ప్రవాసాంధ్రుల ప్రయోజనాల కోసం ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు (ఏపీఎన్ఆర్టీ) పాలకమండలి ‘ప్రవాసాంధ్రుల సంక్షేమం-అభివృద్ధి పాలసీ’ని నూతనంగా ప్రకటించింది. ఈ పాలసీలో భాగంగా ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్, ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర సహాయ నిధి వంటి ముఖ్యమైన పథకాలకు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఏపీఎన్ఆర్టీలో సభ్యులుగా వున్న 42,600 మందికి ఈ పాలసీ ద్వారా బహుళ ప్రయోజనాలు కలిగేలా చూడాలని శనివారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఏపీఎన్ఆర్టీ పాలకమండలి తొలి సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి ‘ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్’ పేరుతో కాల్ సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదవశాత్తు మరిణించినా, అంగవైకల్యం కలిగిన వారికి ‘ప్రవాసాంధ్ర భరోసా’ పథకం కింద రూ. 10 లక్షల బీమా కల్పించాలని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగ-ఉపాధి కోల్పోయినవారికి తక్షణ సాయం కోసం ‘ప్రవాసాంధ్ర సహాయ నిధి’ని రూ. కోటితో ఏర్పాటు చేయాలని సూచించారు.
‘ప్రవాసాంధ్రుల సంక్షేమం-అభివృద్ధి పాలసీ’ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ. 40 కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఇందులో భాగంగా తక్షణం రూ. 20 కోట్లు ఇచ్చేందుకు సమావేశంలో అంగీకారం వ్యక్తం చేశారు. ఏపీఎన్ఆర్టీకి విరాళాలు ఇచ్చేవారి కోసం ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పాలసీని సైతం తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఏపీఎన్ఆర్‌టీల కోసం హర్యానా తరహాలో స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ జోన్, ప్రత్యేక సెల్ వంటివి ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రవాస తెలుగువాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. ఇందుకు అవసరమయ్యే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
రూపాయి కూడా చెల్లించకుండా సభ్యత్వం కల్పించడంతో పాటు ప్రవాసాంధ్రులకు ఏపీఎన్ఆర్టీ పలు రకాల సేవలు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల దర్శనాలతో పాటు సుమారు 8 వేల మంది సభ్యులకు పలు సేవలను కల్పించింది. ప్రవాసాంధ్రలు సేవలకు సంబంధించి విస్తృత సమాచారం డ్యాష్ బోర్డులో లభిస్తుంది.
ఏపీఎన్ఆర్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకం
ఏపీఎన్ఆర్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా సుబ్బారాయుడు, రూపారాజు, మహ్మద్ బోరాలను నియమించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. రానున్న రోజుల్లో ఏపీఎన్ఆర్టీ మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించగా, మొత్తం 106 దేశాల్లో సుమారు 30 లక్షల మంది ప్రవాసాంధ్రులు వున్నారని, మార్చి నాటికి సభ్యత్వాల సంఖ్యను లక్ష చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీఎన్ఆర్టీ సీఈవో కోగంటి సాంబశివరావు ముఖ్యమంత్రి వివరించారు. ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా వున్న ఇంతమందిని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఏపీఎన్ఆర్టీ సాధించిన విజయమని తెలిపారు.
వచ్చే నెలలో రాష్ట్రంలో మరో 21 ఐటీ కంపెనీల ప్రారంభం
ఇప్పటివరకు 32 ఐటీ కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పిన ఏపీఎన్ఆర్టి సభ్యులు, 3,090 మందికి ఉద్యోగాలు వచ్చేందుకు దోహదపడ్డారు. వచ్చే నెల రోజుల్లో మరో 21 ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో మరో 3,390 మంది ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రవాసాంధ్రులకు కావాల్సిన నగరంలో, సరిపడా విస్తీర్ణంలో కార్యాలయ సముదాయాన్ని కేటాయించేలా తోడ్పడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమావేశంలో చెప్పారు.
ఏపీఎన్ఆర్టీ కృషితో హైదరాబాద్‌కు చెందిన 75 ఎంఎస్ఎంఈ సంస్థలు తమ యూనిట్లను కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో త్వరలో నెలకొల్పనున్నాయి. దీంతో రాష్ట్రానికి రూ. 200 కోట్ల విలువైన పెట్టుబడులు రావడంతో పాటు, రెండు వేల ఉద్యోగాలు రానున్నాయి.
విదేశాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక శిక్షణ
ఇకపై రాష్ట్రం నుంచి ఉద్యోగ-ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు వెళ్లే వారిపై దృష్టి పెట్టాలని చెప్పారు. మానవ వనరుల కల్పించే అంశంపై అవసరమైతే ఆయా ప్రభుత్వాలతో నేరుగా సంప్రదింపులు జరపాలని అన్నారు.
ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ భవంతి ఆకృతుకి ఆమోదం
అమరావతిలో ఏపీఎన్ఆర్టీ నిర్మించే ఐకానిక్ బిల్డింగ్ ఆకృతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. అమరావతిలోని మొదటి ఆంగ్ల అక్షరం ‘ఏ’ని ప్రతిబింబించేలా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. భవనం మధ్యలో ఏర్పాటు చేసే డిజిటల్ గ్లోబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనికి సీఆర్డీఏ 4.6 ఎకరాల భూమిని కేటాయించగా 10 ఎకరాల వరకు అవసరం వుందని పాలకమండలిలో పలువురు సభ్యులు కోరగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు, కూచిపూడి తెలుగుజాతి సంపదని, ప్రపంచమంతా మన గురించి తెలిసేలా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు వివిధ దేశాల్లో నిర్మించాలని చెప్పారు. ఇందుకోసం అవసరమయ్యే భూమిని ఇచ్చేందుకు ప్రవాసాంధ్రులు ముందుకొస్తే ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకరిస్తుందని ఏపీఎన్ఆర్టీ పాలకమండలి సభ్యులతో అన్నారు. కూచిపూడిని విదేశీయులు కూడా అభ్యసించేందుకు కృషి జరపాలని, నృత్య ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటేలా, తెలుగుజాతిని అంతా మమేకం చేసుకునేలా ప్రయత్నించాలని నిర్దేశించారు.
రాష్ట్రాభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా ప్రవాసాంధ్రుల్లో ప్రేరణ తీసుకొచ్చేలా ఏపీఎన్ఆర్టీ కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి సమావేశం చివరిలో ఆకాంక్ష వ్యక్తం చేశారు. స్మార్ట్ విలేజ్ల అభివృద్ధికి ఇప్పటివరకు రూ. 9 కోట్లు ఖర్చుచేసిన 107 మంది ఏపీఎన్ఆర్టీ సభ్యులను అభినందించారు.