రాష్ట్రపాలనా వ్యవహారాలకు కీలకమైన సచివాలయంలో 15 రోజుల నుంచి ప్రైవేటు మెయిల్ సర్వీసులు నిలిపివేతపై ఉద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా సైబర్ దాడులు జరుగుతాయనే భయమా?.. లేదా కీలక ఫైళ్లు బయటకు వెళ్లకుండా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యా?.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ పేరుతో మెయిల్ సర్వీసులు నిలిపివేయడంతో ఉద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారు. ఐటీ శాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మెయిల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినప్పుడు చూద్దాంలే అని ఫైళ్లు పక్కన పడేస్తున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై హ్యాకర్లు దాడి చేశారన్న సమాచారంతో అప్రమత్తమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెయిల్ సేవలు నిలిపివేయడం నమ్మశక్యంగా లేదని ఉద్యోగులు అంటున్నారు. ప్రస్తుతం సచివాలయం నుంచి కీలక ఫైళ్లు బయటకు వెళ్తున్నాయి.
జగన్ ముఖ్యమంత్రి అవుతారని బలంగా నమ్ముతున్న అధికారులు కొన్ని ముఖ్యమైన ఫైళ్లను సచివాలయం నుంచి బయటకు చేరవేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కేవలం మెయిల్ సర్వీసులపైనే ఆంక్షలు విధించారని భావిస్తున్నారు. డేటా భద్రత, బ్యాక్‌పల కోసం ప్రముఖ సంస్థలు ఏపీ సచివాలయంలో సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు సురక్షితమైన ఫైర్‌వాల్ ఉంది కాబట్టి హ్యాకర్లు దాడిచేసే అవకాశం లేదని ఉద్యోగులు చెప్తున్నారు. వైర్‌సలు ఎక్కువగా వ్యాపించే ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా నెట్‌వర్క్‌పై ఎలాంటి ఆంక్షలూ విధించని ప్రభుత్వం... కేవలం మెయిల్ సేవలపై ఆంక్షలు విధించడం ఫైళ్ల భద్రత కోసమేనని వ్యాఖ్యానిస్తున్నారు. సచివాలయంలోని ఏపీ డేటా సెంటర్, ఏపీస్వాన్‌లో ఐటీ వ్యవస్థ పూర్తి సురక్షితంగా ఉందని ఏపీటీఎస్ చెప్తున్నా.. మెయిల్ సర్వీసులను ఎప్పటికి పునరుద్ధరిస్తారో మాత్రం చెప్పలేకపోతున్నారు.
తెలుగు రాష్ర్టాల్లో డిస్కమ్‌లపై హ్యాకింగ్ జరగకముందే... సైబర్ భద్రత ముందస్తు చర్యల్లో భాగంగా అపరిచిత మెయిల్స్ తెరవరాదని, అనుమానం ఉన్న మెయిల్స్ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్‌కు తెలియజేయాలనే సూచనలు ఇచ్చారు. దీనివల్ల రాబోయే ముప్పును ఎంతవరకూ అడ్డుకున్నారనే విషయాన్ని పక్కనపెడితే అసలు పని నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ మెయిల్ సర్వీస్ అందుబాటులో ఉంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సేవలతో పాటు, ఏపీ టెక్నికల్ సర్వీసు ఉద్యోగులకు డాట్ జీవోవి డాట్‌ఇన్ ఎక్స్‌టెన్షన్‌తో మెయిల్ సదుపాయం కల్పించింది. ఉద్యోగులకు అధికారిక మెయిల్ ఉన్నందున ప్రైవేట్ మెయిల్స్ అవసరం లేదన్నది టెక్నికల్ టీమ్ ఆలోచన. ఇందులో కొంత వాస్తవమున్నా ప్రభుత్వ మెయిల్ సర్వీసు ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు మొరాయిస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రైవేట్ మెయిల్ సర్వీసులపైనే ఉద్యోగులు ఆధారపడుతున్నారు.