సీబీఐలో తలెత్తిన అంతర్యుర్ధం దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో తనను సెలవుపై పంపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మ బుధవారంనాడు సవాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. వర్మ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈనెల 26న ఆయన పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మను తొలగించడంపై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన పదవి కాలం ముగియకుండానే సస్పెండ్ చేయడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అలోక్ వర్మ పిటిషన్‌ను స్వీకరించింది. బుధవారం ఉదయం అలోక్ వర్మ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ఈనెల 26న విచారించడానికి అంగీకరించింది. అలోక్ వర్మ పదవీకాలం ఇంకో రెండు నెలలు ఉందని, అలాంటప్పుడు ప్రభుత్వం మధ్యలో తొలగించడానికి వీల్లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, తన క్లయింట్‌ను, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను సెలవుపై వెళ్లాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించడం వల్ల అనేక సున్నితమైన కేసుల విచారణ విషయంలో రాజీపడే అవకాశాలుంటాయని వర్మ తరఫు హాజరైన న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సుప్రీంకోర్టు విన్నవించారు.
మరోవైపు, తాత్కాలిక సీబీఐ డెరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావును కేంద్రం నియమించడంతో ఆయన నియామకం వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో ఆయన అలోక్ వర్మ పనులన్నీ స్యయంగా చూసుకుంటారు. సీబీఐ తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును ఆస్థానా ఆశ్రయించిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు సైతం తదుపరి విచారణ తేదీ (ఈనెల 29) వరకూ ఆస్థానాపై ఎలాంటి చర్య తీసుకోరాదని ఆదేశించింది. కాగా అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానా మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వారిద్దరినీ ప్రభుత్వం సెలవులపై పంపిన విషయం తెలిసిందే.