టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని మంగళవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు రేవంత్ అనుచరులుని, మీడియాని ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఇస్తూ, తప్పుదోవ పట్టించారు. ముందుగా రేవంత్ బెడ్ రూమ్ తలుపులు బద్దలుగొట్టి, రేవంత్ ని బయటకు ఈడ్చుకుని కార్ లో తీసుకువెళ్తున్న సమయంలో, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా చెప్పకుండా, వెళ్ళిపోతూ ఉండటంతో, రేవంత్ అనుచరులు పోలేసులు వెనుకు వెళ్లారు. అదే సమయంలో మీడియా కూడా వెంట వెళ్ళింది. ఈ సమయంలో రేవంత్ అనుచరులు వస్తున్న కార్ ని, వేరే పోలీస్ వాహనంతో గుద్ది పక్కకు తోసేసి, తాళం లాక్కుని వెళ్ళిపోయారు. ఇదే సమయంలో మీడియాని కూడా తప్పుదోవ పట్టించటానికి, వాహనాలను వివిధ మార్గాల్లో తీసుకువెళ్ళారు. అయితే హైదరాబాద్ వెళ్తున్నారని, అందరూ భావించారు.
హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహన శ్రేణికి మీడియా ఫాలో అవ్వగా, రేవంత్ ని మరో వైపు తీసుకువెళ్లారు. చివరకు రేవంత్ ని జడ్చర్లకు తరలించారు. ప్రస్తుతం జడ్చర్లలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో రేవంత్ ఉన్నారు. అయితే హైదరాబాద్ తీసుకువస్తే మీడియా హడావిడి ఎక్కువగా ఉంటుంది, చంద్రబాబు కూడా అక్కడకు వచ్చి రేవంత్ ని కలిస్తే, మరింత డ్యామేజ్ జరుగుతుందని భావించి, రేవంత్ ను జడ్చర్ల తీసుకువెళ్ళారు. అసలు ఎక్కడకు తీసుకువెళ్తుననరో చెప్పకుండా, ఇన్ని ట్విస్ట్ లు ఇచ్చి, చివరకు జడ్చర్ల పోలీస్ శిక్షణ కేంద్రంలో పడేసారు. రేవంత్ సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రేవంత్ అనుచరులు యూసుఫ్, ప్రశాంత్, రెడ్డి శ్రీనివాస్, సత్యపాల్, వెంకట్రెడ్డిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొడంగల్‌లో నిర్వహించబోయే ఎన్నికల ప్రచార సభను అడ్డుకుంటామని రేవంత్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేవంత్ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. దీంతో కొడంగల్ పీఎస్‌లో రేవంత్‌పై 341, 188, 506, 511 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఇవాళ ఉదయం రేవంత్‌ను అరెస్ట్ చేశారు. కొడంగల్ అభ్యర్థిని అరెస్ట్ చేయడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న కేసీఆర్ కూడా చంద్రబాబుని అడ్డుకోమని చెప్పారని, అప్పుడు లేని నిబంధనలు, ఇప్పుడే వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు.