గ్రామ వాలంటీర్ల విషయంలో అంతా అనుకున్నట్టే జరుగుతంది. గ్రామ వలంటీర్ల ఎంపిక పారదర్శకంగా నిర్వహిస్తామని, ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులతో విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ నెల 11వ తేదీన ఇంటర్వ్యూల ప్రక్రియ మొదలైంది. ఈ మూడు రోజుల్లో కొంత మందికి ఇంటర్వ్యూ చేశారు. మరో 11 రోజుల పాటు ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అయితే వాలంటీర్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకు ప్రధాన కారణం గడిచిన మూడు రోజుల ఇంటర్వ్యూల్లో ఎదురైన అనుభవాలేనని అభ్యర్థులు చెబుతున్నారు. గ్రామాల్లోని వైసిపి నాయకులను మీకు అనుకూలంగా ఉండే వారిని వలంటీర్లగా దరఖాస్తు చేయించి తలో మూడు, నాలుగు పేర్లు జాబితా ఇవ్వాలంటూ ఎంఎల్ఎలు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో గ్రామాల్లోని వైసిపి నాయకులు తమకు నచ్చిన వారి పేర్ల జాబితాను ముందే ఇచ్చేశారు. అదే సమయంలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఇబ్బంది ఏర్పడతుందేమోనన్న భయంతో ముందుస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు.
వాలంటీర్లను అడిగే ప్రశ్నలకు సంబంధించి అధికారులు ముందస్తుగానే 60 ప్రశ్నల జాబితాను తయారు చేసుకున్నట్లు తెలిసింది. వీటిలో ప్రతి అభ్యర్ధినీ నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు అంతకు మించి అడుగుతున్నారని తెలుస్తోంది. అధికారులు తయారు చేసిన ప్రశ్నల జాబితాను వైసిపి నాయకులు ఏకంగా ముందుగానే ఇంటర్వ్యూకు వెళ్తున్న తమ వలంటీర్లకు ఇస్తున్నారు. ప్రశ్నలకు జవాబులను ముందుస్తుగానే బట్టీ పటిస్తున్నారు. ఒకవేళ అడిగిన ప్రశ్నలకు ఎన్ని సమాధానాలు ఇచ్చారన్న అంశం వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం గ్రామాల్లో హాట్ టాపిక్ గా మారింది. గ్రామాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సైతం సాగుతోంది. దీంతో ఇంటర్వూల ప్రక్రియ అంతా బోగస్ అని, వెళ్లడం దండగా అంటూ కొంతమంది అభ్యర్థులు ఆగిపోతున్నారు. వాలంటీర్ల ఎంపిక అంతా వైసిపి నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్న వారంతా నిరాశతో తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది.