గ్రామ వలంటీర్ల పోస్టులకు పార్టీ కార్యకర్తలు దరఖాస్తు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత బూత్‌ కమిటీల ఇన్‌ఛార్జులదేనని వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వారికెలా న్యాయం చేయాలనేది సీఎం ముఖ్య సలహాదారుతో పాటు పార్టీ చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. గ్రామ వలంటీర్లకు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని, అర్హులు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో లోక్‌సభ, శాసనసభ, మండల బూత్‌ కమిటీ ఇన్‌ఛార్జులతో వైకాపా బూత్‌ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ తీరుపై సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, విజయసాయిరెడ్డి కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘పార్టీ విజయంలో కార్యకర్తల కృషి ఎంతో ఉంది.

vsreddy 14062019

మీ సేవలను పార్టీ ఎన్నటికీ మరవదు. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఏర్పాటు చేసుకున్నాక ప్రతి శని, ఆదివారాలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. గ్రామ వలంటీర్లు పార్టీకి, ప్రజలకు మేలు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2019లో పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. అవినీతిరహిత పాలనతో 2024లోనూ అధికారం నిలబెట్టుకోవటానికి అందరూ పట్టుదలగా పనిచేయాలి’ అని చెప్పారు. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.44కోట్ల కుటుంబాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీరు వంతున 2.88లక్షల మంది కార్యకర్తలను తీసుకునే వీలుందన్నారు. ‘ఎంపిక విధానంపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

vsreddy 14062019

మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దారు నేతృత్వంలోని కమిటీ ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. పార్టీ కోసం కష్టపడిన వాళ్లు దరఖాస్తు చేసుకునేలా చూడాలి. గ్రామీణ ప్రాంతంలో గ్రామం, పట్టణ ప్రాంతంలో వార్డు యూనిట్‌గా గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ చేపడతారు. ’ అని ఆయన చెప్పారు. ‘పల్లెల్లో గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తయినవెంటనే వాటిలో భారీ సంఖ్యలో ఉద్యోగాలుంటాయి. వలంటీర్ల నియామకం గురించిన ఆలోచన చేశాం. వైసీపీ కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ సముచితస్థానం ఉంటుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వాళ్లలో ఎక్కువగా పదోతరగతి కంటే తక్కువ చదివిన వారే ఉన్నారని, గ్రామ వలంటీర్ల ఎంపిక ఇప్పుడే చేపడితే కార్యకర్తల్లో అసంతృప్తి రావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేవరకు బతికే ఉంటానని రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు అన్నారు. గురువారం ఆయన ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా యడ్లపాటి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం కుటుంబాన్ని సైతం త్యాగం చేసి చంద్రబాబు కృషి చేశారన్నారు. రాష్ట్ర ప్రజలే తన కుటుంబంగా భావించారని కొనియాడారు. ప్రజల్లో ఇప్పటికే పొరపాటు చేశామనే భావన తెలుస్తోందన్నారు. పార్టీ శ్రేణులు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తిరిగి చంద్రబాబును సీఎం చేస్తారన్న తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. అనంతరం అధినేత చంద్రబాబు మాట్లాడుతూ మీలాంటి పెద్దల ఆశీస్సులు ఉంటే పార్టీ తిరిగి అధికారంలోకి రావటం పెద్ద కష్టమేమి కాదని అన్నారు.

yadlapati 1462019 1

మీరే మా అందరికీ స్ఫూర్తి అని యడ్లపాటి వెంకట్రావును ఉద్దేశించి తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వెంకట్రావు చేతుల మీదుగా ఎందరికో బీఫాంలు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, చినరాజప్ప, ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, అనగాని సత్యప్రసాద్‌, మద్ధాళి గిరిధర్‌, నేతలు మన్నవ సుబ్బారావు, పోతినేని శ్రీనివాసరావు, కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ‘మీ కష్టం మాకు తెలుసు. అదే మిమ్మల్ని గెలిపిస్తుంది’ అని పార్టీ కార్యకర్తలు చంద్రబాబుతో అన్నారు. మా కోసం ఎంతో కష్టపడుతున్నారు..మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, చిత్తూరు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు ఆయనను కలిశారు.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల పై సామాన్య ప్రజలకు కూడా సందేహాలు ఉన్న విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చిన తరువాత, ఆ ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు ఫలితాలకు ముందు ఈ విషయం పై దేశ వ్యాప్త పోరాటం చేసారు కూడా. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, ఈ విషయం పై మాట్లాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎన్నో అవకతవకలు, పోలైన ఓట్లకు, ఫలితాలకు తేడా ఉన్నా, ఎవరూ సమాధానం చెప్పే వారు లేరు. ఈ నేపధ్యంలో, సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ పై హైకోర్ట్ ని ఆశ్రయించారు టీడీపీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. తన నియోజకవర్గ పరిధిలో 16 ఈవీఎంలలో ఓట్ల తేడా పై వీవీ ప్యాట్స్ కౌంటింగ్ జరపాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు బోండా ఉమా... దీంతో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంలో బోండా ఉమాపై వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

bonda 13062019

మరో పక్క, తిరుపతి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సుగుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచింది తానేనని.. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మోసం చేసి గెలిచారని ఆరోపించారు. త్వరలోనే తానున కోర్టును ఆశ్రయించబోతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అవకతవకలు జరిగాయని సుగుణమ్మ ఆరోపిస్తున్నారు. సాంకేతికంగా టీడీపీ ఓడినట్టు అధికారులు చెబుతున్నా.. నైతికంగా తానే గెలిచానన్నారు. 12వ రౌండ్‌లో టీడీపీకి 1700 ఓట్లతో మెజార్టీ ఉందని.. పోస్టల్‌ బ్యాలెట్‌‌ విషయంలో తేడా జరిగిందరన్నారు. 700 ఓట్లకు పైగా పోస్టల్‌ బ్యాలెట్లను మార్చేశారని ఆరోపించారు. 11 రౌండ్ల వరకు టీడీపీ 3100 ఓట్ల ఆధిక్యతలో ఉందట.. 12వ రౌండ్‌లో 1336 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో నిలిచిందట. 13రౌండ్‌‌లో 2045 ఓట్లు వైసీపీకి ఆధిక్యత రాగా.. రెండు రౌండ్లు కలిపితే 3381 ఓట్లు కరుణాకరరెడ్డికి రావడంతో 3100 ఓట్ల ఆధిక్యతలో ఉన్న సుగుణ 281 ఓట్లతో వెనుకబడ్డారట.

bonda 13062019

ఇక 14వ రౌండ్‌లో ఎల్‌ఎస్‌ 726 ఓట్లున్న ఒకే ఈవీఎం ఉండగా.. టీడీపీ తమకు అనుకూలంగా వస్తాయన్న భావించిందట. కానీ టీడీపీకి 46 ఓట్లు మాత్రమే ఆధిక్యత రాగా.. అప్పటికీ 235 ఓట్లతో వైసీపీ ఆధిక్యంలో ఉంది. తర్వాత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించగా.. వైసీపీకి 1167 ఓట్లు, టీడీపీకి 691 ఓట్లు రావడంతో ఫ్యాన్ పార్టీని విజయం వరించింది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అవకతవకలు జరిగాయని సుగుణమ్మ ఆరోపిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో 2800 పోస్టల్‌ బ్యాలెట్లున్నాయి.. వీటిలో 2508 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయన్నారు సుగుణమ్మ. వీటిలో 308 కవర్లను ఓపెన్‌ చేయకుండా డస్ట్‌బిన్‌లో పడేశారని.. వీటిని ఎందుకు అనర్హతగా ప్రకటించారని అడిగితే పట్టించుకోలేదన్నారు. పోస్టల్ బ్యాలెట్లలో ఓపెన్‌ చేసిన వాటిలో టీడీపీకి వచ్చిన 175 పోస్టల్‌ బ్యాలెట్లు డబుల్‌ టిక్‌లు ఉన్నాయని.. ఉద్యోగులు డబుల్‌ టిక్‌లు ఎందుకు పెడుతారని అధికారుల్ని ప్రశ్నించినా పట్టించుకోలేదన్నారు. ఎంపీ అభ్యర్థికి వచ్చిన 200 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటులో తమకు రాలేదన్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ ఇద్దరు నేతల పోరాటం చూసి, ఇంకా ఎంత మంది నేతలు బయటకు వస్తారో చూడాలి. వచ్చినా వారికి న్యాయం జరుగుతుందా, ఏదైనా కుట్ర జరిగి ఉంటే, అది బయటపడుతుండా, కాలమే వీటికి సమాధానం చెప్పాలి.

విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. ఇద్దరు రోగులు చనిపోయిన ఉదంతం కలకలం రేపింది. బుధవారం రాత్రి బలంగా వీచిన గాలులకు ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన కొద్దిసేపటికే వీరిద్దరు మరణించారు. కరెంటు పోయిన వెంటనే జనరేటర్‌ వేయకపోవడంతో, ఆక్సిజన్‌ అందక తమవారు చనిపోయారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద కొన్ని గంటలపాటు వారంతా బైఠాయించారు. అయితే, బాధితుల వాదనను ఆస్పత్రి వర్గాలు మాత్రం కొట్టివేస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..విజయవాడ ఇందిరానగర్‌కు చెందిన కె.వరప్రసాద్‌ (22) ప్రమాదంలో గాయపడ్డారు. తలకు బలమైన గాయం తగిలిన ఆయనను శనివారం కొత్త ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ట్రామా కేర్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

current 14062019 1

అదే విభాగానికి మంగళవారం విజయవాడ రాణిగారితోటకు చెందిన ఎస్‌.ఆదినారాయణ (50)ను తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదినారాయణ ఓ ప్రమాదంలో గాయపడ్డారు. అతని కుటుంబ సభ్యులు తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మంగళవారం ఇక్కడకు తీసుకువచ్చారు. వరప్రసాద్‌, ఆదినారాయణ బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఒకరి తర్వాత మరొకరు చనిపోయారు. వారు చనిపోవడానికి ముందుగా ఈదురు గాలుల కారణంగా ఆ ఆస్పత్రిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కాసేపటికి ఆస్పత్రి సిబ్బంది జనరేటర్‌ను ఆన్‌చేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. అయితే జనరేటర్‌ ఆన్‌ చేయడంలో జాప్యం వల్లే తమవారు ఆక్సిజన్‌ అందక చనిపోయారనేది బాధితుల ఆరోపణ. అయితే, తమ దగ్గరకు వచ్చేప్పటికే ఆ రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రుల అధికారులు వాదిస్తున్నారు.

current 14062019 1

విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా సుమారు అరగంటపాటు వెంటిలేటర్లకు బ్యాకప్‌ ఉంటుందని వివరించారు. ఆ అరగంట లోపే జనరేటర్‌ను ఆన్‌ చేసి విద్యుత్తును పునరుద్ధరించడం జరిగిందన్నారు. వరప్రసాద్‌, ఆదినారాయణ చికిత్స పొందుతున్న ట్రామా కేర్‌లోనే మరో ఏడుగురు వెంటిలేటర్లపై ఉన్నారని, వారంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు. కాగా, విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) కె.బాబ్జి ఆస్పత్రికి వచ్చి విచారణ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.బాబూలాల్‌తో మాట్లాడి వివరాలు సేకరించి వెళ్లారు.

Advertisements

Latest Articles

Most Read