ప్రజల పై అభిమానం ఉంటే జగన్ ముసుగు నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పై టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మండిపడ్డారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద బుధవారం మీడియా సమావేశంలో రామారావు మాట్లాడుతూ విశాఖలో విగ్రహాల తొలగింపునకు టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని టీడీపీకి అంటగట్టాలని కొందరు మేధావుల ముసుగులో చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. విశాఖ ఆర్కే బీచ్లో అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి హరికృష్ణ, దాసరి నారాయణరావు విగ్రహాల ఏర్పాటులో యార్లగడ్డ పాత్ర అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. జీవీఎంసీ నుంచి అనుమతి లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేశారన్న కారణంగా అధికారులు వాటిని తొలగించారనే విషయాన్ని ఆ మేధావులు గుర్తించాలని కోరారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఇటువంటి అంశాల్లో ముఖ్యమంత్రి పాత్ర ఏ మేరకు ఉంటుందో అన్న ఆలోచన లేకుండా దుర్బుద్ధితో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటి గురించి యార్గగడ్డకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ, సంబంధం లేని అంశాలను పార్టీకి, ముఖ్యమంత్రికి ఆపాదించడం ఆయన స్థాయికి తగదని హితవుపలికారు. సమాజంపై అంతటి అభిమానం ఉంటే వైకాపా ముసుగు తొలగించుకుని ముందుకు రావాలని వ్యాఖ్యానించారు.