అధికారం చేపట్టాక వైసీపీ నాయకత్వం తొలిసారిగా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఆ పార్టీకి మేలు చేస్తుందా లేక కొత్త తలనొవులు తెచ్చిపెడుతుందా...? ప్రతిపక్షంలో ఉన్నవుడు వలసలు కొనసాగినా పెద్దగా ఇబ్బందులు ఉండవు గానీ అధికారంలోకి వచ్చాక మాత్రం పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అవకాశముంటుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను వైసీపీ నాయకత్వం కూడా ఎదుర్కోనున్నదా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అన్ని పార్టీల లాగా వైసీపీలో కూడా గ్రూవు రాజకీయాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. గతానికి భిన్నంగా ఇవుడు అధికారంలోనున్న నేపథ్యంలో ఈ గ్రూవు రాజకీయాలపై వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పట్టు సాధిస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. గ్రూవు రాజకీయాలపై పూర్తి పరిపక్వతతో వ్యవహరించకపోతే మాత్రం పార్టీ పరిస్థితి కుడి, ఎడమే అవుతుందని కూడా వారు పేర్కొంటున్నారు. రాజకీయ విశ్లేషకుల మాటలకు తగ్గట్టుగానే వైసీపీలో పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. వివిధ పార్టీల నేతలు 2019 ఎన్నిలకు ముందే వైసీపీలోకి భారీగా వలస వచ్చినా నాడు అధికారమే లక్ష్యంగా పార్టీ వర్గాలు పనిచేశాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక నాడు ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి నేత ప్రస్తుతం పదవులను పొందడంపై సమాలోచనలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇది వైసీపీకి గొప్ప విజయమే అయినా దాదావు పదేళ్లకు వరకు ప్రతిపక్షంలో ఉండి సేవ చేసిన నేతలంతా ఇవుడు ప్రభుత్వ పదవులను కోరుతున్నారు.
ఆంద్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు పూర్తవుతున్నా ఆ పార్టీ నేతలు ఇంకా కుదురుకున్నట్లు కనిపించడం లేదు. వైసీపీ లో సీనియర్, జూనియర్ ల మధ్య విభేదాలు తారా స్థాయిలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ నాయకులను సీనియర్ నేతలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని, నియోజక వర్గాల్లో మంత్రి స్థాయి నేతలను కూడా సీనియర్ నాయకులు గౌరవించడం లేదనే చర్చ జరుగుతోంది. ఇవే రాజకీయాలు గ్రూవు తగాదాలుగా మారే అవకాశం ఉందని, నేతల మద్య చిన్నంతరం, పెద్దంతరం తేడా వస్తే పార్టీకే నష్టమనే భావన ఇతర నేతల నుండి వ్యక్తం అవుతోంది. ఇదే అంశం పార్టీ అధినేత, జగన్ మోహన్ రెడ్డి దగ్గర కొంత మంది యువ నాయకులు ప్రస్థావించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంత్రి పదవులకు అడ్డుపడటంలో తమ సొంత పార్టీ నేతలే పైరవీలు చేశారనే ఉద్దేశంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని విశ్వసనీయ సమాచారం. తనకు మంత్రి పదవి కొద్దిలో తప్పిపోవటానికి నాటి సీనియర్ నాయకుడు కారణమంటూ అక్కసు వెళ్లగక్కటం. మంత్రులుగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నేతల పనితీరుపై సీనియర్లు విమర్శలు చేస్తున్నారట. అనంతవురంజిల్లాలో సీఎం పర్యటన విషయంలో ఆ జిల్లాకు చెందిన మంత్రికి ఆ జిల్లా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
అనంతవురంలోని ఆర్ద్ర కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద పాసుల విషయంలో మంత్రి శంకర నారాయణకు, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి మధ్య కొనసాగిన విభేదాలు ఏకంగా సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వరకు సాగిన విషయం తెలిసిందే. ఇక కర్నూలు జిల్లాలలో నందికొట్కూర్ ఎమ్మెల్యే అర్థర్ కు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డికి స్థానికంగా ఉన్న నేథ ఇరిగేల రాంవుల్లారెడ్డికి మధ్య సఖ్యత లేదని విమర్శలున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ విషయంలో నెలకొన్న విభేదాలు కిల్లి కపరాణి, తిలక్ మధ్య ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గన్నవరంలోనూ గ్రూవు రాజకీయాలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ వైసీపీలోకి రావడంపై ఆ పార్టీలో ఇప్పటికే ఉన్న యార్లగడ్డ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇలా కొత్తగా వలస వచ్చిన నేతలకు వైసీపీలో ఇప్పటికే ఉన్న పాత నేతలకు మధ్య సయోధ్య కుదరడమే వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ఎదురయ్యే సవాల్ అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీడీపీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యే వైసీపీలోకి వస్తే అతను తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అదే జరిగితే జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన వలస నేతయే అవుతాడు. అవుడు గతంలో అదే స్థానం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన పాత నేతల సంగతేమిటీ అన్నది ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతున్న చర్చ. ప్రస్తుతం వల్లభనేని వంశీ రాకను యర్లగడ్డ వర్గం వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇదేనని ఆ పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఇక టీడీపీ నుంచి ప్రజా ప్రతినిధులు వస్తే ఈ తంట, సీనియర్ నేతలు వస్తే తమ నామినేటెడ్ పదవులకు మంగళం అన్న ఆందోళన వైసీపీలోని పదవులు ఆశిస్తున్న నేతలకు పట్టుకొన్నట్లు సమాచారం. టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించి బలపడాలని యోచిస్తున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ వలసలకు తెరలేపినట్లు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్న గత ఎన్నికల్లో ఏక పక్ష మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకత్వానకి పదవుల పంపకం పెద్ద సవాల్. ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చే వలస పక్షలకు రాజకీయ వునరావాసం కల్పించే బాధ్యత కూడా జగన్ పైనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వలస వచ్చే నేతలకు ఇప్పటికే పార్టీలో ఉన్న పాత నేతల మధ్య సయోధ్య చేయడం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి సవాలేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలలో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇది సమసి పోకముందే వలసల రూపంలో వచ్చే సవాళ్లను ఏ రీతిలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.