తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, అలాగే ప్రస్తుతం టీడీపీ శాసనసభా పక్ష డిప్యూటీ లీడర్ గా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు గురించి కుటుంబ సభ్యులుతో పాటు, సొంత పార్టీ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రాధాన కారణం, ప్రస్తుతం ఆయన ఏ భద్రత లేకుండా ఉండటం. అలాగని ఇంట్లో కూర్చోవటం లేదు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా, సెక్యూరిటీ లేకుండా పర్యటనలు చేస్తున్నారు. దీంతో సొంత పార్టీ నేతలతో పాటు, కుటుంబ సభ్యులు కూడా భయంభయంగా గడుపుతున్నారు. ఒక పక్క నక్సల్స్ ప్రభావం, మరో పక్క వైసీపీ పార్టీ పై ఆయన చేస్తున్న పోరాటం, అసెంబ్లీలో జగన్ పై దూకూడుగా వెళ్ళటం, ఇవన్నీ చూసి, తెలుగుదేశం శ్రేణులకు అచ్చెన్నాయుడు గన్మెన్లు లేకుండా బయటకు వెళ్తున్నారు అంటే భయపడిపోతున్నారు. జగన్ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం పార్టీ నేతలకు సెక్యూరిటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా భద్రత తగ్గించారు.
గడిచిన 35 రోజులుగా అచ్చెన్నాయుడుకు భద్రత లేదు, దీనికి కారణం, ఆయన ప్రభుత్వం పై నిరసన తెలపటం. గతంలో ఆయనకు 4+4 గన్ మేన్ ల భద్రతతో పాటు, స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్, రోప్ పార్టీ, పైలట్ తదితర భద్రత ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, ఆయనకు భద్రత పూర్తిగా తగ్గించి, 2+2 భద్రత కల్పించారు. తరువాత రెండు రోజులకే, అది కూడా తగ్గించి, కేవలం ఒకే ఒక గన్ మేన్ ను కేటాయించారు. ఒరిస్సా , ఆంధ్రా బోర్డర్ లో, నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తి , అందునా ఇప్పటికే నక్సల్స్ టార్గెట్ లో ఉన్న వ్యక్తికీ, కేవలం ఒకే ఒక గన్ మేన్ ను కేటాయించటంతో, అచ్చెన్నాయుడు నిరసన వ్యక్తం చేస్తూ, ఆ ఒక్క గన్ మేన్ ని కూడా తిప్పి పంపించారు. గతంలో ఎర్రన్నాయుడు పై మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు, అలాగే అచ్చెన్నాయుడు పై రెక్కీ నిర్వచించారు. ఇవన్నీ చూసి, ఆందోళన చెందుతున్నారు. పోయిన వారం, కొండల ప్రాంతం అయిన రాంపురం పంచాయతీకి భద్రత లేకుండానే ఆయన వెళ్ళటంతో, పోలీసులు కూడా టెన్షన్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా భద్రత పెంచుతుందో లేదో.