దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక వింత... 35 రోజుల పోలింగ్ తరువాత, రీపోలింగ్ కు ఎందుకు ఆదేశించారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ 35 రోజుల్లో ఏమి జరిగిందో చూస్తే... చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని, వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తలపడ్డారు. పోరు హోరాహోరీగా జరిగింది. 25 పోలింగ్‌బూత్‌లలో వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని, అక్కడ రీపోలింగ్ జరపాలని పులివర్తి నాని గత నెల 11న పోలింగ్ ముగిసిన మరుసటిరోజునే ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారితో మొదలుకుని కలెక్టర్‌కు, సీఈవోకు, ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మొరపెట్టుకున్నారు. ఈసీ దీనిపై ఏమాత్రం స్పందించలేదు. నిజానిజాలపై కనీసం ఆరా తీయలేదు.
జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ నుంచి నుంచికానీ, రిటర్నింగ్ అధికారి నుంచి కానీ ఎలాంటి వివరణ కోరలేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే టీడీపీ అభ్యర్థి ఫిర్యాదును బుట్టదాఖలు చేశారు. ఏప్రిల్ 11న పోలింగ్ ముగియగా... ఆ తర్వాత 25 రోజులకు, అంటే ఈనెల 6వ తేదీన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఐదు బూత్‌లలో రిగ్గింగ్ జరిగిందని, అక్కడ రీపోలింగ్ జరపాలని కోరారు. దీనిపై సీఈవో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే... ఆ మరుసటి రోజునే (మే 7) సీఎస్ కార్యాలయం నుంచి సీఈవోకు లేఖ వెళ్లింది. వైసీపీ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలన్నది దీని సారాంశం. 8వ తేదీన సీఈవో దీనిపై స్పందించారు. ఫామ్ 17సీ, ప్రిసైడింగ్ అధికారి డైరీ, సీసీ టీవీ ఫుటేజీ, మైక్రో అబ్జర్వర్ నివేదిక, జనరల్ వీడియో కవరేజీ దృశ్యాలను సత్వరం పంపించాలని ఆదేశించారు.
సీఈవో అడిగిన వివరాలన్నీ జిల్లా ఎన్నికల అధికారులు పంపించారు. వీటి ఆధారంగా 10వ తేదీన ఒకటి, 11వ తేదీన మరొకటి ఈసీకి సీఈవో లేఖ రాశారు. బూత్‌లలోకి కొందరు వ్యక్తులు వెళ్తున్న దృశ్యాలు నమోదైనందున రీపోలింగ్ జరపాలని కోరారు. దీనిపై బుధవారం ఈసీ స్పందించింది. ఐదు బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ బూత్‌లలో ఒకటి టీడీపీ అభ్యర్థి నాని సొంతగ్రామం పులివర్తివారిపల్లెలోనిది. "పాతిక బూత్‌లలో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని పోలింగ్ మరుసటి రోజే నేను ఫిర్యాదు చేశాను. వైసీపీ అభ్యర్థి స్వగ్రామం తుమ్మలగుంటలోని బూత్‌లో ఏకపక్షంగా ఓట్లు వేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లిన నా సతీమణి సుధారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అక్కడ అక్రమాలు జరిగినట్లు పక్కా ఆధారాలున్నా ఈసీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన పాతిక రోజుల తర్వాత వైసీపీ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో కుట్ర జరిగింది." అంటూ చంద్రగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ చెప్పారు.