కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు పోలవరం సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును నేడు సందర్శిస్తారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం పోలవరం పనులను వేగంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేంద్ర మంత్రి పోలవరం సందర్శనకు రావడాన్ని అనుకూలంగా మలచుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తున్నది. గత ఏడాది కాలంగా ఇదిగో అదుగో అంటూ గడ్కరీ పోలవరం సందర్శన కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆయన పోలవరం సందర్శనకు నేడు రానున్నారు. పోలవరం పనులకు సంబంధించి అయుదు కీలక విషయాల పై పట్టుబట్టి, హామీ తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
1. పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలు రూ. 57 వేల కోట్లు కేంద్రానికి పంపింది. తక్షణం ఈ సవరించిన అంచనాలు ఆమోదం పొందడం ప్రధానం. ఈ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు. 2. పూర్తయిన పనుల్లో కేంద్రం నుంచి రూ. 2300 కోట్లు రావాల్సి ఉంది. వీటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అథారిటీకి బిల్లులను అందించింది. మరోవైపు స్పిల్‌వే, డయాఫ్రం వాల్, ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం పనులకు సంబంధించి రూ.3,217 కోట్లు రావాల్సి ఉంది. జాతీయ హోదా ప్రకటించడానికి ముందు రూ. 5,135 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయగా, మిగిలిన దాదాపు రూ. 11 వేల కోట్లు తామే భరిస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. అయితే సమయం మించుతున్నా వాటి గురించి కేంద్రం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు.
3. సవరించిన అంచనాలు ఆమోదించే లోపు రూ.10 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేసి ఆ నిధులు విడుదల చేయాలని రాష్ట్రం కోరుతోంది. 4. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ పరంగా గతంలో ఎప్పుడో ఇచ్చిన వర్కుస్టాప్ ఆర్డర్ అప్పుడప్పుడు ప్రాజెక్టు పనులకు ఇబ్బంది కలిగిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ ఉత్తర్వులకు స్టే తెచ్చుకోవాల్సి వస్తోంది. పోలవరం పనుల నిలుపుదల ఉత్తర్వులను శాశ్వతంగా రద్దు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. 5. పోలవరంలో నిధులు ఎంత ముఖ్యమో, సకాలంలో కేంద్ర జలసంఘం ఆకృతులు ఆమోదించడమూ అంతే ముఖ్యం. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీయే పని చేస్తోంది. ఎప్పటికప్పుడు వారి సూచనలకు అనుగుణంగా గుత్తేదారులు ఆకృతులు సమర్పిస్తున్నారు. ఆకృతులు ఆమోదం పొందకపోవడం వల్ల కాంక్రీటు మొదటి బ్లాకులో పని ఇంకా ప్రారంభం కాలేదు. అందుకే త్వరతిగతిన, ఆమోదం ఇవ్వాలని గడ్కరీని ప్రభుత్వం కోరనుంది.