ప్రజాస్వామ్యబద్ధంగానే అన్ని వ్యవహారాలు జరగాలని, కానీ కర్ణాటకలో అలా జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... "కర్ణాటకలో రెండు పార్టీలు కలిసి మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే, మెజార్టీలేని ఇతర పార్టీకి అవకాశం ఇచ్చారు.ఆ రోజు బీజేపీ చెప్పిన మాటలేంటీ? ఈ రోజు చేస్తోన్న పనులేంటీ? ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని అన్నారు. ఆ నాడు కాంగ్రెస్ పార్టీ వల్ల ఏపీలో ఎన్టీఆర్ నష్టపోయారు.
1984లో అప్రజాస్వామికంగా ఎన్టీఆర్‌ని పదవి నుంచి తీసేస్తే 30 రోజులు పోరాడి మళ్లీ ఆయనను సీఎం చేసిన ఘనత తెలుగు ప్రజలది, టీడీపీది. ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ప్రజాస్వామికంగా ముందుకు వెళ్లాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నామని కర్ణాటకలో గానీ, మన రాష్ట్రంలోగానీ ఎక్కడైనా ఇష్టానుసారంగా ప్రవర్తించడం మంచిది కాదు అని అన్నారు. తక్కువ వనరులు ఉన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేయడం, ఆర్థిక అసమానతల్ని తగ్గించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తాను ప్రజల సంక్షేమం కోసమే కష్టపడుతున్నట్టు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు, వైకాపాలో అవినీతిపరులు కొందరు తనను విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. వారి విమర్శలు చూస్తుంటే.. ఎవరైనా ఒక దొంగ దొంగతనం చేసి జైలుకు వెళ్లి మళ్లీ బెయిల్‌పై ఇంటికి వచ్చి ఆ ఊళ్లో పెద్దమనిషిని అంటే ఆయన ఎంత బాధపడతాడో తానూ అంతే బాధపడుతున్నానన్నారు. ఏకవచనంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ఆ మాటలన్నీ ప్రజల కోసమే పడుతున్నానన్నారు.