రేపు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. మంగళవారం విడుదల కానున్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా వారికి మీ అండ అవసరం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మార్కులు తక్కువ వచ్చాయని వారిని పొరబాటున కూడా నిందించవద్దని, ఇతర పిల్లలతో పోల్చి అవమానకరంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. మార్కులు సరిగా రాని పిల్లలను దూషించడం ద్వారా వాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు పిల్లల తెలివితేటలకు కొలమానాలు కాదని, కిందపడినా రెట్టించిన ఉత్సాహంతో పైకిలేచే కడలి అలలను స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మళ్లీ ప్రయత్నం చేయడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చంటూ పిల్లల్లో ప్రేరణ కలిగించాలని తల్లిదండ్రులకు సూచించారు. మార్కులు సరిగారాని పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ను 14వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తుందని ట్వీట్ చేశారు. ఈ ఫలితాలను విద్యార్థులు rtgs.ap.gov.in వెబ్ సైట్ ద్వారా, లేదా, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్, ఖైజాలా యాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈసారి ప్రత్యేకంగా టెలివిజన్ తెరలపైనా పదో తరగతి పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చని చంద్రబాబు వివరించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్నవాళ్లు తమ సెట్ టాప్ బాక్స్ ద్వారా విద్యార్థి హాల్ టికెట్ నంబర్ టైపు చేస్తే టీవీ తెరపై పరీక్షల ఫలితాలు ప్రత్యక్షమవుతాయని తెలిపారు. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తన ట్వీట్ లో వెల్లడించారు.