఉద్యానాలు (పార్కులు), నదీ అభిముఖ ప్రాంతాలు, రహదారి మధ్యతల్పాలు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వైద్యశాలలు, జాతీయ రహదారులు ఉన్నాయి.