సెలవులో వెళ్లిన సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ ఇంటి వద్ద, ఈ రోజు ఉదయం కలకలం రేగింది. అలోక్ వర్మ ఇంటి దగ్గర నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలోని ఆయన ఇంటి చుట్టూ సంచరిస్తుండటంతో భద్రతా సిబ్బంది వారిని బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు వీరిని ధీరజ్ కుమార్, అజయ్ కుమార్, ప్రశాంత్, వినీత్ కుమార్ గుప్తాగా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా తాము నిఘా వర్గాలకు (ఇంటిలిజెన్స్ బ్యూరో) చెందిన అధికారులమని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించుకోనున్నారు.
అయితే అలోక్ వర్మ వైపు ఉన్న వాళ్ళు చెప్పిన ప్రకారం, అలోక్ వర్మపై ఈ ఉదయం హత్యాయత్నానికి చేసిన ప్లాన్ విఫలమైందని, నలుగురు వ్యక్తులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐడీ కార్డులతో వచ్చి, అలోక్ వర్మ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా, వారిపై సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి వారిని ఆపుతూ ఉండగానే, ఈ నలుగురూ, పలాయనం చిత్తగించేందుకు ప్రయత్నించారని, అక్కడే ఉన్న ఇతర సిబ్బంది, జవాన్లు, వారిని అడ్డగించి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. అలోక్ వర్మ ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకోగా, నిందితులను రోడ్డుపై పట్టుకుని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి.
కాగా, అంతర్గత పోరు నేపథ్యంలో అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాలను ప్రభుత్వం బుధవారం సెలవుపై పంపిన విషయం తెలిసిందే. వీరి స్థానంలో తాత్కాలిక డైరెక్టర్గా ఎం.నాగేశ్వరరావును నియమించారు. సీబీఐ ప్రతిష్ఠను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. తనను అక్రమంగా తొలగించారంటూ సుప్రీంకోర్టులో అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. మరో పక్క, మోడీ ఎంతో భయపడుతున్నారని, అలోక్ వర్మ దగ్గర మోడీ గుట్టు అంతా ఉందని, అందుకే ఇంటలిజెన్స్ ను పంపించి, అలోక్ వర్మ ప్రతి కదిలక తెలుసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.